కూడికలు ..తీసివేతలు..


Mon,December 10, 2018 02:39 AM

-బూత్‌ల వారీగా లెక్కలు
-బలాబలాలపై సమీకరణలు
-గెలుపుపై ఎవరికి వారే ధీమా
-సామాజిక సమీకరణలు తమకే అనుకూలమని అంచనాలు
-కొనసాగుతున్న ఉత్కంఠ
-తుది ఫలితాలు తేలేవరకు టెన్షనే
-పెరిగిన పోలింగ్‌పై అనూహ్య అంచనాలు
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: శాసన సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగిసి ఆఖరి అంకం మిగిలింది. పోలింగ్ ముగిసి ఈవీఎంలలో ఓటర్లు ఇచ్చిన తీరు భద్రంగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు కూడికలు.. తీసివేతలతో కుస్తీలు పడుతున్నారు. బూత్‌ల వారీగా పోలింగ్ సరళిని పరిశీలించి లెక్కలు కడుతున్నారు. సామాజిక సమీకరణలు తమకే అనుకూలంగా ఉన్నాయంటూ అంచనాలు వేస్తున్నారు. పెరిగిన ఓటింగ్ తమకు అనుకూలంగా మారి అనూహ్య ఫలితాలు వస్తాయని అభ్యర్థులు అంచనాలు వేసుంటున్నారు. కూడికలు, తీసివేతలు, సమీకరణలు, సామాజిక సమీకరణలు, బూత్‌ల వారీగా ఓటింగ్ నమోదును ఏకీకృతం చేసి లెక్కలు కట్టి గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన నాటి నుంచి అభ్యర్థులు, తమ ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించి గెలుపుపై లెక్కలు కడుతున్నారు. ఇంకా తుది ఫలితాలు వెలువడడానికి మరో 24 గంటలు ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తుది ఫలితం వెలువడే వరకు ఇటు అభ్యర్థుల్లో అటు పార్టీ శ్రేణుల్లో టెన్షన్ కనిపిస్తోంది.

బూత్‌లవారీగా లెక్కలు
గెలుపోటములపై అభ్యర్థులు బూత్‌ల వారీగా లెక్కలు కడుతున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గ పరిధిలో ఉన్న 690 పోలింగ్ బూత్‌లలో నమోదైన ఓట్ల వివరాలతో అభ్యర్థులు గెలుపు లెక్కలు కడుతున్నారు. తమకు పట్టు ఉన్న పోలింగ్ బూత్‌లలో జరిగిన పోలింగ్ వివరాలను తెలుసుకుని తమకే గెలుపు అంటూ అంచనాలకు వస్తున్నారు. ఎక్కువ పోలింగ్ శాతం నమోదైన బూత్‌లతో పాటు తక్కువగా పోలింగ్ నమోదైన వివరాలను సేకరించి వాటిపై అంచనాలు కడుతున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొనడంతో తమకే గెలుపు అవకాశాలని అభ్యర్థులు ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు.

సామాజిక సమీకరణలు
పోటీల్లో నిలిచిన అభ్యర్థులు సామాజిక సమీకరణలతో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సామాజిక వర్గాలపై ఆశలు పెంచుకున్న అభ్యర్థులు తమను గెలుపు తీరానికి చేరుస్తాయని భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఆయా సామాజిక వర్గాలు తమకే అనుకూలంగా ఓట్లు వేశారని అంచనాలు వేస్తున్నారు. ఎక్కడ పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న సామాజిక వర్గాల సమీకరణలు చేసుకుంటూ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా అభ్యర్థులు కూడికలు, తీసివేతలు, సమీకరణలు చేసుకుంటూ గెలుపు అంచనాలకు వస్తున్నారు.

పెరిగిన పోలింగ్.. అనూహ్య అంచనాలు
2014 ఎన్నికల కంటే 2018 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం వలన అనూహ్య ఫలితాలు వస్తాయని అంచనాలు వేస్తున్నారు. పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలమంటూ అభ్యర్థులు అంచనాలు వేస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజవకర్గంలో 2014 ఎన్నికల్లో 56.83 పోలింగ్ శాతం నమోదు కాగా 2018 ఎన్నికల్లో 58.29 పోలింగ్ శాతం నమోదైంది. దీంతో 1.46 శాతం ఈ ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ అయింది. వరంగల్ తూర్పులో మాత్రం 2014లో కంటే 2018లో 1.96 పోలింగ్ శాతం తగ్గింది. 2014లో 74.49 నమోదు కాగా 2018లో 72.86 పోలింగ్ శాతం నమోదైంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కంటే ఈసారి 5.56 శాతం ఎక్కువగా పోలింగ్ జరిగింది. 2014 ఎన్నికల్లో 77.81 శాతం నమోదు కాగా 2018లో 83.37 పోలింగ్ శాతం నమోదైంది. అయితే పెరిగిన ఓటింగ్ తమకే అనుకూలమంటూ అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు.

మరో 24 గంటలు టెన్షన్..
తుది ఫలితాలు వెలువడటానికి మరో 24 గంటలు మిగిలి ఉండడంతో అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉన్నప్పటికీ తుది ఫలితాలు తేలేదాకా టెన్షన్ టెన్షన్‌గానే ఉంటున్నారు. ఓటర్ల తీర్పు స్ట్రాంగ్ రూంల్లోని ఈవీఎంల్లో నిక్షిప్తం కాగా అభ్యర్థులు మాత్రం తమ భవితవ్యం కోసం టెన్షన్‌గా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులే కాకుండా పార్టీ నాయకులు, శ్రేణుల్లో తుది ఫలితాల కోసం టెన్షన్ పడుతున్నారు.

434
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...