అలసత్వం!


Wed,November 13, 2019 03:12 AM

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి- నమస్తే తెలంగాణ : రైతులకు మద్దతు ధర దక్కాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో వివిధ రకాల పంట ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొంటుంది. ప్రధానంగా ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనుగోలు చేస్తున్నది. ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్‌లో రైతుల నుంచి ప్రతి గింజ కొని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కోసం రైస్‌ మిల్లర్లకు కేటాయిస్తుంది. దళారుల దోపిడీకి గురికాకుండా రైతులకు ‘మద్దతు’ ఇవ్వాలనేదే ప్రభుత్వ సంకల్పం. కొందరు అధికారులు మాత్రం చిత్తశుద్ధి కనబరచడం లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడిన రీతిలో వ్యవహరిస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం సేకరణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. మంగళవారం వానాకకాలం ధాన్యం కొనుగోలు మొదలైంది. రాయపర్తి మండల కేంద్రంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధ్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో వివిధ మండలాల్లో వరి కోతలు జరుగుతున్నందున ప్రభుత్వ సెంటర్లలో ధాన్యం కొనుగోలు ఊపందుకోనుంది. అయితే ఈ సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం రైస్‌మిల్లులకు కేటాయించడంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించాల్సిన రైస్‌మిల్లుల జాబితా ఖరారు చేసేందుకు ఇంకా కసరత్తు నడుస్తున్నది. చాలా రైస్‌ మిల్లులకు సంబంధించి ష్యూరిటీలు ముందుకు రాలేదు. రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ కూడా తమ సమ్మతి తెలపలేదు. ఇతర జిల్లాల్లో ఇవన్నీ పూర్తికావొస్తే ఈ జిల్లాలో ఇంకా ఆరంభ దశలోనే ఉండడం విమర్శలకు తావిస్తున్నది.

సెంటర్లు పెరిగే అవకాశం
ఈ ఏడాది వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా పడడం వల్ల జిల్లాలో వరి పంట సాగు విస్తీర్ణం పెరిగింది. గత సంవత్సరం వానాకాలంలో రైతులు 38 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారు. ఈ ఏడాది వానాకాలంలో జిల్లాలో వరి పంట సాగు విస్తీర్ణం మరో ఐదువేలకు పైగా పెరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు 43వేల పై చిలుకు ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేసినట్లు అంచనా వేశారు. ఈ లెక్కన రైతుల నుంచి ప్రస్తుత సీజన్‌లో 1.78 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ సంచులు, ఇతర అవసరాల కోసం ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పరిశీలించిన సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ జిల్లాలో 103 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ కేంద్రాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌)లవి 62, ఐకేపీవి 38, జీసీసీవి 2, మెప్మాకు చెందినది ఒకటి ఉన్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ భాస్కర్‌ వెల్లడించారు. నల్లబెల్లి మండలం గోవిందాపురం, ఖానాపురం మండలంలోని అశోకనగర్‌లో జీసీసీ, పరకాల మున్సిపాలిటీ పరిధిలో మెప్మా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయని ఆయన తెలిపారు. తాజాగా జిల్లాలో మరో ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో ఈ ఆరు సెంటర్ల మంజూరు కోసం జిల్లా నుంచి సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌కు ప్రతిపాదన పంపినట్లు అధికారులు చెప్పారు. వీటికి అనుమతి లభిస్తే జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 109కు చేరనుంది. గత సంవత్సరం వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం జిల్లాలో 106 కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి 1.35 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.

రైస్‌మిల్లులపై కసరత్తు..
ప్రభుత్వ కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం రైస్‌మిల్లులకు కేటాయించాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం పొందడానికి అర్హత గల రైస్‌మిల్లుల జాబితాను పౌరసరఫరాల శాఖ అధికారులు తయారు చేయాల్సి ఉంది. అర్హత గల ప్రతి రైస్‌మిల్లుకు ధాన్యం కేటాయించడానికి రైస్‌ మిల్లర్లలో ఇద్దరు ష్యూరిటీ సంతకాలు చేయాలి. దీంతో పాటు సదరు రైస్‌మిల్లుకు ధాన్యం కేటాయించాలని జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ సివిల్‌సప్లయ్‌ డిపార్ట్‌మెంట్‌కు లేఖ ఇవ్వాలి. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతుండడం, ధాన్యం కొనుగోలు ఊపందుకోనున్న తరుణంలో ధాన్యం కేటాయింపునకు అర్హత గల రైస్‌ మిల్లులపై ఇంకా క్లారిటీ రాలేదు. అర్హత ఉన్న ప్రతి రైస్‌ మిల్లుకు సంబంధించి రైస్‌మిల్లర్లు ఇద్దరు ష్యూరిటీ సంతకాలు చేయాల్సి ఉంది. ఆ తర్వాత రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ నుంచి అధికారులకు లేఖ అందాల్సి ఉంది. ఇప్పటివరకు ఇవేవి జరగకలేదు. ఊహించినట్లుగానే మంగళవారం జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం మొదలైంది. మంత్రి ఎర్రబెల్లి రాయపర్తి మండల కేంద్రంలో ఐకేపీకి కేటాయించిన ధాన్యం పర్చేజ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ ఎం హరిత, డీఆర్‌డీవో ఎం సంపత్‌రావు, పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లోని గ్రామాల్లో వరి కోతలు జరుగుతున్నాయి. ఈ మండలాల్లోని ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం తరలిరానుంది. రైస్‌మిల్లులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుసంధానం (ట్యాగింగ్‌) చేయకపోవడం వల్ల సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయడానికి నిర్వాహకులు నిరాసక్తత కనబరుస్తారని రైతులు వాపోతున్నారు. సెంటర్లను రైస్‌మిల్లులకు ట్యాగింగ్‌ చేయకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఫలితం లేకుండా పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

103 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇవే..
పర్వతగిరి మండలం : : పర్వతగిరి, అన్నారం, వడ్లకొండ, చింతనెక్కొండ, ఏనుగల్లు, సోమారం, చౌటపల్లి, గోపనపల్లి, కల్లెడ, రోల్లకల్‌
రాయపర్తి మండలం : రాయపర్తి, పెరికేడు, రాగన్నగూడెం, కాట్రపల్లి, సన్నూరు, కొత్తూరు, రాయపర్తి , కొండూరు.
వర్ధన్నపేట మండలం : నల్లబెల్లి, ల్యాబర్తి, వర్ధన్నపేట, ఇల్లంద
గీసుగొండ మండలం : ఎల్కతుర్తి, ఊకల్‌
సంగెం మండలం : ఎల్గూర్‌రంగంపేట, నల్లబెల్లి, కాపుల కనపర్తి, చింతలపల్లి, సంగెం, తీగరాజుపల్లి, మొండ్రాయి
ఆత్మకూరు : పెద్దాపురం, గూడెప్పాడ్‌, నీరుకుళ్ల, కటాక్షపూర్‌
పరకాల మండలం : రాయపర్తి, వరికోల్‌, నడికూడ, చౌటపర్తి, లక్ష్మీపురం, పరకాల, కంఠాత్మకూరు, వెల్లంపల్లి, పోచారం
శాయంపేట మండలం : పెద్దకోడెపాక, ప్రగతిసింగారం, కొప్పుల-1, కొప్పుల-2, శాయంపేట, కాట్రపల్లి, పత్తిపాక, వసంతాపూర్‌-1, వసంతాపూర్‌-2, జోగంపల్లి, తహరాపూర్‌, మైలారం, గట్లకనపర్తి, నేరేడుపల్లి
దామెర మండలం : సింగరాజుపల్లి, పసరగొండ, ఊరుగొండ
నెక్కొండ మండలం : చంద్రుగొండ, దీక్షకుంట, రెడ్లవాడ, అలంకానిపేట, సూరిపల్లి, నెక్కొండ, నాగారం
దుగ్గొండి మండలం : బొబ్బరోనిపల్లి, లక్ష్మీపురం, దుగ్గొండి, మద్దునూరు, నాచినపల్లి, తిమ్మంపేట, మహమ్మదాపూర్‌, వెంకటాపురం
నల్లబెల్లి మండలం : మామిండ్లవీరయ్యపల్లి, రాంపూర్‌, మేడపల్లి, గుండ్లపహాడ్‌, గొల్లపల్లి, నల్లబెల్లి, అర్శనపల్లి, మేడపల్లి, గోవిందాపూర్‌,
నర్సంపేట మండలం : నర్సంపేట, మాదన్నపేట, గురిజాల, ముత్తోజిపేట, ఇటికాలపల్లి
ఖానాపురం మండలం : ఖానాపురం, అశోక్‌నగర్‌, బుధరావుపేట, ధర్మరావుపేట, మనుబోతులగడ్డ, రాగంపేట, పెద్దమ్మగడ్డ
చెన్నారావుపేట మండలం : అమీనాబాద్‌, పాపయ్యపేట, చెన్నారావుపేట, పాపయ్యపేట, ముగ్దుంపురం

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...