పాకాల కాల్వలను ఆధునీకరిస్తాం


Wed,August 14, 2019 02:03 AM

ఖానాపురం, ఆగస్టు 13 : పాకాల పంట కాల్వలను పూర్తిస్థాయిలో ఆధునీకరించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతామని దేవాదుల చీఫ్ ఇంజినీర్ బంగారయ్య అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు దేవాదుల సీఈ బంగారయ్య మంగళవారం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, స్థానిక ఐబీ అధికారులతో కలిసి పాకాల ఆయకట్టు పరిధిలోని తుంగబంధం, సంగెం, పస్నూరు, జాలుబంధం పంట కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రకాశ్‌రావు పంట కాలువల పరిస్థితిని సీఈకి వివరించారు. ఎనిమిదేళ్లుగా పాకాల పంటకాల్వల్లో చెత్త, గుర్రపు డెక్క తొలగింపు, మరమ్మతు పనులను స్థానిక రైతులే చేపడుతున్నట్లు చెప్పారు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి బిల్లులు చెల్లించలేదన్నారు. వారి పెండింగ్ బిల్లులను చెల్లించాలని, అలాగే, పంట కాల్వల పర్యవేక్షణకు సిబ్బందిని పెంచాలని కోరారు. ఇందుకు సీఈ అంగీకరించారు. అనంతరం సీఈ బంగారయ్య మాట్లాడుతూ పాకాల పంట కాలువ మరమ్మతు పనులపై డీఈ రాంప్రసాద్ ఆధ్వర్యంలో అంచనా తయారు చేసి పంపించారన్నారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు పాకాలకు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ పంటకాల్వలు అధ్వానంగా ఉన్నాయని, మొత్తం చెత్త పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా నిలుస్తున్నట్లు గుర్తించామన్నారు. వెంటనే పంటకాల్వల ఆధునీకరణకు రూ.35 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో పంటకాల్వల మరమ్మతు పనులు పూర్తిచేసి, చివరి ఆయకట్టు రైతులకు నీరందిస్తామని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్‌లోనూ రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తనివ్వమని ఆయన వివరించారు. ఎస్‌ఈ రమేశ్, ఈఈ శ్రావణ్‌కుమార్, డీఈ రాంప్రసాద్, ఏఈలు శృతి, నితిన్, సంతోష్, వర్క్‌ఇన్‌స్పెక్టర్ మనోహరస్వామి తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...