డయల్‌ 100పై అవగాహన పెంచుకోవాలి


Thu,December 5, 2019 04:39 AM


-వర్ధన్నపేట, పరకాల ఏసీపీలు రమేశ్‌, శ్రీనివాస్‌
-విద్యార్థులకు అవగాహన సదస్సు

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : డయల్‌100పై అవగాహన పెంచుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ జీ రమేశ్‌ అన్నారు. మండల కేంద్రంలోని పుస్కోస్‌ పాఠశాలలో బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 100 డయల్‌పై అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. బాలికలు, మహిళలు ఎలాంటి ఆపదకు గురైనా వెంటనే 100 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేయాలన్నారు. వెంటనే సమీపంలోని పోలీసులు వచ్చి మీకు రక్షణ కల్పిస్తారని తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌ నగరంలో వెటర్నరీ వైద్యురాలిపై కొందరు అఘాయిత్యానికి పాల్పడి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం ప్రతి ఒక్కరిని కలిచి వేసిందన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సూచనలు చేయాలన్నారు. ప్రధానంగా బాలికల రక్షణ విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బ ండారి సంపత్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఫ్రెండ్లీ పోలీస్‌తో ప్రజలకు చేరువ
రాయపర్తి : ఫ్రెండ్లీ పోలీస్‌తో ప్రజలకు చేరువ అవుతున్నామని వర్ధన్నపేట ఏసీపీ రమేశ్‌ అన్నారు. బుధవారం మండలంలోని మైలారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మండల పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ‘డయల్‌ 100’ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. పోలీసులు అంటే యూనీఫామ్స్‌లో ఉన్న ప్రజా సేవకులు అనే విషయాన్ని ప్రతి వ్యక్తి గుర్తించి గౌరవించాల్సిందిగా కోరారు. అనంతరం విద్యార్థులకు విద్య-ప్రయోజనాలు, ప్రభుత్వ పాఠశాలలు అందిస్తున్న సేవలు, బాల్య వివాహాలు, మద్యపానం, వరకట్నం, సాంఘీక దురాచారాలు, బాణామతి వంటి వాటిపై విద్యార్థులకు ప్రదర్శనపూర్వకంగా అవగాహన కల్పించారు. అనంతరం సమావేశంలో జెడ్పీటీసీ రంగు కుమార్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై మేకల లింగారెడ్డి, ఉప సర్పంచ్‌ సారయ్య, ఎంపీటీసీ గాడిపల్లి వెంకన్న,హెచ్‌ఎం అనుమాస్‌ వేణు, కారోబారు ఉప్పలయ్య, ఉపాధ్యాయులు అనిత, వెంకటేశ్వర్లు, కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఆపదలో మీ నేస్తం 100
శాయంపేట : ఆపదలో మీ నేస్తం ‘100’అని గుర్తుంచుకోవాలని పరకాల ఏసీపీ పీ శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని మాందారిపేట శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం విద్యార్థినులకు డయల్‌100పై అవగాహన సదస్సునిర్వహించారు. విద్యార్థులతో కలిసి వివిధ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. విద్యార్థినులు స్వీయ రక్షణ కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రుల ఆశలను గమనించి నడుచుకోవాలన్నారు. మండలానికి చెందిన ఓ అమ్మాయిని రాత్రి వేళ బస్సులో ఇద్దరు యువకులు వేధించారని ఆమె 100కు కాల్‌ చేయడంతో పోలీసులు ఎనిమిది నిమిషాల్లోనే వెళ్లి వారిని పట్టుకుని కేసు పెట్టారన్నారు. మీ ఇంటిలోను తండ్రి తల్లిని కొట్టినా 100కు కాల్‌ చేయాలన్నారు. జీవితంలో వచ్చే సమస్యలన్నింటిని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధ్దమవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్సై జక్కుల రాజబాబు, ప్రత్యేక అధికారి మాధవి, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...