గులాబీల్లో సమరోత్సాహం..!


Sat,September 8, 2018 02:24 AM

- ఎమ్మెల్యే అభ్యర్థుల రాకతో భారీ ర్యాలీలు
- ఎన్నిక ఏదైనా గెలుపు గులాబీలదేనని ప్రతిన
- ఊరూరా టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు
- గ్రూపుల పోరులో కాంగ్రెస్ నేతలు
- టీడీపీతో పొత్తు ముచ్చటతో మరింత బేజారు..?
- అభ్యర్థుల రాకతో భారీ ర్యాలీలు
- ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే అంటూ ప్రతిన
- ఊరూరా సంబురాలు
- కక్కలేక మింగలేక కాంగ్రెస్
- టీడీపీతో పొత్తు ముచ్చటతో మరింత బేజారు?
వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : గులాబీల్లో అభ్యర్థుల ప్రకటన అనంతరం రెట్టించిన ఉత్సాహం ఉరకలేస్తోంది. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అనూహ్యంగా అసెంబ్లీ రద్దు చేయడం, అదేరోజు అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి తెరలేపడం వేటికవే చెకచెకా జరిగిపోయాయి. దీంతో సిట్టింగ్‌లకే మళ్లీ సీట్లు కేటాయించడంతో అభ్యర్థులు ప్రచారంలోకి దిగిపోయారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలతో తమతమ తాజామాజీలైన అభ్యర్థులకు వీరతిలకం దిద్ది స్వాగతం పలుకుతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు అప్పుడే ప్ర చారం మొదలుపెట్టడంతో కాంగ్రెస్ సహా అన్ని పార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టీఆర్‌ఎస్ ఇంత త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తుందని కనీసం ఊహించలేకపోయాం అంటూ కాంగ్రెస్ నేతలు మథనపడుతున్నారు. ఇప్పటికే తమ పరిస్థితి ఏమిటో అర్థం కాని పరిస్థితి, దీనికితోడు గ్రూపు రాజకీయాలు, పురికవలవని నేతలు, కార్యకర్తలు ఎవరికి వారే యమునా తీరే లా ఉంది. ఇదే ఇబ్బందికర పరిస్థితి అంటే పులిమీద పుట్రలా తమ పార్టీ నేతలు టీడీపీతో పొత్తు అంటూ కొత్తరాగం ఎత్తుకున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే అక్కడక్కడా ఉన్న చిన్ని ఆశ కూ డా ఆవిరైపోతుంది అన్న బెంగ కాంగ్రెస్ నేతలను వెంటాడుతోందని పేరు చెప్పడానికి నిరాకరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు వాపోతున్నాడంటే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో స్పష్టం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు చాలా చోట్ల కనీసం నియోజకవర్గ ఇన్‌చార్జీలు లేని దుస్థితి. అక్కడక్కడా ఉన్నా వారంతంగా ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రెండు మూడు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలున్నా ఉన్నవారిలో సఖ్యత కొరవడి కొట్టుకుంటున్న వాతావరణం నెలకొంది. ఇక టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా తాను మొదటి నుంచి చెప్తున్నట్టుగానే అభ్యర్థులను ప్రకటించారు. సిట్టింగ్‌లకే అవకాశాలు కల్పించి తను ఏం చెప్పినా బాజాప్తా చెప్పి చేస్తారు అని మరోసారి స్పష్టం అయింది. నిన్నమొన్నటి దాకా ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల్లోని అభివృద్ధి, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేసేందుకు తిరిగి వారి దగ్గరికే వెళ్లి తాము చేసిన పనులను ప్రజలకు చెప్పి వారి దీవెనలు పొందుతున్నారు.

సంబురాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు
అభ్యర్థులను ప్రకటించడంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో సంబురాలు అంబరాన్ని అంటాయి. అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకే సీట్లు కేటాయించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. హైదరాబాద్ నుంచి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు శుక్రవారం రావడంతో వారికి ఘనస్వాగతం పలికారు. వరంగల్ పశ్చిమ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలుదని, తిరిగి భద్రకాళి అమ్మ ఆశీర్వాదం, తన నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అసెంబ్లీలో కాలుపెడతానని ప్రకటించారు. మరోవైపు మహబూబాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోతు శంకర్‌నాయక్ భద్రకాళిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్యకు ధర్మసాగర్ మండలంలో అపూర్వ ఆదరణ లభించింది. తమ నియోజకవర్గ అభ్యర్థిగా అరూరి రమేశ్‌ను ప్రకటించినందుకు వర్ధ్దన్నపేట ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు పార్టీ అధినేత కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు రమేశ్ ఘన విజయం సాధించాలని ఐనవోలు మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక వర్ధన్నపేట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ తన నియోజకవర్గం పరిధిలోని మడికొండ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అదాలత్ సెంటర్‌లోని అమరవీరులకు నివాళి అర్పించి హంటర్‌రోడ్‌లోని సీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో సమావేశం నిర్వహించారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అరూరి రమేశ్ 87వేల మెజారిటీతో గెలిచారని, అది రాష్ట్రంలో రెండో అతిపెద్ద మెజారిటీ అని ఈసారి దాన్ని అధిగమించి రికార్డు సృష్టిస్తామని టీఆర్‌ఎస్ నేతలు సమరోత్సాహంతో ప్రకటించారు.

కక్కలేక మింగలేక కాంగ్రెస్..
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని హుస్నాబాద్ నుంచి స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థులు వారివారి నియోజకవర్గాల్లో ప్రచారానికి బయలుదేరారు. కాంగ్రెస్ మాత్రం టీఆర్‌ఎస్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాల్లో మినహా కనీసం నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా కూడా లేని పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. ఒకవేళ ఉన్నా గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, పరకాల, ములుగు నియోజకవర్గాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశాల సందర్భంగా జరిగిన గొడవలే నిదర్శనం. ఇదంతా ఒకవైపు జరుగుతుండగా తాజాగా కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందన్న విషయం గుప్పుమనడంతో ఆ పార్టీలో మరింత గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయితీ తారాస్థాయికి చేరుతుందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సీతక్క, వేం నరేందర్‌రెడ్డి వారి నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపు జరిగినట్లు కొందరు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే అటు పొదెం వీరయ్య, నాయిని రాజేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ వంటి సీనియర్ నేతల్లో పాలుపోని స్థితి నెలకొంది.

158
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...