పునర్విభజన


Wed,December 4, 2019 03:18 AM

-వార్డుల డీలిమిటేషన్‌కు షెడ్యూల్ విడుదల
-జిల్లాలో మూడు పురపాలికల్లో ప్రక్రియ షురూ
-9 వరకు అభిప్రాయాలు, సూచనల స్వీకరణ
-17న పునర్విభజన తుది జాబితా వెల్లడి
-ఆ తర్వాత వెంటనే రిజర్వేషన్ల ఖరారుకు చాన్స్
-లైన్ క్లియర్‌తో మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి
వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి- నమస్తే తెలంగాణ : అడ్డంకులు తొలగిపోవడంతో మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో పురపాలక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం తిరిగి కసరత్తు చేపట్టింది. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. పదిహేను రోజుల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 17వ తేదీన తుది జాబితా ప్రకటించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో జిల్లాలోని పురపాలక సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన న్యాయస్థానం పురపాలికల్లో వార్డుల పునర్విభజనకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఫలితంగా పురపోరుకు లైన్ క్లియరైంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ వార్డులు, డివిజన్ల పునర్విభజనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ పదిహేను రోజుల గడువుతో షెడ్యూల్ విడుదల చేశారు. మున్సిపాలిటీల్లోని వార్డుల పునర్విభజన ముసాయిదాపై ఈ నెల 9 వతేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారులు ప్రజల నుంచి అభివూపాయాలు, సూచనలు స్వీకరిస్తారని ఆయన తెలిపారు.

17వ తేదీన ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 121 పురపాలికలు, 10 నగర పాలక సంస్థలకు ఈ షెడ్యూల్ వెలువడింది. 121 పురపాలికల్లో జిల్లాకు చెందిన నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. షెడ్యూల్ జారీ కావడంతో ఈ మూడు మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా పురపాలికలో వార్డుల పునర్విభజనపై ఈ నెల 9వ తేదీ వరకు ప్రజల నుంచి అభివూపాయాలు, సూచనలు స్వీకరించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. 17వ తేదీన ప్రతి మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజనపై తుది జాబితాను ప్రకటిస్తారు. జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలోనూ మహిళా ఓటర్లే అత్యధికంగా ఉండడం విశేషం. మూడింటిలో మొత్తం ఓటర్ల సంఖ్య 61,387. ఇందులో మహిళలు 31,490 మంది, పురుషులు 29,897 మంది ఉన్నారు.

పెరిగిన వార్డుల సంఖ్య..
స్థాయి పెరిగిన నర్సంపేట, పరకాల మున్సిపాలిటీలకు 2014 మార్చి 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఈ రెండూ నగర పంచాయతీలే. పాలక వర్గం 2014 జూలై 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది. నర్సంపేట, పరకాల మున్సిపాలిటీల పాలకవర్గం పదవీ కాలం గత జూలై 2న ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక పాలన అమల్లోకి వచ్చింది. నర్సంపేట మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా స్థానిక ఆర్డీవో ఎన్ రవి, పరకాల పురపాలిక స్పెషల్ ఆఫీసర్‌గా స్థానిక ఆర్డీవో కిషన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న వర్దన్నపేట కొద్ది నెలల క్రితం మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. వరంగల్ రూరల్ ఆర్డీవో మహేందర్‌జీ ఈ పురపాలిక స్పెషల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 13,732 మంది జనాభా ఉంది. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 37,070, పరకాల మున్సిపాలిటీ పరిధిలో 34,387 జనాభా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల అధికారులు ప్రతి మున్సిపాలిటీ పరిధిలో వార్డుల పునర్విభజన చేశారు.

దీంతో ఆయా పురపాలికల పరిధిలో వార్డుల సంఖ్య పెరిగింది. గతంలో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండేవి. పునర్విభజనతో ఇక్కడ వార్డుల సంఖ్య 24కు చేరింది. ఒక్కో వార్డులో 1,050 నుంచి 1,250 మంది ఓటర్లు ఉండేలా అధికారులు వార్డుల పునర్విభజన జరిపారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో గతంలో 20 వార్డులు ఉండేవి. పునర్విభజనతో ఇక్కడ కొత్తగా రెండు ఏర్పడడంతో వార్డుల సంఖ్య 22కు పెరిగింది. పరకాల మున్సిపాలిటీ పరిధిలో అతి తక్కువ ఓటర్లు 787 మంది 16వ వార్డులో ఉంటే.. అత్యధిక ఓటర్లు 1,443 మంది 13వ వార్డులో ఉన్నారు. 12 వార్డులతో వర్ధన్నపేట మున్సిపాలిటీ అవతరించింది. ఇక్కడ అతి తక్కువ ఓటర్లు 704 మంది 10వ వార్డులో ఉంటే అత్యధిక ఓటర్లు 858 మంది 6వ వార్డులో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 48 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. పరకాల పురపాలిక పరిధిలో 43, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 15 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేశారు.

ఓటర్ల కులగణన..
ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లలో ఇప్పటికే కుల గణన జరిగింది. ఆయా పురపాలికల పరిధిలోని మొత్తం ఓటర్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ఇతరులను గుర్తించి అధికారులు నివేదికలు తయారు చేశారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 27,195 మంది ఓటర్లలో మహిళలు 14,030, పురుషులు 13,165 మంది ఉన్నారు. పరకాల పురపాలిక పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 25,008. వీరిలో మహిళలు 12,763, పురుషులు 12,245 మంది ఉన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలోని మొత్తం ఓటర్ల సంఖ్య 9,184. వీరిలో మహిళలు 4,697, పురుషులు 4,487 మంది ఉన్నట్లు అధికారులు రూపొందించిన నివేదికల్లో తెలిపారు. ఇక నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం ఓటర్లలో ఎస్సీలు 3,555, ఎస్టీలు 986, బీసీలు 20,391, ఇతరులు 2,263 మంది ఉన్నట్లు కుల గణనలో తేలింది. పరకాల పురపాలిక పరిధిలోని మొత్తం ఓటర్లలో ఎస్సీలు 6,477, ఎస్టీలు 264, బీసీలు 16,153, ఇతరులు 2,114 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం ఓటర్లలో ఎస్సీలు 1,816, ఎస్టీలు 2,589, బీసీలు 4,147 మంది ఉన్నట్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో పురపోరు కోసం అధికారులు సన్నద్ధమయ్యారు.

కొత్త ఓటర్ల నమోదు, వార్డుల పునర్విభజన, ఓటర్లలో కులగణన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, అభ్యంతరాల స్వీకరణతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్‌కు ప్రిసైడింగ్ అధికారు(పీవో)లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారు(ఏపీవో)ల నియామకం, వీరికి తొలి విడత శిక్షణ కార్యక్షికమం జరిగింది. బదిలీ, ఉద్యోగ విరమణతో ఖాళీ ఏర్పడిన పీవోలు, ఏపీవోల స్థానంలో కొత్తవారిని నియమించాలని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. తాజాగా విడదలైన షెడ్యూల్ ప్రకారం ఆయా మున్సిపాలిటీ పరిధిలో వార్డుల పునర్విభజనపై ఈ నెల 17వ తేదీన తుది జాబితా వెలువడగానే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కుల గణన పూర్తయినందున వార్డుల్లో, చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసే దిశలో అధికారులు అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా ప్రతి మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేసేందుకు ఉబలాటపడుతున్న ఆశావహుల్లో వార్డులు, చైర్మన్ పదవుల రిజర్వేషన్ల ఖరారుపై ఉత్కంఠ చోటుచేసుకుంది. ప్రస్తుతం వార్డుల విభజనకు షెడ్యూల్ జారీ కావడంతో తిరిగి రిజర్వేషన్ల ఖరారుపై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...