పల్లె వికాసానికి పక్కా ప్రణాళిక


Mon,August 12, 2019 03:32 AM

-రెండు మాసాల కార్యాచరణకు కసరత్తు
-సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షం
-ప్రగతి బాట పట్టనున్న గ్రామాలు
-జిల్లా, మండల పరిషత్‌లకు విధులు, నిధులు
-ఖాళీల భర్తీ, పదోన్నతులు
-పంచాయతీరాజ్ ఉద్యోగుల్లో ఆనందం
-జిల్లాలో 401 గ్రామపంచాయతీలు

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లెల వికాసానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దీనికనుగుణంగా రెండు మాసాలపాటు పల్లెపల్లెన పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం 60 రోజులకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ఈ మేరకు జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో పంచాయతీ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం అధికారులను గుర్తించే పని కొనసాగుతోంది. నూతన పంచాయితీరాజ్ చట్టంలో పొందుపర్చిన విధంగా గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారాలను అప్పగించారు. దీనికితోడుగా బాధ్యతలను కూడా అప్పగించే పనిలోపడ్డారు. పల్లెపల్లెన గుణాత్మకమైన మార్పు తేవాలనే ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా రెండు నెలల ప్రత్యేక కార్యాచరణ అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు ఖాళీలను భర్తీ చేయడం, సంబంధిత అధికారులకు బాధ్యతలు అప్పగించడం, కార్యాచరణ లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగనున్నది.

ఏండ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడంతోపాటు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఖాళీలను భర్తీ చేయడం, గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యే ఈవోపీఆర్‌డీల పేరు మార్చడం, ఖాళీలను భర్తీ చేయడంలాంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం అందించిన సంకేతాలకు అనుగుణంగా జిల్లా అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. పూర్తి మార్గదర్శకాలు, ఆదేశాలు అందిన తర్వాత మరింత వేగం చేసేందుకు అధికారయంత్రాంగం సిద్ధంగా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు, 401 గ్రామపంచాయతీలు ఉనాయి. గ్రామస్థాయిలో ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించడం ఇప్పటికే పూర్తయింది. డివిజన్ స్థాయిలో అధికారులకు బాధ్యతలు అప్పగింత కార్యక్రమం ఖరారైంది. జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో ఖాళీగా ఉన్న ఈవోపీఆర్డీల నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అధికార యంత్రాంగం పంపించింది.

ఇక ఖాళీలను పదోన్నతుల ద్వారా పూర్తిచేయడంతోపాటు కార్యదర్శుల నియామకాలను కూడా పూర్తిచేయాలనే లక్ష్యంతో యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించింది. ఈ రెండు మాసాల ప్రత్యేక కార్యాచరణతో పారిశుద్ధ్యం, పచ్చదనంతోపాటు పల్లెల వికాసానికి పారదర్శకంగా పథకాల అమలు, పంచాయతీల బాధ్యతలు, హక్కులు తదితర విషయాలపై 60రోజుల కార్యాచరణ ఉండనున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమిచ్చే మార్గదర్శకాలు, త్వరలో తీసుకోనున్న నిర్ణయాల అనంతరం సమగ్ర స్వరూపానికి బాటలు వేయనున్నది. 60 రోజుల (రెండు మాసాల) కార్యాచరణ పూర్తయితే పల్లెల సమగ్ర అభివృద్ధి, పారిశుధ్యం, పచ్చదనం మరింత వేగంగా ముందుకుసాగనున్నది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాక వాటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులను కేటాయిస్తుంది. ఆతర్వాత కార్యాచరణ ప్రణాళికలను గ్రామాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది.

ప్రగతిపథంలో పల్లెలు..
జిల్లా, మండల పరిషత్‌లకు విధులు, నిధులు కేటాయించి సమగ్రాభివృద్ధికిపాటు పడాలనే ప్రభుత్వ సంకల్పం త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఈమేరకే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తాజాగా జిల్లాకు చెందిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి నిర్వహించిన సమీక్షలో ఈవిషయం వెల్లడైంది. దీంతో మండల, జిల్లా పరిషత్ పాలక మండలి సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఈమేరకు విధివిధానాలు, ఎవరెవరి భాగస్వామ్యం ఏయే శాఖల్లో ఉండాలో కూడా తేలుస్తామని సీఎం చెప్పడంతో వారి ఆనందానికి అవధులు లేవు. జిల్లా, మండల పరిషత్‌ల్లో కేంద్ర పభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ నిధులను విడుదల చేసి ఆ తర్వాత కొత్త పంచాయతీ రాజ్ చట్టానికి అనుగుణంగా పల్లెలను మరింత వేగంగా ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లాలో కృషి జరుగుతున్నది.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...