పల్లెల అభివృద్ధే లక్ష్యం


Sat,August 17, 2019 03:43 AM

-సీఎం లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి
-ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి
-కొత్తగట్టుసింగారంలో జీపీ భవన నిర్మాణ పనులు ప్రారంభం

శాయంపేట, ఆగస్టు 16 : నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శాయంపేట మం డలం కొత్తగట్టుసింగారంలో ఉపాధి హామీ పథకం నిధు లు రూ.13 లక్షలతో నూతనంగా చేపట్టనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్రజ్యోతితో కలిసి ఎమ్మెల్యే రమణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ప్రారంభించి, హరితహారంలో భాగంగా గండ్ర దంపతులు మొక్కలను నాటారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కొత్తగట్టుసింగారంలో 2009-10లోనే గ్రామ పంచాయతీ భవనానికి నిధులు మంజూరైనా సాంకేతిక కారణాలతో నిర్మించడం వీలుకాలేదని పేర్కొన్నారు. నాలుగైదు నెలల్లోనే పనులను పూర్తి చేసి అన్ని వసతులతో ఉన్న గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు.

పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు తక్కువ పడితే నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి లేదా కలెక్టర్ ప్రత్యేక నిధి నుంచి నిధులను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో భారీగా మొక్కలను పెంచి సంరక్షించుకునేందుకు హరితహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు. సంపదను సృష్టించడం చాలా కష్టమని, విధ్వంసం చేయడం చాలా సులువని పేర్కొన్నారు. చెట్లను సులువుగా కూల్చి వేస్తున్నారని, ఒక చెట్టు పెరిగేందుకు ఎంత కష్టమవుతుందో తెలుసుకోవాలని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఇంటిలోను నాలుగు మొక్కలను తప్పకుండా నాటుకోవాలని కోరారు. శనివారం మండలంలో లక్ష మొక్కలు నాటి, మెగా ప్లాంటేషన్‌ను చేపడుతున్నామని తెలిపారు.

హరితహారంలో భాగస్వాములు కావాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరు కూడా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న చైర్‌పర్సన్ మాట్లాడుతూ చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న జీపీ భవన పనులు ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని, రాబోయే నాలుగు నెలల్లో పూర్తి చేయాలన్నారు. గ్రామ స్థాయి నుంచి పాలన పటిష్టంగా ఉండాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించినట్లు తెలిపారు. హరితహారంలో మొక్కలను పెంచి సంరక్షించాలని సీఎం ప్రతి మీటింగ్‌లోనూ చెబుతున్నట్లు వివరించారు. ఎక్కడైతే మొక్కలు పెంచకపోతే అధికారులతో పాటు ప్రజాప్రతినిధులపై కూడా చర్యలు తీసుకుంటాయని సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలిపారు. హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. శనివారం మెగా ప్లాంటేషన్‌ను చేపడుతున్నందున అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, తహసీల్దార్ మంజుల, ఎంపీడీవో అనురాధ, పీఆర్ డీఈ లింగారెడ్డి, ఏఈ మోహన్‌రెడ్డి, ఆర్‌ఐ హేమానాయక్, సర్పంచ్‌లు పెంబర్తి చిన్నసంతోష, అబ్బు ప్రకాశ్‌రెడ్డి, బైరి శ్రీను, సాంబయ్య, ఎంపీటీసీలు గొట్టిముక్కుల స్వాతి, మేకల శ్రీనివాస్, రైతు సమితి మండల కన్వీనర్ కర్ర ఆదిరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్, పోలెపల్లి శ్రీనివాస్‌రెడ్డి,గంగుల మనోహర్‌రెడ్డి, శరబంధం, పోతు రమణారెడ్డి, కొమ్ముల భాస్కర్, పల్లె బుచ్చిరెడ్డి, కుడ్లె సుధాకర్‌రావు, బుస్స సంపత్, వైనాల కుమారస్వామి, బొమ్మకంటి ఆనందం, దూదిపాల తిరుపతిరెడ్డి, పొడిశెట్టి గణేష్, శంకరాచారి, రేనుకుంట్ల సదయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, వలుపదాసు చంద్రమౌళి, కర్ణాకర్, రమేష్ పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...