మహా సెగలు


Thu,November 15, 2018 02:21 AM

-కూటమిలో సర్దుబాటు సమరం
-కొలిక్కిరానివి కొన్ని
-తేలనివే అన్నీ..
-టీజేఎస్ తేల్చుకున్న 12 స్థానాల్లో నాలుగు ఇక్కడివే
-కాంగ్రెస్‌లో ముదురుతున్న వివాదం
-బీజేపీలోనూ అదే సీన్
-ఎన్నికలకు ఎన్నికలకూ నడుమ పొన్నాల
(వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ) : కూటమిలో మహాగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పొసగని పొత్తులతో అభ్యర్థులు పోరుబాట పడుతున్నారు. పార్టీ గీర్టీ జాన్తా నై, అంటూ బస్తీమే సవాల్ చేస్తున్నారు. సమరానికి సై అని కాలుదువ్వుతున్నారు. పొత్తు ధర్మం లేదు పోరు ధర్మమే అంటూ తెగేసి చెబుతున్నారు. ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు జరిగి పార్టీలు అభ్యర్థులను ప్రకటించినా అధిష్ఠానాన్ని దిక్కరించి బరిలో ఉండేందుకు సిద్ధపడుతున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. ఇచ్చుకపోయే పొత్తు.. ఇగురంలేని పొత్తు. పొత్తుంటేంది.. లేకుంటేంది అన్నట్టు కాంగ్రెస్, టీజేఎస్ నుంచి టికెట్లు ఆశించిన వాళ్లు, బీజేపీ నుంచి పేర్లు ప్రకటించిన వాళ్లు. ఇలా ఎవరి దారి వారిదే అన్నట్లు పరిస్థితి తయారైంది. తాము రాష్ట్ర వ్యాప్తంగా 12 స్థానాల్లో పోటీ చేస్తామని టీజేఎస్ స్థానాలను ప్రకటించగా, అందులో నాలుగు ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గాలే కావడం విశేషం. కూటమీయులు దీన్నే ఫ్రెండ్లీ కాంటెస్ట్ అంటున్నారు. టీఆర్‌ఎస్ మినహా అన్ని పార్టీల్లో అభ్యర్థుల మధ్య అనైక్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తుండగా, ఎవరికి వారు పోటాపోటీగా సత్తా చాటేందుకు సమాయత్తం అవుతున్నారు.

ఎన్నికలకు ఎన్నికలకూ మధ్య పొన్నాల
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి అధ్వానంగా తయారైంది. టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్లుగా చేసిన అభివృద్ధికి, పొన్నాల సుదీర్ఘకాలం చేసిన అభివృద్ధికి తేడాను జనం గమనిస్తూనే ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడారి ప్రాంతంగా పేరున్న బచ్చన్నపేట, మద్దూరు, నర్మెట వంటి ప్రాంతాలకు టీఆర్‌ఎస్ హయాంలో రెండు పంటలకు నీళ్లు వస్తున్నాయి. అభివృద్ధి సంక్షేమ పథకాలతో నియోజకవర్గ ముఖచిత్రమే మారింది. ఈ నేపథ్యంలో పొన్నాలకు రెండో జాబితాలోనూ టికెట్ కేటాయించకపోవడంపై ఆయన వర్గీయులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అరే ఓడిపోతడా? గెలుస్తడా కాదు ఏదో తేల్చితే బాగుండని చర్చ పెడుతున్నురు. ఈ సందర్భంలో టీజెఎస్ తాము పోటీచేసే స్థానాలను బుధవారం ప్రకటించింది. అందులో జనగామ ఉంది.

పొన్నాల ఢిల్లీకి వెళ్లినా ప్రయోజనం లేకపోయిందని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌లో మునుపెన్నడూ లేనివిధంగా బీసీలను రెడ్లు తొక్కేస్తున్నారని, అందుకే పొన్నాలకు సీటు గ్యారెంటీ లేకుండా పోతున్నదనే చర్చ సాగుతున్నది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు బీ-ఫారాల మీద సంతకం చేసిన పొన్నాల లక్ష్మయ్యకు ఇప్పుడు పార్టీ బీ-ఫాం కరువైందనే మాట వినిపిస్తున్నది. తాను కాంగ్రెస్ ఉగ్రవాదిని అంటూ ప్రకటించుకున్న పొన్నాల లక్ష్మయ్యకే దిక్కులేకుండా పోయిందని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. అసలాయన జనగామకు చేసింది ఏమిటని వ్యతిరేకవర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జనగామ నుంచి తాము పోటీచేస్తామని టీజేఎస్ ప్రకటించింది. సీటు తనకే వస్తుందని నమ్మిన పొన్నాల లక్ష్మయ్య రెండో జాబితాలోనూ పేరులేకపోవడంపై తీవ్ర మనస్థాపానికి గురైనట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు.

ప్రకటించిన స్థానాల్లో కొరవడిన స్పష్టత
కాంగ్రెస్ ప్రకటించిన స్థానాల్లో స్పష్టత కరువైందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ రెండూ రెండుగానే వ్యవహరిస్తున్నాయి. కలిసి ప్రచారం చేయాల్సిన నాయకులు కలహించుకుంటూ వేర్వేరుగా నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. వరంగల్ పశ్చిమ నుంచి పొత్తుల్లో భాగంగా టీడీపీకి వెళితే ఆ పార్టీ నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి తన వర్గీయులతో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కోరుతున్నారు. కానీ, మిత్రపక్షమైన కాంగ్రెస్ టికెట్ ఆశించిన నాయిని రాజేందర్‌రెడ్డి కానీ, ఆయన వర్గీయులు కానీ కలవలేదు. కనీసం సమాచారం ఇవ్వడంలేదని, అప్పుడే పొత్తుల కత్తులు దూసుకుంటున్నారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి టీడీపీ బలంతోనే పోటీ చేస్తే మంచిదేనని, తమ అవసరం లేదుకనుకనే తమను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు చిన్నబుచ్చుకుంటున్నారు. నాయిని రాజేందర్‌రెడ్డికి న్యాయం జరగాల్సిందేనని రేవూరి ప్రకాశ్‌రెడ్డి నోటితో చెబుతూనే నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటప్పుడు కలిసి ఎలా పనిచేస్తాం.. పొత్తు ధర్మాన్ని ఎలా పాటిస్తాం అని కాంగ్రెస్ శ్రేణులు ప్రకాశ్‌రెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ టికెట్ అధికారికంగా ఇందిరకు కేటాయించినా అదే పార్టీ నుంచి మాదాసి వెంకటేశ్ బరిలో దిగుతున్నారు. ఇక్కడి నుంచే టీడీపీ అభ్యర్థి బరిలో ఉండబోతున్నారు. టీజేఎస్ ఇక్కడి నుంచి పోటీ చేస్తామని ప్రకటించింది. ఇట్ల ప్రకటించిన నియోజకవర్గాల్లో స్పష్టత కొరవడింది. ప్రకటించని స్థానాల్లో ప్రతిష్ఠంభన నెలకొంది.

ఉమ్మడి జిల్లాలో టీజేఎస్ నాలుగు స్థానాల్లో..
తెలంగాణ జనసమితి పార్టీ, కాంగ్రెస్ తమ అభిప్రాయాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవడంలేదని, పొత్తులకు పిలిచి తమను చిత్తు చేసేందుకు ఎత్తుగడ వేసిందని భావిస్తోంది. అందులో భాగంగానే తాము 12 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ప్రకటించిన 12 స్థానాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగు స్థానాలు ఉండడం విశేషం. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు ఈ నాలుగు చోట్ల నుంచి తాము పోటీ చేస్తామని జాబితా నేడో, రేపో ప్రకటిస్తామని బుధవారం పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ తర్వాత రాజకీయంగా వరంగల్‌కు ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని రెండు స్థానాల్లో కనీసం ఒక్కటైనా కాంగ్రెస్‌కు దక్కాలని భావిస్తుంది. వరంగల్ పశ్చిమ ప్రకటించారు గనుక వరంగల్ తూర్పు నుంచి బరిలో ఉండాలని భావిస్తున్నది.

ఇక్కడ అభ్యర్థి ఎవరన్నది స్పష్టత రావాల్సి ఉంది. ప్రాథమిక ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలపై ఆశ పెట్టుకున్న ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర అక్కడ కాంగ్రెస్ రెండు స్థానాలు తనకు దక్కకపోవడంతో వరంగల్ తూర్పు ఇస్తే పోటీ చేస్తానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే స్థానం నుంచి మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ ఆశలు పెట్టుకున్నారు. అసలు టీజేఎస్ కేటాయించే సీట్లలో మొదటి సీటు వరంగల్ తూర్పు తనకే అని ఇన్నారెడ్డి ప్రచారంలోకి దిగారు. వర్ధన్నపేట నుంచి పగడిపాటి దేవయ్య, స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి చింత స్వామి, జనగామ నుంచి ప్రొఫెసర్ కోదండరాం లేక మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వర్ధన్నపేటలో తాను పోటీ చేసి తీరుతానని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. అసలు టీజేఎస్‌కు బలమెంత? వారి క్యాడర్ ఎంత? అని కాంగ్రెస్ టీజేఎస్‌ను తీసిపారేస్తున్నది.

192
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...