దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు


Sat,October 19, 2019 03:23 AM

నర్సంపేట, నమస్తే తెలంగాణ : దూర ప్రాంతాలకు ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులను హైదరాబాద్, నిజామాబాద్ లాంటి నగరాలకు కూడా నడుపుతున్నారు. 100 శాతం ఆర్టీసీ బస్సులను నడిపించాలనే ఉన్నతాధికారుల ఆదేశాలతో ముందుకు వెళ్తున్నారు. అధికారులు బస్సులను క్రమేపీ పెంచుతున్నారు. గతంలో నర్సంపేట నుంచి పట్టణాలకు నడిపించిన సర్వీసులన్నీంటినీ పునరుద్ధరిస్తున్నారు. ఆర్టీసీలో 14 రోజులుగా నిర్వహిస్తున్న కార్మికుల సమ్మెతో ఆర్టీసీ బస్సులను రోడ్డెక్కిస్తున్నారు. నర్సంపేట ఆర్టీసీ డిపోలో మొత్తం 95 బస్సులు ఉన్నాయి. శుక్రవారం ఆర్టీసీ, హైర్ బస్సులను కలుపుకుని అధికారులు 63 సర్వీసులను నడిపారు. ఈ బస్సులు నడపడానికి డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలికంగా నియమించుకుంటున్నారు. ఎంవీఐ అధికారులు సూచించిన మేరకు ఆర్టీసీ అధికారులు డ్రైవర్ల నియామకం చేసుకుంటున్నారు. కండక్టర్లను డిపో అధికారులే నేరుగా విధుల్లోకి తీసుకుంటున్నారు. కండక్టర్లుగా రాణించిన వారికే మరుసటి రోజు విధులు ఇస్తున్నారు. దీంతో నిరుద్యోగులు చాలా మంది ఆర్టీసీ డిపోల దగ్గరకు వచ్చి కొలువు కోసం వేచి ఉంటున్నారు.

ఆర్టీసీ అధికారులు హైదరాబాద్, నిజామాబాద్, వేములవాడ, శ్రీశైలం, కరీంనగర్, గోదావరిఖని, భద్రాచలం, మహబూబాబాద్, ఏటూరునాగారం, పరకాల, హన్మకొండ, వరంగల్, ములుగు, నెక్కొండ, తొర్రూరు లాంటి పట్టణాలకు బస్సులను నడిపిస్తున్నారు. ఈ రూట్ల వారీగా బస్సు సర్వీసులు నడుస్తుండడంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సు సర్వీసులను నడిపిస్తున్నారు. దూరంగా ఉన్న సర్వీసులకు మధ్యరాత్రి వరకు నడిపిస్తున్నారు. 19న కార్మికులు జరుపతలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ పలు పార్టీల నాయకులు, కార్మికులు పట్టణంలో బైక్ ర్యాలీలను నిర్వహించారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌ను కూడా మూసివేయాలని కార్మికులు లేఖలను ఇచ్చారు. నర్సంపేట సీఐ కరుణసాగర్‌రెడ్డి, ఎస్సైలు నాగ్‌నాథ్, యుగేంధర్ బందోబస్తు నిర్వహించారు.

పరకాల డిపో నుంచి 67 బస్సు సర్వీసులు
పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల ఆర్టీసీ డిపో నుంచి శుక్రవారం 67 బస్సులు నడిచాయి. అద్దె బస్సుల డ్రైవర్లు ఎవరూ రాకపోయినా ఆర్టీసీ బస్సులను తాత్కాలిక సిబ్బందితో డిపో మేనేజర్ బస్సులను నడిపించారు. మొత్తం 92 బస్సుల్లో 67 ఆర్టీసీ బస్సులను నడిపినట్లు డీఎం పవన్‌కుమార్ తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ప్రతి రూటుకు బస్సు సర్వీసులు నడిపిస్తున్నట్లు ఆయన చెప్పారు. పట్టణ కేంద్రాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు సర్వీసులు నడిపిస్తున్నామని, ప్రయాణిలెవరూ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించొద్దని కోరారు. ఆర్టీసీ ప్రయాణం సుఖవంతమైన ప్రయాణమని, అనుభవం ఉన్న వారినే తాత్కాలిక డ్రైవర్లుగా నియమించినట్లు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ శనివారం చేపట్టిన బంద్‌కు మద్దతునివ్వాలని కార్మికులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles