ఆగని ప్రగతి చక్రం


Sun,October 13, 2019 02:00 AM

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో చేపట్టిన ప్రత్యామ్నయ ఏర్పాట్లను ప్రభుత్వం రోజురోజుకీ విస్తృతం చేస్తున్నది. రవాణాలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా, ప్రయాణం సాఫీగా జరిగేలా బసు సర్వీసులు నడుపుతున్నది. జిల్లాలో అధికారులు శనివారం 75 శాతానికిపైగా బసు సర్వీసులు తిప్పారు. పరకాల, నర్సంపేట ఆర్టీసీ బస్‌ డిపోల నుంచి 118 బసు సర్వీసులు నడిచినట్లు ప్రకటించారు. అత్యధికంగా పరకాల డిపో నుంచి 63 బసు సర్వీసులు నడిచినట్లు వెల్లడించారు. వీటిలో 44 ఆర్టీసీ, 19 అద్దె బసులు ఉన్నట్లు తెలిపారు. ఈ డిపోలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు 107 మంది డ్యూటీ చేశారు. వీరిలో డ్రైవర్లు 44, కండక్టర్లు 63 మంది ఉన్నారు. నర్సంపేట డిపో నుంచి 55 బసు సర్వీసులు నడిచినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 36 ఆర్టీసీ, 19 అద్దె బసు సర్వీసులు ఉన్నాయని, తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఇక్కడ 91 మంది విధులు నిర్వర్తించారని ప్రకటించారు. డ్రైవర్లు 36 మంది, కండక్టర్లు 55 మంది పనిచేశారని తెలిపారు. నర్సంపేట డిపో నుంచి వరంగల్‌, హన్మకొండ, హైదరాబాద్‌, మహబూబాబాద్‌ తదితర రూట్లలో, పరకాల డిపో నుంచి హన్మకొండ, హైదరాబాద్‌, భూపాలపల్లి, హుజూరాబాద్‌ తదితర రూట్లలో ఆర్టీసీ, అద్దె బస్సు సర్వీసులు తిరిగాయి. ఆర్టీసీ, అద్దె బసు సర్వీసుల ద్వారా జనం ప్రశాంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. సరిపడా బస్సులు నడవటంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీ, రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఆర్టీసీ డిపోల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది కూడా విధులు నిర్వర్తించారు. ఆర్టీసీ అధికారులకు తమ వంతు సహకారం అందించారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...