నిత్యచైతన్యశీలిప్రజాకవి కాళోజీ


Mon,September 10, 2018 03:24 AM

వరంగల్ కల్చరల్,సెప్టెంబర్ 9 : జీవితాంతం సమాజం కోసం, పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు నిత్య చైతన్యశీలి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రజాకవి, పద్మవిభూషన్, దివంగత కాళోజీ నారాయణరావు 104వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం హన్మకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహానికి జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు,కవులు,రచయితలు,కళాకారులు,అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాళోజీ ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతినబూనారు. వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, తాజా మాజీ శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, కాళోజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కాళోజీ ఆశయ సాధనలో భాగంగానే సీఎం కేసీఆర్ తన ప్రజారంజక పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ర్టాన్ని పురోభివృద్ధి దిశలో నడిపించారని అన్నారు.

కాళోజీ జీవితాంతం అన్యాయాలను ఎదిరించి, అసమానతలు లేని సమాజం కోసం పాటుపడ్డారని చెప్పారు. ప్రజల గోడునే తన గోడుగా భావించి నా గొడవను అద్భుతంగా రచించి మనకు అందించడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. కాళోజీ కళాక్షేత్ర నిర్మాణాన్ని అన్ని హంగులతో పూర్తి చేయడంతో పాటు, కాళోజీ రచనలను భవిష్యత్ తరాలకు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంపశయ్య నవీన్ మాట్లాడుతూ కాళోజీ గొప్ప ప్రజాస్వామిక వాది అని చెప్పారు. ప్రజాస్వామిక విలువలు, హక్కుల కోసం నిరంతరం పోరాడిన యోధుడని అన్నారు. ఇతరుల హక్కులను కాపాడడంలో కాళోజీ ప్రాణత్యాగానికైన సిద్దపడే వాడని చెప్పారు.
ఈ యేడు కాళోజీ పురస్కారం పొందుతుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాళోజీ ఫౌండేషన్‌చే ప్రతీ యేడు ప్రతిష్టాత్మకంగా అందచేసే ప్రజాకవి కాళోజీ పురస్కారం-2018ను ఈ యేడు ప్రముఖ సామాజిక కవయిత్రి జూపాక సుభద్రకు అందచేస్తున్నామని తెలిపారు.

ఈ అవార్డును కాళోజీ వర్ధంతి రోజైన నవంబర్ 13న అందచేస్తామని చెప్పా రు.కాళోజీ ఫౌండేషన్ కోశాధికారి, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్‌కుమార్ మాట్లాడుతూ కాళోజీ ఆశయ సాధనకోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాళోజీ కుమారుడు రవికుమార్, రెవిన్యూ డివిజనల్ అధికారి వెంకారెడ్డి, సమాచార సంబంధాల శాఖ ఉప సంచాలకులు యాసా వెంకటేశ్వర్లు, డీఎస్.జగన్, రూరల్ సంయుక్త కలెక్టర్ మహేందర్‌రెడ్డి, డీఎఫ్‌వో పురుషోత్తం, టీఎన్జీవోస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, తెలంగాణ భాషోద్యమ సమాఖ్య రాష్ట్ర సలహాదారుడు తిరువరంగం ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు వల్సపైడి, వరంగల్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు నల్లెల రాజయ్య, తెరసం జిల్లా అధ్యక్షుడు అన్వర్, ప్రధాన కార్యదర్శి బిల్ల మహేందర్, దొడ్డికొమురయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అస్నాల శ్రీను, విక్రం పబ్లిషర్స్ జిల్లా ప్రతినిధి నిమ్మల శ్రీనివాస్, కార్పొరేటర్లు నల్లా స్వరూప, వేముల శ్రీనివాస్, రంజిత్‌రావు, ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు కర్రె సదాశివ్, మంథని శంకరయ్య, కవులు సిరాజుద్దిన్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆలపించిన ఉద్యమ గీతాలు ఆకట్టుకున్నాయి.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...