6, 8, 9, 10 మల్ల 14 అట..!


Sun,November 11, 2018 05:24 AM

-కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకనట తేదీలు
-మహాకూటమికి బీటలు
-ఆశావహుల్లో గందరగోళం
-ఇంటికే బీ-ఫారాలంటే ఇదేనా?
-కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్న నేతలు
-గెలవలేమనే ఆలస్యమా? నేతల్లో నైరాశ్యం
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ:132 ఏండ్ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ కనీసం 132 గంటల ముందైనా అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితి నెలకొన్నది. ఇది ఆ పార్టీతో టీఆర్‌ఎస్ వర్గాలు చేస్తున్న ఆరోపణ కాదు. ఏకంగా ఆ పార్టీలో వ్యక్తం అవుతున్న మెజారిటీ అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంత దయనీయమైన పరిస్థితి ఏ ఎన్నికల్లో చూడలేదనేది ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్న నైరాశ్యం. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీరెవరూ గాంధీభవన్‌కు రావొద్దు? నేరుగా పార్టీ అభ్యర్థుల బీ-ఫామ్స్ మీ ఇంటికే వస్తాయి అంటే ఏమిటో అనుకున్నాం కానీ ఇంతటి జాప్యం చేస్తారని అనుకోలేదని కాంగ్రెస్ ఆశావహులు తీవ్ర నైరాశ్యానికి లోనవుతున్నారు. అంతేకాదు అసలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీచేయాలనే ఉద్దేశం లేనట్టుంది. అదే ఈ జాప్యానికి కారణంగా కనిపిస్తుందనే వాదన ఆ పార్టీలో బలంగా వినిపిస్తున్నది. మరోవైపు మహాకూటమికి బీటలు వారబోతున్నాయా? అసలు పొత్తు ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ శనివారం హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ మా నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తాం అని పేర్కొనడమే ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతున్నది.

* 6 , 8, 9, 10 మల్లా 14..?
6 , 8, 9, 10 ఇదేదో గేమ్‌లో స్కోర్‌కాదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్ది అండ్ కో తమ పార్టీ నుంచి ఎన్నికల్లో ఎవరు పోటీచేస్తారో ప్రకటిస్తామని చెప్పిన తేదీలు. కానీ ఉన్నపళంగా శనివారం సాయంత్రం అమరావతి వయా ఢిల్లీ నుంచి హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి అభ్యర్థులను ఈనెల 14న ప్రకటిస్తామని లీకు ఇచ్చింది. ఈనెల 12న ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అయి చర్చించి తెలంగాణ రాష్ట్రంలో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి అని లీకు. నిజానికి పార్టీ రాష్ట్ర బాధ్యుడు ప్రకటించిన తేదీలకు విలువ ఉంటుంది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందనే నైరాశ్యం కాంగ్రెస్ ఆశావహుల్లో నెలకొన్నది. ఇంతకీ ఈనెల 14నాడైనా ప్రకటిస్తారా? లేదా అని కాంగ్రెస్ నాయకుల్లో అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. మహాకూటమిలో భాగస్వామ్య పార్టీల సీట్లు సర్దుబాటు అయింది కదా? అభ్యర్థుల్ని ప్రకటిస్తే కనీసం వారం పదిరోజులైనా అసమ్మతిని సమ్మతి దారి పట్టించుకోవచ్చు అనుకుంటే ఆ అవకాశం కూడా తమకు లేకుండాపోతుందని ఆశావహులు పార్టీ తీరుపై మండిపడుతున్నారు. లేదు కనీసం ఫలానా నియోజకర్గం నుంచి నువ్వే బరిలో ఉంటావు క్షేత్రస్థాయిలో నీ పని నువు చేసుకో అని కనీసం ఏ నియోజకర్గంలోనైనా ఎవరికైనా చెవులో అయినా చెప్పిండ్లా అంటే అదీలేదట. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదులుకాబోతుంది. కనీసం ఇప్పుడైనా ప్రకటించకపోతే తమ బతుకేం కాను అసలు పోటీచేయాలా? వద్దా? కనీసం నాలుగైదు కొత్త జత బట్టలైనా కుట్టించుకునే అవకాశం లేకుండాపోతుందే అని కాంగ్రెస్ ఆశావహులు తమ పార్టీ దుస్థితిపై వారిలో వారే సెటైర్లు వేసుకుంటున్నారట. అసలింతకీ కాంగ్రెస్ పార్టీ పోటీచేస్తుందా? లేదా అనుమానంగా ఉంది అని స్వయంగా ఆ పార్టీ కేడర్‌లోనే అనుమానాలు రేకెత్తించేలా పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయనే ఆసక్తికర చర్చ సాగుతున్నది.

* కొంపతీసి పోస్టల్ డిలే అయితే...
మీరెవరూ అధైర్యపడకండీ. హైదరాబాద్‌లోని గాంధీభవన్ చుట్లో లేదా ఢిల్లీ అధిష్టాన వర్గం ఆశీస్సుల కోసం ఎవరూ తిరగొద్దు. పక్కా సర్వే చేశాం. ఆ సర్వేలో మెరుగైన ప్రతిభ కనబరచిన అభ్యర్థిని ప్రకటిస్తాం. ప్రకటించడమే కాదు పోటీచేసే అభ్యర్థుల ఇండ్లండ్లకే పార్టీ బీ ఫామ్స్ పంపిస్తాం అని లోగడ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన విషయాన్ని కాంగ్రెస్ ఆశావహులు గుర్తుచేసుకుంటున్నారు. దీనిపైనా సెటైర్లు వేసుకుంటున్నారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభ్యర్థులకు బీ-ఫామ్స్ ఇంటికే వస్తాయని లోగడ ప్రకటించారు. కొంపతీసి ఈ లెక్కన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటమీద నిలబడి నేరుగా అభ్యర్థుల ఇండ్లండ్లకే పంపిస్తానన్నారు. ఒకవేళ పోస్టల్ డిలే అయితే మా పరిస్థితి ఏమిటీ? ఒకవేళ ఢిల్లీ నుంచో లేదా హైదరాబాద్ గాంధీభవన్ నుంచో కొరియర్ చేస్తే పరిస్థితి పార్శల్ డిలే అయితే ఇన్నాళ్లు పార్టీ సింబల్ వస్తుందని ఆశపడి అన్ని ఏర్పాట్లు చేసుకొని రంగంలో ఉంటే తీరా పోస్టల్ డిలే అయితే ఎట్ల అని ఆశావహులు తమ పార్టీ దుస్థితిపై వారికి వారే సైటైర్లు వేసుకుంటున్నారట. గింత దరిద్రం తామెప్పుడూ చూడలేదు. ఉత్తమ్‌కుమారెడ్డి, చంద్రబాబు కలిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేయకుండా కుట్రలు చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానిస్తున్నారు.

* సీట్లు..స్వీట్లు
ఈ ఎన్నికల్లో బాగా పాపులర్ అయిన ఎన్నికల నినాదం ఇదీ. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభల్లో భాగంగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల సందర్భంగా మంత్రి కేటీఆర్ మహాకూటమిపై చేసిన వ్యాఖ్య నిజం అవుతుందో ఏమో అని కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ వంటి పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిలో ఇంకా సీట్ల పంపకాలు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. అది వస్తుందో రాదో కూడా అనుమానంగా ఉంది. ఇటువంటి తరుణంలో మహాకూటమి సీట్లు పంపకాలు చేసుకునేలోగా టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో నిలిచి గెలిచి స్వీట్లు పంచుకుందాం అని మంత్రి కేటీఆర్ ఏ ముహూర్తాన అన్నడో ఆయన అన్నట్టే మాపార్టీ నాయకులు వ్యవహరిస్తున్నరు అని కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ సాగుతుంది. అంతేకాదు మాకే పజాబలం ఉంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని పేరుగొప్పగా ప్రకటించే తమ నాయకులు అభ్యర్థులు ఎందుకు ప్రకటించడం లేదని మండిపడేవాళ్ల సంఖ్య కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు పెరుగుతున్నది. టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఆయా నియోజకవర్గాల్లో ఆ గులాబీధారులకు వస్తున్న మద్దతు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని గెలవలేమనే భయంతోనే అభ్యర్థులను ప్రకటించడం లేదా? అన్న అనుమానాలను స్వయంగా ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తోండటం విశేషం.

256
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...