ఎన్నికల్లో వీవీపీఏటీ విధానం


Wed,September 12, 2018 03:10 AM

-విస్తృత అవగాహన కల్పిస్తాం..
-అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం..
-అర్బన్ పరిధిలో మూడు నియోజకవర్గాలు
-మూడు నాలుగు రోజుల్లో తహసీల్దార్ల బదిలీలు
-ఏ జిల్లా కౌంటింగ్ ఆ జిల్లాలోనే..
-వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ఇక్కడే
-నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈసారి కొత్తగా పోలింగ్ బూత్‌ల్లో వీవీపీఎటీ (వోటర్ వేరిఫైయేబుల్ పేపర్ అడిట్ ట్రేయిన్)ను ప్రవేశపెడుతున్నాం అని అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు. జిల్లా పరిధిలో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో మొత్తం ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం(సెప్టెంబర్ 25 నాటికి మార్పు ఉంటుంది) 6,16, 674 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల మార్పు (ఒక బూత్ నుంచి మరో బూత్ లేదా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ) ప్ర క్రియ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటరు నిర్ణయాధికారం ప్రకారం చేసుకోవచ్చని వెల్లడించారు. జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై (ప్రీ నోటిఫికేషన్) చేస్తున్న కసరత్తు మొదలైన అంశాలపై ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

నమస్తే తెలంగాణ: ఎన్నికల ప్రీ నోటిఫికేషన్ నేపథ్యంలో మీరు చేస్తున్న ఏర్పాట్లు వివరిస్తారా?
కలెక్టర్: ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చేయాల్సి న ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా పరిధిలో మూడు నియోజకవర్గాలు వస్తాయి. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఈ మూడు నియోజకవర్గాల్లో ఇప్పటికీ అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం 671పోలింగ్ కేంద్రాలు (వరంగల్ తూర్పు 213, వరంగల్ పశ్చిమ 204, వర్ధన్నపేట 254) ఉన్నాయి. మొత్తం ఓటర్లు 6,16,674 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా సవరణ, మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కొత్తగా ఓటు హక్కును వినియోగించుకునేవారి కోసం ప్రత్యేక క్యాంపెయిన్ చేస్తున్నాం.

ఇప్పుడు ఈవీఎంలు స్ట్రాంగ్ రూంలోనే ఉన్నాయా?
కలెక్టర్: లేదు. కర్నాటకలో ఉన్నాయి. ఈనెల 15న పోలీస్ బందోబస్తుతో వస్తున్నాయి. అన్ని ఏర్పాట్లు చేస్తాం.
ఈవీఎంపై అపోహలున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని పోగొట్టేందుకు మీ కార్యాచరణ వివరిస్తారా?
కలెక్టర్: అది కేవలం అపోహ మాత్రమే. ఈ విషయంలో ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాం. అవగాహన కల్పించాం. ఈసారి కొత్తగా వీవీపీఏటీ (వోటర్ వేరిఫైయేబుల్ పేపర్ అడిట్ ట్రేయి న్) విధానం తెస్తున్నాం. ఈ విధానంతో పూర్తి పారదర్శకత ఉంటుంది. దీనిపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తాం. బూత్‌లెవల్‌లో అవగాహన కల్పిస్తాం. ఇప్పటి దాకా ఈవీఎంల్లో కేవలం బీఫ్ సౌండ్ మాత్రమే వచ్చేది. అయితే కొత్త విధానంతో ఏడు సెకండ్లపాటు ఓటరు తానే గుర్తుపై వేశాడో (బ్యాలెట్ వ్యూ ప్యాడ్) కనిపిస్తుంది. ఈవీఎం నుంచి ఒక పేపర్ వస్తుంది. ఈ పేపర్ ఈవీఎంకు కనెక్ట్‌గా ఉన్న బాక్స్‌లో పడిన తరువాతే బీఫ్ సౌండ్ వస్తుంది. దీంతో అందరి అనుమానాలు నివృత్తి అవుతాయి.

ఒకవేళ అది కూడా ఏదైనా మోసం జరిగిందని ఓటరు భావిస్తే తాను లిఖిత పూర్వక ధ్రువీకరణ హామీ పత్రం ప్రిసైడింగ్ అధికారికి ఇస్తే, తాను అది సదరు ఓటరు చేసే ఫిర్యాదుపై అంగీకరిస్తే మరోసారి ఓటు వేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఆవరైనా అకతాయి తనంతో ఓవర్‌స్మార్ట్ నెస్‌తో ప్రదర్శిస్తే రెండోసారి వేసిన ఓటు మొదటి సారి ఓటు ఒకటే అయితే సీరియస్ చర్య ఉంటుంది. సదరు వ్యక్తి అక్కడి నుంచే ఆర్నేళ్లపాటు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అంటే ఎన్నికల సంఘం ప్రధాన ఉద్దేశం ఓటు ట్యాంపరింగ్ కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలో అత్యంత పారదర్శకంగా నిర్వహించే ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసే విధానానికి ఒడిగట్టాలని చూస్తే చట్టం సీరియస్‌గా ఉంటుంది. ఇప్పటి వరకు మౌఖిక ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి.

కానీ, లిఖిత పూర్వక ఫిర్యాదులు రాలేదు. అయితే ఇటీవల కర్నాటకలో ఒక వ్యక్తి తన ఓటు ఒక గుర్తుపై వేస్తే మరో గుర్తుపై పడిందని ఆరోపిస్తూ వేశారు. దీంతో అతని లిఖిత పూర్వక ధ్రువీకరణతో మరో అవకాశం కల్పిస్తే అతను చేసిన ఆరోపణ తప్పని తేలింది. దీంతో అదే పోలింగ్ స్టేషన్ నుంచి అతన్ని జైలు పంపారు. చట్టం అంత సీరియస్‌గా ఉంటుంది. ఈ విధానం ఈసారి కొత్తగా ప్రవేశపెడుతున్నాం. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అత్యంత పవిత్రమైనవి మాత్రమే కాదు ప్రాణాధార సమానం కనుక వీటిపై ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంటుంది. ఎన్నికల సంఘాన్ని అపహాస్యం చేస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే భావించాలి. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ విధానంపై ప్రతీ బూత్ స్థాయిలో మాక్ పోలింగ్ నిర్వహిస్తాం.

ఉమ్మడి జిల్లా ఎన్నికల కౌంటింగ్ గతంలో జరిగినట్టు ఇక్కడే జరుగుతుందా? కొత్త జిల్లాల్లోనా..?
కలెక్టర్: లేదు. ఈసారి వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లోనే కౌంటింగ్ కేంద్రాలుంటా యి. ఏనుమాముల మార్కెట్ యార్డులోనే ఉంటాయి. కాకపోతే వరంగల్ రూరల్ పరిధిలోని నియోజకవర్గాలకు ఆ జిల్లా ఎన్నికల అధికారి పరిధిలో ఉంటుంది. ఇక అర్బన్ జిల్లా పరిధిలోని మూడు నియోజకర్గాలకు ఏనుమాముల మార్కెట్‌లోని గోడౌన్ నెంబర్ 12ను ఎంపిక చేశాం. స్ట్రాంగ్ రూం, ఈవీఎంలు భద్రపరిచేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం.

కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణ వివరిస్తారా?
కలెక్టర్: కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి యాక్షన్‌ప్లాన్ తయారుచేశాం. అన్ని మండలాలు, కార్పొరేషన్‌లోని డివిజన్ కేంద్రాల్లోని అన్ని జూనియర్ , డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ప్రాధాన్యత వంటి విషయాలను 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలుగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నీ కాలేజీల ప్రిన్సిపాళ్లతో ఈఆర్‌వోస్ (ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్) అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గత సాధారణ ఎన్నికలకంటే ఈసారి దాదాపు కనీసం 10 వేల కొత్త ఓటర్లు అయినా (నియోజకవర్గానికి) నమోదు అవుతారని అంచనా.

ఎన్నికల సందర్భంగా అధికారుల బదిలీలు ఉంటాయా?
కలెక్టర్: కచ్చితంగా ఉంటాయి. ఎన్నికల మార్గదర్శకాల ప్రకా రం రెండు మూడు రోజుల్లో తహసీల్దార్ల బదిలీలు ఉంటాయి. దాదాపు ఈఆర్‌వోస్, ఏఈఆర్‌వోస్ స్థాయి అధికారుల బదిలీలు మాత్రం తప్పకుండా ఉంటాయి. సొంత జిల్లా అయి ఉండకూడదు (కొత్త జిల్లాల ప్రాతిపదికన), గడచిన నాలుగేళ్లలో వరుసగా మూడేళ్లు ఒకేచోట పనిచేసి ఉన్నవారిని, ఇదే జిల్లాలో ఆర్‌వోగా, ఈఆర్‌వోలుగా, ఎఈఆర్‌వోలుగా పనిచేసిన వారిని, గత ఎన్నికల్లో ఇదే జిల్లాలో పనిచేసిన వారిని ఇలా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బదిలీలు చేయాలి. రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది.

247
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...