ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం


Tue,November 12, 2019 02:41 AM

-వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి
పరకాల, నమస్తే తెలంగాణ : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ బీఆర్‌కే భవన్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా వ్యవసాయ అధికారులతో వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణలో ధాన్యం మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినందు వల్ల ఆయా రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి ధాన్యం రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఛత్తీస్‌గఢ్, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి ధాన్యం వచ్చే అవకాశం ఉండడంతో చెక్‌పోస్టుల వద్ద నిఘా ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. రైతులను ధ్రువీకరించిన తర్వాతే కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.

మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి మద్దతు ధరలో ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. దళారులు, వారికి సహకరిస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెసర్లు, సోయాబీన్‌ను పండిన పంటలో కనీసం 50 శాతం కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు. కొనుగోళ్లకు ముందు రైతుల వివరాలను నాఫెడ్ ఈ పోర్టల్‌లో ఎంట్రీ చేయాలన్నారు. దీంతో వారికి సకాలంలో డబ్బులు చేతికందుతాయన్నారు. తేమశాతం విషయంలో కచ్చితత్వం పాటించాలన్నారు. ధాన్యం కొన్న వెంటనే రైతులకు రశీదులు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పారు.కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాజీవ్ త్రివేది, సివిల్ సప్లయ్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...