వెయ్యిస్తంభాల ఆలయంలో 13 నుంచి


Mon,September 10, 2018 03:24 AM

-గణపతి నవరాత్రి ఉత్సవాలు
వరంగల్ కల్చరల్ : చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో ఈనెల 13నుంచి 22 వరకు మహా గణపతి నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్ తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు నవరాత్రోత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించి ఉత్సవ వివరాలను వెల్లడించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ, నగర పాలక సంస్థ, జిల్లా యంత్రాంగం సహకారంతో ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయప్రాంగణంలో ఈసారి భారీ మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టింప జేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతి రోజు ఉత్తిష్ట గణపతికి విశేష అలంకరణలు, అభిషేకాలు, పూజలు, హోమాలు, అర్చనలు నిర్వహిస్తామని చెప్పారు. లోక కల్యాణార్థ్ధం ప్రతి రోజు గణపతి సహిత నవగ్రహ రుద్రహోమాలు నిర్వహిస్తామని వివరించారు. స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ సహకారంతో నిత్యాన్నదానం ఏర్పాటు చేశామని వారు పేర్కొన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 13న ప్రముఖ వ్యాపారవేత్త, దివంగత వెనిశెట్టి పున్నంచందర్ నివాసం నుంచి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకవచ్చి ఆలయంలో ప్రతిష్టింపజేస్తామని అన్నారు.

ఉత్సవాల్లో గణనాథుడి అలంకరణలు
గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా గణనాథుడిని రోజుకొక అలంకరణ చేసి పూజాధికాలు నిర్వహించనుననట్లు ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 13న వరసిద్ధి వినాయకుడిగా, 14న ఉత్తిష్ట గణపతిగా, 15న త్రిముఖ గణపతిగా, 16న దుండి గణపతిగా, 17న లక్ష్మీగణపతిగా, 18న హేరంబ గణపతిగా, 19న శ్వేతార్క గణపతిగా, 20న శ్రీలక్షీగణపతిగా, 21న సిద్ధిబుద్ధి గణపతిగా అలంకరించి పుజారాధనలు జరుపుతామని అన్నారు. ప్రతీరోజు సాయంత్రం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. 18న విద్యార్థులకు ప్రతిభాపాటవ పోటీలు నిర్వహించి 20న విజేతలకు బహుమతులు అందచేస్తామని తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు గుండా ప్రకాశ్‌రావు, వేముల శ్రీనివాస్, ఆధ్యాత్మిక వేత్త మాడిశెట్టి శ్రీనివాస్, ఉత్సవ కమిటీ సభ్యులు పులి రజనీకాంత్, గండ్రాతి రాజు, గౌరిశెట్టి శంకర్‌నారాయణ పాల్గొన్నారు.

176
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...