బాలలకూ హక్కులు!


Mon,November 11, 2019 01:36 AM

-జనాభాలో 40 శాతం వారే..
-తగ్గిపోతున్న బాలబాలికల నిష్పత్తి
-హక్కుల పరిరక్షణకు నడుం బిగించాలి
-ఈనెల 20 వరకు బాలల హక్కుల వారోత్సవాలు

శాయంపేట, నవంబర్ 10 : బాలలకు మంచి భవిష్యత్‌ను అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి. దేశ జనాభాలో 40 శాతం ఉన్న బాలల రక్షణకు హక్కులు, చట్టాలు అమల్లోకి వచ్చాయి. పౌరుల మాదిరిగానే బాలలు కూడా హక్కులను అనుభవించాలి. ఇందుకు సమాజంలోని ప్రతిఒక్కరూ బాలల హక్కుల పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరమున్నది. హింసా, దోపిడీ, దౌర్జన్యాలు, వేధింపుల నుంచి బాలలను కాపాడేందుకు రక్షణ చట్టాలు వచ్చా యి. లింగవివక్ష, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా, భ్రూణహత్యలు, శిశుమరణాలు, లైంగిక వేధింపులు, బాలబాలికల నిష్పత్తి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. అనాథలు, వీధి బాలలు కనీస హక్కులను కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో బాలలకు అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తూ .. వారి సంక్షేమానికి ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు జిల్లాలో ఈ నెల 7 నుంచి 20 వరకు బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.

బాలలకు 54 హక్కులు..!
బాలలకు ప్రత్యేక హక్కులు అమల్లోకి వచ్చా యి. 1989 నవంబర్ 20న ప్రపంచ దేశాలు ఒక వేదిక పైకి వచ్చి బాలల రక్షణ, సమగ్ర ఎదుగుదలపై ఆలోచించి ఐక్యరాజ్యసమితి బాలల ఒడంబడికను ఆమోదించాయి. భారతదేశం 1992 డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి యూఎన్‌సీఆర్‌సీపై సంతకం చేసింది. ఈ ఒడంబడిక ప్రకారం 54 హక్కులను బాలలకు వర్తింపజేశారు. వీటిలో 1 నుంచి 42 వరకు బాలలకు సంబంధించినవి.. 43 నుంచి 54 వరకు ప్రభుత్వం బాలల కోసం అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. ఈ హక్కులు ప్రపంచ దేశాల్లోని 18 సంవత్సరాల్లోపు బాలలకు సమానంగా అందించబడ్డాయి. ఇందులో ముఖ్యమైనవి జీవించే హ క్కు, రక్షణ పొందే హక్కు, భాగస్వామ్యపు హక్కు, అభివృద్ధి చెందే హక్కులున్నాయి.

బాలలతో పనిచేయిస్తే జైలే..
బాలలు చదువుకోవాల్సిన వయస్సులో వెట్టిచాకిరీ చేస్తున్నారు. బడికి వెళ్లని పిల్లల్లో ఎక్కువ మంది కార్మికులుగానే కనిపిస్తున్నారు.బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం పిల్లలతో పనిచేయిస్తే రూ.40 వేల జరిమానా, సంవత్సరం జైలు శిక్ష ప డుతుంది. రెండోసారి తప్పు చేస్తే రెండు సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు. అలాగే, కర్మాగారాల్లో 14 ఏండ్ల లోపు బాలబాలికలను పనిలో పెట్టుకుంటే కర్మాగారాల చట్టం ప్రకారం రూ.లక్ష జరిమానా లేదా రెండేళ్ల జైలు.. లేదా రెండూ విధించవచ్చు. యజమానులు రెండోసారి పనిలో పెట్టుకుంటే రూ.రెండు లక్షలు, రెండేళ్లు జైలు శిక్ష పడుతుంది.

బాల్య వివాహ నిరోధక చట్టం..
బాల్యవివాహ నిరోధక చట్టాన్ని 2006లో తీసుకొచ్చారు. దేశంలో 18 ఏండ్లలోపు బాలికలు 26.8 శాతం, 21 ఏండ్లలోపు బాలురు 20.3 శాతం బాల్య వివాహాల బారిన పడినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16 నివేదిక చెబుతోంది. ఈ చట్టం ప్రకారం బాలికలు 18, బాలురకు 21 ఏండ్లుగా వివాహ వయస్సు నిర్దేశించారు. దీనికంటే ముందుగా వివాహం చేస్తే బాల్య వివాహంగా పరిగణిస్తారు. బాల్య వివాహాలు అనే క అనర్థాలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. అయితే, బాల్య వివాహాలు చేసుకున్నా, నిర్వహించినా, ప్రోత్సహించినా రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా లేకుంటే రెండూ విధించవచ్చు. అయితే, తప్పనిసరి వివాహ నమోదు చట్టాన్ని 2002లో తెచ్చారు. వివాహాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా మహిళలు రక్షణ పొందే అవకాశాలున్నాయి. ఇందుకు గ్రామ పం చాయతీ కార్యాలయంలో సంప్రదించాలి.

బాల్య వివాహ నిషేధ అధికారులు వీరే..
బాల్య వివాహాలు జరగకుండా జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయిలో పటిష్టంగా చట్టాలను అమలు చేసేందుకు అధికారులు ఉన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్డీవో, సబ్‌కలెక్టర్, ప్రాజెక్టు స్థాయిలో సీడీపీవోలు, ఏసీడీపీవోలు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, మండల స్థాయి లో తహసీల్దార్లు, గ్రామ స్థాయిలో కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు ఉన్నారు.

లైంగిక దాడుల నివారణకు పోక్సో చట్టం
బాలలపై జరిగే లైంగిక దాడుల నివారణకు 2012లో పోక్సో చట్టాన్ని తెచ్చారు. బాలలను ప్రలోభపెట్టడం, లైంగిక కార్యకలాపాల్లో ఉపయోగించడం, అశ్లీల సాహిత్యం, చర్యలకు వినియోగించడం, అనైతిక కార్యకలాపాలను నిరోధించే చట్టం ఇదీ. బలత్కారం చేస్తే ఏడేళ్ల జైలు శిక్ష లేదా జీవితఖైదు, జరిమానా విధిస్తారు. దారుణమైన లైంగిక దాడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, జీవిత ఖైదు, లైంగిక దాడికి మూడు నుంచి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా ఉంటుంది. లైంగిక వేధింపులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమా నా, బాలలను అశ్లీల కార్యకలాపాలకు ఉపయోగిస్తే ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తారు. పిల్లల అక్రమ రవాణా, విక్రయిస్త్తే ఏడేళ్ల కఠిన శిక్ష, లేదా జీవిత ఖైదు, పిల్లలను వ్యభిచార వృత్తిలోకి దింపితే ఏడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రెండువేల జరిమానా, బలవంతపు వ్యభిచారం చేయిస్తే 14 సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా విధిస్తారు.

తగ్గుతున్న బాలబాలికల నిష్పత్తి
బాలికలు జీవించే, రక్షణ పొందే, అభివృద్ధి చెందే హక్కులను సమానంగా కలిగి ఉంటారు. కానీ, బాలికలు బాలు ర కంటే వివక్షను ఎదుర్కొంటున్నారు. 2001 జనాభా ప్రకారం 0-6 సంవత్సరాల బాలబాలిక నిష్ప త్తి వెయ్యి మంది బాలురకు 927 మంది బాలికలున్నారు. 2011 గణాంకాల ప్రకారం వె య్యి మంది బాలురకు 919 మంది మాత్రమే బాలికలున్నా రు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతా ల్లో బాలికల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు తేలింది. ఉమ్మడి తెలుగు రాష్ర్టాల్లో 2001 జనా భా గణాంకాల ప్రకారం వెయ్యి మంది బాలురకు 961 బాలికలు ఉండగా, 2011లో బాలికల సంఖ్య 916కు పడిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలబాలికల నిష్పత్తి 2011 లెక్కల ప్రకారం వెయ్యి మంది బాలురకు 916 మంది బాలికలే ఉన్నారు. ఇదీ రాష్ట్ర, దేశ నిష్పత్తి కంటే తక్కువగా ఉన్నట్లు నివేదిక చెబుతున్నది.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...