కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు అమలు చెయ్


Sun,November 11, 2018 05:22 AM

కమలాపూర్ : ఓట్లు సీట్ల కోసం జట్టు కట్టిన ఓ కాంగ్రెసోడా.. ఓ టీడీపోడా..మీకు దమ్ముంటే కాంగ్రెస్, టీడీపీ పాలిత రాష్ర్టాలైన కర్ణాటక, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి ఓట్లు అడిగేందుకు రావాలని లేదంటే ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్, టీడీపీ నాయకుల తీరుపై రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం కమలాపూర్ లో టీఆర్‌ఎస్‌వీ, టీఆర్‌ఎస్‌వైల ఆధ్వర్యంలో 10 వేల మందితో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం మండలంలోని వంగపల్లి క్రాస్‌రోడ్డు వద్ద మామిడితోటలో హుజురాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ యువజన, విద్యార్థి విభాగాల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఈటల మాట్లాడుతూ 1969 తెలంగాణ ఉద్యమంలో 319 మంది విద్యార్థులను పొట్టన బెట్టుకున్నారని గుర్తుచేశారు. మలిదశ ఉద్యమంలో టీఆర్‌ఎస్ జెండా పడితే ఓటు వేయరని సమైక్యపాలకులు హేళన చేశారన్నారు. ఉద్యమంలో హుజురాబాద్ నియోజకవర్గం ఢిల్లీ సర్కార్‌ను వణికించిందని, దీనికి ఉప్పల్‌రైల్‌రోకో నిదర్శనమన్నారు. కరెంటు కోసం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో తుపాకి గుండ్లు పేల్చి రక్తపు టేరులు పారించిన టీడీపీ చరిత్ర తెలంగాణ ప్రజలు మరిచిపోరన్నారు. తెలంగాణకు కరెంటు ఇవ్వకుండా గోసపెట్టిన ఆంధ్రపాలకులు తెలంగాణ వస్తే చీకటి అలుముకుంటదని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారని గుర్తుచేశారు.

మా జోలికి వస్తే మాడిమసైపోతవ్
టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల జోలికి వస్తే మాడి మసైపోతవ్ అని మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. కార్లలో వస్తూ మాజీ నక్సలైట్లు టీఆర్‌ఎస్ నాయకులను బెదిరింపులకు దిగుతున్నరు. దేశంలో ప్రజాస్వామ్యపార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాత్రి వేళల్లో గ్రామాల్లో దొంగల్లా చొరబడుతున్నరు. మీది కాంగ్రెస్ పార్టా లేదంటే రాత్రి పూట తిరిగే పార్టా తేల్చుకోవాలన్నారు. మీకు దమ్ముంటే కమలాపూర్ బస్టాండ్ కూడలికిరా లేదంటే హుజురాబాద్ అంబేద్కర్ సెంటర్‌లోనైన సరే లేదంటే జమ్మికుంట చౌరస్తాలోనైన మాట్లాడుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. తె లంగాణకు ఒక్క పైసా ఇవ్వనన్న ఆంధ్ర సీఎం చెప్పిన నిండు సభలో లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన చరిత్ర ఈటల రాజేందర్‌ది నీ దమ్మెంత.. నీ ఐషత్ ఎంత అంటూ కాంగ్రెస్ నాయకుల తీరుపై మండిపడ్డారు.
కరెంటు అవసరం లేకుండా సాగునీరు
టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో ఎస్సారెస్పీ నీళ్లతో కరంటు, వ్యవసాయ బావుల అవసరం లేకుండా 10 రోజులు ఆన్, 8 రోజులు ఆఫ్ పద్ధ్దతిలో రైతులకు రెండు పంటలకు సాగునీరు అందిస్తానని మంత్రి అన్నారు. నియోజకవర్గంలోని మానేరు, వాగులపై చెక్ డ్యాంలను నిర్మాణం చేపట్టామని, మరిన్ని చెక్ డ్యాంలు నిర్మించి ఎప్పటికి నీరు నిలిచేలా చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వి, టీఆర్‌ఎస్‌వై నాయకులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

273
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...