అభివృద్ధిలో పర్వతగిరి ఆదర్శం


Thu,October 17, 2019 03:37 AM

-చరిత్రలో నిలిచిపోయేలా ప్రణాళికలు
-చిరకాలం గుర్తుండేలా ప్రగతి పనులు
-గ్రామాల్లో అత్యాధునిక శ్మశానవాటికలు
-30 రోజుల ప్రణాళిక కొనసాగించాలి
-పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి
-రూర్బన్ పథకంపై అవగాహన సదస్సు

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ: అభివృద్ధిలో పర్వతగిరి మండలం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ఈ మండలంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్ పథకం అమలుపై బుధవారం హన్మకొండలోని రూరల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా, మండల స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై జాతీయ రూర్బన్ మిషన్ పథకం అమలుపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో చర్చించారు. ఇన్నాళ్లు పుర పథకంలో ఉన్న పర్వతగిరి మండలం ప్రస్తుతం జాతీయ రూర్బన్ మిషన్ పథకంలోకి వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో పర్వతగిరి మండలంలో చిరకాలం గుర్తుండేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. జాతీయ రూర్బన్ మిషన్ పథకం నుంచి ఈ మండలంలోని ప్రతి గ్రామంలో పట్టణాల్లో ఉండే వసతులు కల్పించాలని మంత్రి చెప్పారు. పార్కులు, జిమ్ సెంటర్లు, ఆధునిక మార్కెట్లు నిర్మించాలని దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తయారు చేయాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలని అన్నారు. పర్వతగిరి నా సొంతూరు, మండలం.

అక్కడ చేపట్టే పనులూ గొప్పగా ఉండాలని పేర్కొన్నారు. పర్వతగిరి, అన్నారం, చింతనెక్కొండ గ్రామాల్లోని చెరువులపై ట్యాంకుబండ్‌ల నిర్మాణ ప్రతిపాదనలు పరిశీలించాలని, ఏనుగల్ గ్రామానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. డంపింగ్ యార్డు నుంచి ఎరువులు తయారు చేసేలా ప్రతిపాదనలు ఉండాలని, గ్రామాల్లో అత్యాధునిక శ్మశానవాటికలు నిర్మించాలని ఎర్రబెల్లి చెప్పారు. అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు రూపొందించాలని, గిరిజన తండాల్లోని విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలను ఆధునీకరించాలని సూచించారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి అభివృద్ధి పనుల కోసం వినియోగించాలని, మహిళలు, ముఖ్యంగా గిరిజన మహిళల కోసం ప్రత్యేక ప్రణాళికలు చేయాలని ఆదేశించారు. పర్వతగిరి ప్రభుత్వ దవాఖానను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటును పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి దయాకర్‌రావు అన్నారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక వల్ల గ్రామీణ ప్రజల్లో చైతన్యం వచ్చిందని, గ్రామాలన్నీ పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయని తెలిపారు. పరిశుభ్రత పాటించని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పారిశుధ్యం లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను నిరంతరం కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దని చెప్పారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ జాతీయ రూర్బన్ మిషన్ కింద పర్వతగిరి మండలాన్ని గుర్తించి అభివృద్ధి పనుల కోసం రూ.30 కోట్లు తెచ్చిన మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలిపారు.

అవసరాలను గుర్తించాలి : కలెక్టర్ హరిత
అన్ని శాఖల అధికారులు పర్వతగిరి మండలంలోని గ్రామాల అభివృద్ధి కోసం కావాల్సిన అవసరాలను గుర్తించాలని, అందుకు తగిన నిధుల కోసం అంచనా వేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం హరిత ఆదేశించారు. సామాజిక, గ్రామ అవసరాల విషయంలో సంబంధిత శాఖ ద్వారా ప్రతిపాదనలు జరగాలని ఆమె చెప్పారు. జిల్లాస్థాయి అధికారులంతా గ్రామ పంచాయతీని సందర్శించి అక్కడ కావాల్సిన అభివృద్ధికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని అన్నారు. వారంలో రోజుల్లో అధికారులందరూ డేటా ఇవ్వాలని, ఎక్కడైన సంబంధిత శాఖ నిధులు సరిపోకపోతే మాత్రమే రూర్బన్ నిధులను ప్రతిపాదించాలని కలెక్టర్ తెలిపారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రూర్బన్ మిషన్ జాయింట్ కమిషనర్ వీరారెడ్డి, స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ నర్సింహులు, మార్కెటింగ్ మేనేజర్ విద్యాసాగర్, ట్రైనీ కలెక్టర్ సంతోశ్, డీఆర్డీవో సంపత్‌రావు, డీపీవో నారాయణరావు తదితరులు అవగాహన సదస్సులో పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...