లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలి


Mon,December 10, 2018 02:38 AM

-తూర్పు రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్
వరంగల్, నమస్తేతెలంగాణ: ఓట్ల లెక్కింపు చేపట్టే అధికారులకు లెక్కింపు ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని తూర్పు రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ అన్నారు. ఆదివారం కుడా కాన్ఫరెన్స్ హాల్‌లో ఓట్ల లెక్కింపు అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెక్కింపు సూపర్‌వైజర్లు ఓట్ల లెక్కింపు బాధ్యులుగా ఉంటారని, లెక్కింపు సహాయకులు వారికి సహకరిస్తారని చెప్పారు. మంగళవారం మార్కెట్ యార్డులోని గోదాం నెం-3లో వరంగల్ తూర్పు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు చేపడతారని, లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఉంటాయని, ప్రతి టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్, లెక్కింపు సూపర్‌వైజర్, లెక్కింపు సహాయకులు ఉంటారని, ఇద్దరు చొప్పున అదనంగా నియమించి రిజర్వ్‌లో ఉంచుతామన్నారు. నియోజకవర్గ పరిధిలోని 215 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 15,16 రౌంట్లలో ఐదు టేబుళ్లతో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని, దీంతో తూర్పు నియోజకవర్గ లెక్కింపు పూర్తవుతుందన్నారు. లెక్కింపు సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మైక్రో అబ్జర్వర్లు, బెల్ ఇంజినీర్లు, లెక్కింపు సూపర్‌వైజర్లు, లెక్కింపు సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

లెక్కింపు ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలి
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని తూర్పు రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం ఏనుమాములలోని ఎమ్మెల్యే పాయింట్ గోదాం నెం.3లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తున్న టేబుళ్లు, భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతరులు ప్రవేశం, నిష్క్రమణపై సూచనలు చేశారు. ఈవీఎంల భద్రతపై పరిశీలనకు అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులు ఉండవచ్చని, లెక్కింపు కేంద్రం బయట సీసీ టీవీ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఇందుకు పేర్లు పంపించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రానికి స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల ప్రహారా వరకు అనుమతిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ నర్సయ్య, ఈటీబీపీ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ జస్మిత్ భూపాల్, బల్దియా అదనపు కమిషనర్ నాగేశ్వర్, నేషనల్ హైవే డీఈ శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏజెంట్ల పేర్లు నమోదు చేసుకోవాలి
ఓట్ల లెక్కింపు కోసం రాజకీయ పార్టీలు తమ ఏజెంట్ల పేర్లను సమర్పించాలని తూర్పు రిటర్నిం గ్ అధికారి వీపీ గౌతమ్ అన్నారు. ఆదివారం సా యంత్రం కుడా కార్యాలయంలో రాజకీయ పార్టీ ల ప్రతినిధులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తామని, ఒక రౌండ్‌కు 14 ఈవీఎంల లెక్కింపు చేపడతామని అన్నారు. టేబుల్‌కు ఒక ఏజెంట్ చొప్పున రాజకీయ పార్టీలు ప్రతినిధుల పేర్లను అందజేయాలని అన్నారు. ఈవీఎం స్ట్రాంగ్ రూం ల వద్ద మూడంచల భద్రత చేశామన్నారు. నిఘా ఉంచాలనుకుంటే ఒక్కో అభ్యర్థి ఒక్కో ప్రతినిధి పేరు ఇవ్వాలన్నారు. బయట ఏర్పాటు చేసిన సీసీ టీవీలో ఈవీఎంల భద్రతను పరిశీలించవచ్చని ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు.

356
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...