హోరెత్తనున్న ప్రచారం..


Sat,November 17, 2018 02:19 AM

-ఉమ్మడి వరంగల్ జిల్లాలో గులాబీ దళపతి కేసీఆర్ పర్యటన
-19న పాలకుర్తిలో బహిరంగ సభతో ప్రచారం షురూ..
-23న నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ
-ఆనందోత్సాహాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: ఎన్నికల నామినేషన్‌ల ప్రక్రియ ముగుస్తున్న తరుణంలో ఇక ప్రచారం హోరెత్తనున్నది. టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉమ్మడి జిల్లాలో విస్తృత పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రతిపక్షాలు అభ్యర్థుల ఖరారులో కొట్లాడుకుంటుంటే గులాబీ దళపతి ప్రజాక్షేత్రంలో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఒకేరోజు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటనకు వ్యూహరచన చేశారు. నామినేషన్ల పర్వం ముగింపు రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. 19న పాలకుర్తి నియోజకవర్గంలో ప్రచారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బోణీ కొట్టి ఆ తరువాత 23న నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. రెండు నెలల క్రితమే అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ఇప్పటికే నియోజకవర్గాలలో రెండు, మూడు దఫాలుగా ఇంటింటి ప్రచారాన్ని పూర్తి చేశారు. ఇక అధినేత కేసీఆర్ జిల్లాలో పర్యటనతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఒకే రోజులో ఎక్కువ నియోజకవర్గాలలో సభలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పిన గులాబీ అధినేత ఆ దిశలోనే తన కార్యాచరణను రూపొందించుకున్నారు.

కాంగ్రెస్ రోడ్ షోలు..
కాంగ్రెస్ పార్టీ తమ అధినేతలను జిల్లా ప్రచారానికి తీసుకురావాలని భావిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీతో రోడ్ షోలు నిర్వహించేలా అధిష్టానాన్ని ఒప్పించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఒక వైపు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాలో విస్తృత పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచార పర్వాన్ని హోరెత్తించనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కనీసం రెండు, మూడు నియోజకవర్గాలోనైనా కాంగ్రెస్ అధినేతల ప్రచారం ఉండేలా జిల్లా నాయకత్వం సమాలోచనలు చేస్తున్నది. భారీ బహిరంగ సభలు లేకున్నా కనీసం నగర ప్రాంతంలోనైనా అధినేత రాహుల్‌గాంధీ రోడ్ షోలు ఏర్పాటు చేసేందుకు వ్యూహరచనకు సిద్ధమయ్యారు. మొత్తంగా ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో హోరెత్తబోతున్నది. అధినేతల రాక, ముమ్మరమైన ఎన్నికల ప్రచారానికి సంకేతంగా నిలుస్తున్నది.

చంద్రబాబూ.. ప్రచారానికి వద్దు
తమ అధినేత ప్రచారం చేస్తే గెలుపు నల్లేరు మీద నడకవుతుందని ఏ పార్టీ అభ్యర్థి అయినా అనుకుంటారు. కానీ, టీడీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత పర్యటనకు సిద్ధమవుతుంటే మరోవైపు తెలుగు తమ్ముళ్లు మాత్రం తమ అధినేత చంద్రబాబు ప్రచారానికి వస్తే తమ కొంప మునుగుతుందని బెంబేలెత్తుతున్నారు. గతంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఉప ఎన్నికల్లో కానీ, పరకాల ఉప ఎన్నికల్లోఅయితే టీడీపీ ఏ వ్యూహాన్ని అయితే అనుసరించిందో ఇప్పుడూ అదే వ్యూహాన్ని అనుసరించబోతున్నదా..? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు పాదాల దగ్గర తాకట్టు పెట్టారనే కోపంతో ఇక్కడి తెలుగుదేశం పార్టీపైనా ఆరోపణలున్నాయి. ఈ తరుణంలో చంద్రబాబు ప్రచారానికి వస్తే మరింత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని, అందునా వరంగల్ వంటి పోరుఖిల్లాలో తను రాకపోతేనే మంచిదనే అభిప్రాయంతో తెలుగు తమ్ముళ్లు ఉన్నట్టు భావిస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సైతం దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కూటమీయుల మనోగతంగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

194
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...