అంపశయ్యకు కాళోజీ పురస్కారం


Sat,September 8, 2018 02:23 AM

-రేపు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అందజేత
-తెలుగు నవలాముఖచిత్రం నవీన్
-జిల్లాకు దక్కిన తొలి గౌరవం
వరంగల్ ప్రధాన ప్రతినిధి/వరంగల్ కల్చరల్-నమస్తే తెలంగాణ : తెలుగు నవలా ముఖచిత్రం ఆయన. అంపశయ్య నుంచి మొదలైన నవలా ప్రస్థానం అప్రతిహతంగా దాదాపు ఐదు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద అనేక పురస్కారాలు, అవార్డులు స్వీకరించిన తనకు నిజంగా ఇదొక అపురూప గౌరవం. కాళోజీ సోదరులతో కలిసి తిరిగి ఎదిగిన అతడికి అదే కాళోజీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం అందుకోవడం తన సాహితీజీవితంలో మరచిపోలేని మధురానుభూతిగా తను ఉప్పొంగిపోతున్నారు. ఆయనే అంపశయ్య నవీన్. తన తొలి నవలతో తెలుగులో చైతన్యస్రవంతి సృష్టించిన ఆయన సాహితీ సేవ అనితర సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ గుర్తించడం విశేషం. నవల, కథ, కథానిక, విమర్శ వంటి అనేక సాహితీ ప్రక్రియల్లో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న నవీన్ తెలుగు నవల ముఖచిత్రంగా ఎదిగారు. ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి సందర్భంగా ఇచ్చే ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని వరంగల్‌కు చెందిన ప్రముఖ నవలారచయిత డాక్టర్ అంపశయ్య నవీన్‌ను వరించింది. ఈనెల 9న హైదరాబాద్‌లో కాళోజీ జయంతి సందర్భంగా ఈ పురష్కారాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అందజేయబోతోంది. రవీంద్రభారతిలో జరిగే కాళోజీ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నవీన్ ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఈ పురస్కారం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్షా నూట పదహార్ల నగదుతోపాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తుంది.

చైతన్యస్రవంతిలో తను చేసిన తొలి నవల అంపశయ్యనే ఇంటి పేరుగా మార్చుకున్నారు. తల్లిదండ్రులు పెట్టిన పేరును కేవలం రికార్డుల్లోనే పదిలపరచుకొని తన తొలి రచన అంపశయ్యను ఇంటిపేరుగా విరసం నేత వరవరరావు పెట్టిన నవీన్‌పేరుతో తెలుగు సాహిత్యాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకోవడం విశేషం. అంపశయ్య నవీన్ అసలు పేరు దొంగరి మల్లయ్య. తల్లిదండ్రులు నారాయణ, బుచ్చమ్మ. అంపశయ్య నుంచి మొదలైన ఆయన నవలా స్రవంతి తెలుగు సాహితీసీమలో అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికీ ఆయన 32 నవలు రాశారు. అందులో కాలరేఖలు నవలకు 2004లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 100 కథలు రాశారు. వంద కథలు, వంద విమర్శనావ్యాసాలు, అన్నీ కలిపి వందకుపైగా పుస్తకాలు వెలువరించారు. తన పుట్టిన రోజు సందర్భంగా 2001 నుంచి వరుసగా ఒక నవలను ప్రచురించడం, నవీన నవలా రచయితల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ రోజే ఆయన ఒక కొత్త నవలకు అవార్డు ఇచ్చే సంస్కృతిని పాదుకొల్పారు అంపశయ్య నవీన్. కేంద్ర సాహిత్య అకాడమీతోపాటు పలు జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద అవార్డులు అందుకున్నారు. 2004లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కాగా, ప్రతీ సంవత్సరం ఇచ్చే కాళోజీ పురస్కారాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అందుకున్న మొదటి వ్యక్తిగా అంపశయ్య నవీన్ రికార్డు సొంతం చేసుకోవడం విశేషం.

197
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...