ఓరుగల్లుకు వంద టీఎంసీలు


Tue,November 20, 2018 06:04 AM

-దేవాదులతో సస్యశ్యామలం చేస్తాం..
-కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ కరెంట్ కోతలే
-వారి హయాంలో కుంభకోణాలు
-డబుల్ కల నెరవేరుస్తాం..
-ఎర్రబెల్లి గెలుపు ఖాయమైంది
-పాలకుర్తి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
వరంగల్ ప్రధాన ప్రతినిధి / జనగామ జిల్లా ప్రతినిధి / నమస్తే తెలంగాణ: వరంగల్ చరిత్ర గతిని మార్చి భవిష్యత్ సస్యశ్యామల జిల్లాగా మారబోతున్నది. దేవాదుల ద్వారా వరంగల్‌కు 100 టీఎంసీల గోదావరి జలాలు ఇచ్చి ప్రతీ ఎకరాకూ నీళ్లు ఇస్తం. ధన సంపత్తిగా తెలంగాణను మార్చి ఆ సంపదను ప్రజల సంక్షేమానికి వినియోగిస్తం. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ కరెంటు కోతలు పునరావృతం అవుతయ్. ఆ పార్టీ హయాంలో అన్నీ కుంభకోణాలు, లంబకోణాలు జరిగినయ్. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెలగబెట్టిన గృహ నిర్మాణ శాఖలో రూ. 5వేల కోట్ల అవినీతి జరిగె. మేం పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తం. సొంత జాగలో ఇళ్లు నిర్మించుకునేవారికి వందశాతం సబ్సిడీ ఇప్పిస్తం. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నం. కాంగ్రెస్ జమానాలో కట్టించిన ఆరేడు ఇండ్లకు, మనం కడుతున్న ఒక డబుల్ బెడ్రూం ఇల్లు సమానం. రైతుబంధును చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతున్నది. ఐక్యరాజ్యసమితి మనల్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. చంద్రబాబునాయుడు ఇవాళ ప్రపంచ మేధావిగా తయారైండు. అందరూ కలిసి తెలంగాణను 30, 40 ఏండ్లు ఎలగబెట్టినోళ్లే. ఆ పాటి ఘనాపాఠీలు మళ్లా మోపైండ్రు. వాళ్ల ఆటలు సాగవు. సుదీర్ఘకాలం కడుపు కట్టుకొని ఉద్యమాలు చేసి అకుంఠిత దీక్షతో తెలంగాణను సాధించినం. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా, మొక్కవోని దీక్షతో తెలంగాణ బాగు కోసం కష్టపడుతున్నం. ఈ ఎన్నికల్లో మళ్లీ మనమే వస్తున్నం. రావాలె. మనం చేయాల్సిన పనులు అనేకమున్నయ్.

కొనసాగుతున్న పనులు పూర్తి చేసుకోవాలె. ప్రజలు ఆలోచన చేయాలె. ప్రపంచానికే తెలంగాణ ఆదర్శమై, అనేక రాష్ర్టాలకు స్ఫూర్తినిస్తుంటే కళ్లుమండిన కాంగ్రెస్ టీడీపీతో జత కట్టి మళ్లా తెలంగాణను ఆగం చేయాలని చూస్తాంది. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ కరెంటు కష్టాలు తప్పవు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలకుర్తి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ఎర్రబెల్లి దయాకర్‌రావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడే దయాకర్‌రావు లాంటి వాళ్లు కావాలి. అది ప్రజలు గుర్తించాలని ఈ సభ తేల్చివేసింది. ఆయన గెలుపు తెలిసిపోయిందని సీఎం ప్రకటించారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల శంఖాన్ని పూరించారు. ఓ వైపు మహా కూటమిపై నిప్పులు చెరుగుతూనే మరోవైపు నాలుగున్నరేళ్లుగా తెలంగాణ అభివృద్ధి సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ మేరకు కష్టపడిందో..? ఎట్ల కడుపు కట్టుకొని అహర్నిశలు పనిచేస్తున్నదో ప్రజలకు వివరించారు. ఈటెల్లాంటి మాటలతో మహా కూటమిపై నిప్పులు చెరుగుతూ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అనివార్యతను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనాత్మక ఉద్బోతతో ప్రజల్లో జోష్ కనిపించింది. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భవిష్యత్ తెలంగాణ ప్రగతి చిత్రపటాన్ని ఆవిష్కరించింది. ప్రజల కేరింతలు, హర్షద్వానాల మధ్య కేసీఆర్ ప్రసంగం సాగింది. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రజల ముందు ఉంచారు. ముఖ్యమంత్రి పేర్కొన్న అంశాలు, టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అనివార్యతల నేపథ్యాన్ని వివరించారు. ఆ ప్రసంగం సీఎం కేసీఆర్ మాటల్లోనే.

ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పది గ్రామీణ నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున పది లక్షల ఎకరాల సాగుకు వంద టీఎంసీల నీళ్లు రాబోతున్నయ్. గోదావరి నుంచి దేవాదుల ద్వారా, మల్కాపూర్ లింగంపల్లి రి జర్వాయర్‌తో వరంగల్ సస్యశ్యామలం కాబోతున్నది. 10.78టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించే మ ల్కాపూర్ రిజర్వాయర్ వరంగల్ దశా, దిశను మార్చబోతున్నది. తెలంగాణ వ్యవసాయ రంగ పురోగాభివృద్ధి గు రించి ప్రపంచ దేశాలు, దేశంలోనే అన్ని రాష్ర్టాలు గొప్పగా మాట్లాడుతున్నయ్. కానీ, ఇక్కడి వాళ్లకు అవేమీ పట్టవు. కాంగ్రెస్ తన పాలనలో ఎక్కడా చూసినా కుంభకోణాలు, లంభకోణాలే. సాగునీటి రంగానికి దిశానిర్దేశం చేసే మహత్తర ప్రాజెక్టుల నిర్మాణం సాగుతుంటే కాంగ్రెస్ కావాలనే అడ్డుకుంటున్నది. దాంతో టీడీపీ జత కట్టింది. ఈ రెండూ కలిసి ఇవా ళ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చినయ్. ప్రాజెక్టులను అడ్డుకున్నందుకు ఈ ఇద్దరు దొంగలకు ఓటు వెయ్యాల్నా? ప్రపంచమే అబ్బురపడేలా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నం. ఎకరాకు రెండు పంటలకు రూ.8వేలు ఇచ్చి, దాన్ని రూ.10వేలకు పెంచినం. రైతుబంధు పథకం గొప్పదని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. దీన్ని ఎలా అమలు చేస్తున్నరో చెప్పేందుకు మనల్ని ఆహ్వానించింది. మనం ఈ రకంగా అభివృద్ధి చేస్తూంటే కాంగ్రెస్‌కు కండ్లు మండుతున్నయ్. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లా కరెంటు కోతలు తప్పవు. చంద్రబాబు ప్రపంచ మేధావిగా మాట్లాడుతున్నడు. ప్రపంచంలో ధనవంతులైన రైతులు ఎక్కడ ఉన్నరంటే తెలంగాణలోనే అని చెప్పుకునే రోజులు రావాలె. అందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తేవాలె. ప్రజలకు చెప్పేది ఇదొక్కటే.

ధనసంపత్తిగా తెలంగాణ
తెలంగాణ ధనసంపత్తిగా మారాలనేదే నా కల. దానికోసమే అందరం కడుపు కట్టుకొని కష్టపడి పని చేస్తున్నం. కాంగ్రెస్ పదేళ్ల కాలంలో ఒక్క ఇసుక(ఉసికె) మీద ఆదాయం కేవలం 9.56కోట్లు. నాలుగున్నరేళ్లలో మనం తెచ్చిన ఆదాయం రూ.2వేల57 కోట్లు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ సుభాష్‌రెడ్డి ఇక్కడే ఉన్నాడు. ఆయన్ను అడుగుండ్రి. మనం సంపద పెంచుతున్నం. ఆ సంపదను తిరిగి ప్రజలకే ఖర్చుపెడుతున్నం. వారి అభివృద్ధి సంక్షేమమే ఎజెండాగా మీ బిడ్డలం ముందుకు సాగుతున్నం. రూ.43వేల కోట్లతో దేశంలో ఎవరూ చేయలేని సంక్షేమ పథకాలను అమలు చేసినం. డంబాచారాలు కాదు.. ఆసరా పింఛన్లు మీ కళ్ల ముందే ఉన్నయి. ఇదే వరంగల్ జిల్లా ములుగులో ఓ తండాలో జరిగిన అగ్ని ప్రమాద బాధిత ఆర్తి వెనుక ఉన్న స్ఫూర్తితో కల్యాణలక్ష్మి అనే గొప్ప పథకం పుట్టింది. రైతులకు దేశంలో 24గంటల ఉచిత కరంటు ఇస్తున్న రాష్ట్రం ఏదీ లేదు. అంగన్‌వాడీలకు, ఆశ వర్కర్లకు దేశంలో తెలంగాణలోనే అత్యధిక జీతాలు ఇస్తున్నం. ట్రాఫిక్ పోలీసుల కష్టాన్ని చూసి 30శాతం రిస్క్ అలవెన్సులు ఇస్తానం. హోంగార్డులకు భారీగా జీతాలు పెంచినం. సంపద పెంచే తెలివి, నీతి నిజాయితీగా కష్టపడి పని చేసే తెలివి టీఆర్‌ఎస్ పార్టీకే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, టీడీపీ ఏం పొడుగు చేసినయో మీకు తెలుసు. మనం అట్ల కాదు. సంపదను పెంచి, సంక్షేమానికి ఖర్చుపెడుతున్నం. ఇది మన ఆర్తి, మన భవిష్యత్. తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే మాకు కావాల్సింది.
నియోజకవర్గానికో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
భవిష్యత్‌లో ఏ పంటలు ఎక్కడ వేయాల్నో నిర్ణయించి స్థానిక మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తం. స్థానికంగా ఉన్న మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తం. ఐకేపీ సిబ్బందికి ఇది మరింత ప్రయోజనం చేకూరేలా చేస్తది. వారిని పర్మినెంట్ చేస్తం. జీతాలు పెంచుతం.

164
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...