మద్యం అమ్మకాల్లో ధర్మారం షాపు టాప్‌


Sun,October 13, 2019 02:01 AM

- రెండేళ్లలో రూ.20.38 కోట్ల విక్రయాలు
- రెండోస్థానంలో అన్నారంషరీఫ్‌లోని షాపు
- నెక్కొండలోని రెండో నంబర్‌ దుకాణం థర్డ్‌
- తర్వాత స్థానాల్లో రాయపర్తి, గిర్నిబావి షాపులు
- జిల్లా వ్యాప్తంగా రూ.550 కోట్లకు పై అమ్మకాలు
- ఇప్పటికే 39 దుకాణాలకు 183 దరఖాస్తులు

వరంగల్‌రూరల్‌ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ : మద్యం అమ్మకాల్లో జిల్లాలో ధర్మారం వైన్‌షాపు రికార్డు సృష్టించింది. రెండేళ్లలో రూ.20. 38 కోట్ల మద్యం విక్రయాలతో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. అన్నారంషరీఫ్‌ మద్యం దుకాణం రెండో స్థానంలో ఉంది. ఈ షాపులో రూ.19.16 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక నెక్కొండ మండల కేంద్రంలోని రెండో నంబర్‌ వైన్‌ షాపు మూడో స్థానంలో నిలిచింది. ఈ దుకాణంలో రూ.18.91 కోట్ల లిక్కర్‌ విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్‌శాఖ లెక్కలు చెపుతున్నాయి. రాయపర్తి మండల కేంద్రంలోని రెండో నంబర్‌ వైన్‌షాపు, దుగ్గొండి మండలంలోని గిర్నిబావి మద్యం దుకాణం వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. 2017-19 ఆబ్కారీ విధానం 2017 అక్టోబరు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. గత సెప్టెంబరు 30వ తేదీ వరకు సరిగ్గా రెండేళ్లు గడిచింది. ఈ రెండేళ్లలో జిల్లాలోని ప్రతీ మద్యం దుకాణంలో అమ్మకాలు లైసెన్సు ఫీజుపై ఏడు రెట్లకంటే ఎక్కువగా జరగటం విశేషం. ప్రధానం గా కొన్ని మద్యం షాపుల్లో విక్రయాలు పోటాపోటీగా సాగటం ఆసక్తి రేపింది. ఈ అంశం ప్రస్తుతం 2019-21 నూ తన ఎక్సైజ్‌ పాలసీ అమలు కోసం జి ల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపునకు వ్యాపారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్న తరుణంలో ఆబ్కారీ వర్గాల్లో చర్చనీయమైంది. ఎందుకంటే మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసే వ్యాపారులు గత రెండేళ్లలో అమ్మకాలు అధికంగా జరిగిన దుకాణాల వివరాలు సేకరిస్తున్నారు. మద్యం విక్రయాల్లో టాప్‌లో ఉన్న షాపులకు దరఖాస్తు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో 2017-19 ఎక్పైజ్‌ పాలసీని పురస్కరించుకుని గత రెండేళ్లలో అంటే 2017 అక్టోబరు 1 నుంచి 2019 సెప్టెంబరు 30వ తేదీ వరకు జిల్లాలోని 58 వైన్‌షాపుల్లో జరిగిన మద్యం అమ్మకాలను పరిశీలిస్తే విక్రయాల్లో ధర్మారం షాపు అగ్రభాగాన ఉంది. గీసుకొండ మండలంలోని ధర్మారం గ్రామం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ)లో కలిసినట్లు ఉంది. ధర్మారం షాపులో 2017-18 సంవత్సరంలో రూ.10.05 కోట్ల ఐఎంఎల్‌, బీర్ల విక్రయాలు జరిగాయి. 2018-19 సంవత్సరంలో రూ.10.33 కోట్ల ఐఎంఎల్‌, బీర్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు వెల్లడించారు. రెండేళ్లలో జిల్లాలోని ఇతర షాపులకంటే అత్యధికంగా రూ.20.38 కోట్ల మద్యం అమ్మకాలతో ధర్మారం గ్రామంలోని వైన్‌ షాపు టాప్‌లో నిలిచింది.

విక్రయాల్లో పోటాపోటీ
జిల్లాలోని పలు వైన్‌ షాపుల్లో అమ్మకాలు పోటాపోటీగా సా గాయి. రెండేళ్ల మద్యం విక్రయాల్లో పర్వతగిరి మండలం అన్నారంషరీఫ్‌ గ్రామంలోని వైన్‌షాపు ధర్మారం దుకాణం తర్వాత స్థానంలో నిలిచింది. అన్నారంషరీఫ్‌ షాపులో 2017-18 సం వత్సరంలో రూ.8.51 కోట్లు, 2018-19లో రూ.10.65 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మూడో స్థానంలో ఉన్న నెక్కొం డ మండల కేంద్రంలోని రెండో నంబర్‌ దుకాణంలో 2017-18లో రూ.10.69 కోట్లు, 2018-19లో రూ.8.22 కోట్ల ఐఎంఎల్‌, బీర్ల విక్రయాలు సాగాయి. రెండేళ్లలో రాయపర్తి మండల కేంద్రంలోని రెండో నంబర్‌ దుకాణంలో రూ.18.61 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌శాఖ లెక్కలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ షాపులో 2017-18లో రూ.10.79 కోట్లు, 2018-19లో రూ.7.82 కోట్ల ఐఎంఎల్‌, బీర్ల విక్రయాలు జరిగినట్లు స్పష్టం చేస్తున్నాయి. దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రా మంలోని వైన్‌షాపులో రెండేళ్లలో మొత్తం రూ.17.72 కోట్ల మ ద్యం అమ్మకాలు సాగాయి. ఇందులో 2017-18లో రూ. 8.71 కోట్లు, 2018-19లో రూ.9.01 కోట్ల ఐఎంఎల్‌, బీర్ల విక్రయాలు జరిగాయి. ఈ దుకాణంలో రెండో ఏడాది మద్యం అమ్మకాలు పెరగటం గమనార్హం. గత రెండేళ్లలో వర్ధన్నపేట మున్సిపాలిటీలోని రెండో నంబరు దుకాణంలో రూ.16.89 కోట్లు, గీసుకొండ మండలం కోనాయిమాకుల గ్రామంలోని షాపులోనూ రూ.16.89 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ రెండు దుకాణాల్లోనూ మొదటి ఏడాది కంటే రెండో సంవత్సరంలో అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు ఎక్సైజ్‌శాఖ రికార్డుల ద్వార తెలుస్తుంది.

గత రెండేళ్లలో సంగెం మండలం కాపులకనపర్తి గ్రామంలోని వైన్‌షాపులో రూ.16.67 కోట్లు, నర్సంపేట మున్సిపాలిటీలోని ఒకటవ నెంబరు దుకాణంలో రూ. 16.42 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కాపులకనపర్తి షాపులో మొదటి ఏడాది రూ.7.95 కోట్లు, రెండో ఏడాది రూ.8.71 కోట్ల విక్రయాలు సాగినట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు. నర్సంపేటలోని ఒకటవ నెంబర్‌ షాపులోనూ ఇదే పరిస్థితి. ఈ దుకాణంలో తొలి సంవత్సరం రూ.7.64 కోట్లు, రెండో ఏడాది రూ.8.78 కోట్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు. గీసుకొండ మండలం జాన్‌పాకలోని వైన్‌షాపులో రెండేళ్లలో రూ.16.01 కోట్లకుపైగా ఐఎంఎల్‌, బీర్ల విక్రయాలు సాగినట్లు ప్రకటించారు. ఈ షాపులోనూ మొదటి ఏడాది రూ.7.94 కోట్లు, రెండో సంవత్సరం రూ.8.07 కోట్ల అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. గత రెండేళ్లలో ఆత్మకూరు మండలం దుర్గంపేట (ఊరుగొండ) షాపులో రూ.15.24 కోట్లు, గీసుగొండ మండలం మచ్చాపూర్‌ గ్రామంలోని మద్యం దుకాణంలో రూ.15.22 కోట్ల విక్రయాలు సాగినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా రూ.550 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు అధికారులు వివరించారు.

ఒకేరోజు 103 దరఖాస్తులు
ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం రెండేళ్ల గడువు తో ప్రకటించిన 2019-21 కొత్త ఎక్సైజ్‌ పాలసీ నవంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యం లో జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపునకు ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖ జిల్లా సూపరింటెండెంట్‌(ఈఎస్‌) శ్రీనివాసరావు ఈ నెల 9న నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. హన్మకొండ నిట్‌ సమీపంలో మ యూరి గార్డెన్‌ లైన్‌లోని జిల్లా ఎక్సైజ్‌ అధికారి కార్యాలయం వద్ద ఆ బ్కారీ శాఖ అధికారులు మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా కౌంటర్లు నిర్వహిస్తున్నారు. ఆదివారం సె లవు దినం. దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఈ నెల 16వ తేదీ. శనివారం వరకు 39 మద్యం దుకాణాల కోసం 183 దరఖాస్తులు వచ్చినట్లు శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో మొత్తం వైన్‌షాపుల సంఖ్య 56. గతంలో 58 దుకాణాలు ఉండగా పరకాలలోని మద్యం దుకాణాల్లో రెండు తగ్గాయి. దీంతో జిల్లాలో వైన్‌షాపుల సంఖ్య 56కు చేరింది. వీటిలో ఇంకో 17 షాపులకు దరఖాస్తులు రావాల్సి ఉంది. సోమవారం నుంచి మూడు రోజుల గడువు ఉన్నందున జిల్లాలోని 56 మద్యం దుకాణాలకు దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు విశ్వసిస్తున్నారు. శనివారం ఒకరోజే 103 దరఖాస్తులు అందినట్లు ఈఎస్‌ వెల్లడించారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...