సాగు.. బాగు..


Sun,August 11, 2019 03:52 AM

-వ్యవసాయ పనుల్లో రైతన్న బిజీబిజీ
-లక్ష హెక్టార్లు దాటిన సాగు విస్తీర్ణం
-ఆశాజనకంగా వర్షాలు
-కళకళలాడుతున్న నీటి వనరులు
-ఊపందుకున్న వరినాట్లు
-ఆరుతడి పంటలకు ఢోకాలేదు..
-అంచనాలకు చేరుకున్న సాగు: జేడీఏ ఉషాదయాళ్
-నేడు పాకాల, మాదన్నపేట ఆయకట్టుకు సాగునీటి విడుదల
పరకాల, నమస్తే తెలంగాణ : రూరల్ జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతన్నలు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. జూలై నెలాఖరు వరకు వర్షాల కోసం ఎంతో రైతులు ఆశగా ఎదురుచూసినప్పటికీ ఆగస్టు ప్రారంభంలోనే వర్షాలు ప్రారంభమయ్యాయి. వరుసగా కురిసిన వర్షాలతో రైతన్న మురిసిపోతున్నాడు. సంతోషంగా సాగు పనిలో నిమగ్నమయ్యారు. దీంతో జిల్లాలో రోజురోజుకు సాగువిస్తీర్ణం పెరుగుతోంది. పత్తి, మిరప, పసుపు, మొక్కజొన్నతోపాటు వరిపంట సాగు జిల్లాలో జోరుగా సాగుతోంది. 1,33,623హెక్టార్ట సాగువిస్తీర్ణం జిల్లాలో ఉండగా ఇప్పటికే లక్ష హెక్టార్లకుపైగా సాగు చేశారు. ఆరుతడి పంటలతోపాటు వరి పంటకు కూడా ఢోకాలేకుండా పోయింది. జిల్లాలోని అన్ని నీటివనరుల్లోకి నీరు చేరగా కొన్ని చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి.

ఇంతకాలం బావులు, బోర్లకిందనే సాగిన వరి ఇప్పుడు నీటివనరుల ఆయకట్టులో కూడా సాగుతున్నది. ప్రతీరోజు జిల్లాను వర్షం పలకరిస్తుండగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటసాగుపై ఆశలు సన్నగిల్లే క్రమంలో వరుసగా వర్షాలు కురిసాయి. దీంతో జిల్లాలోని పెద్ద నీటివనరులైన పాకాల, చలివాగు ప్రాజెక్టుల్లోకి సైతం నీరు వచ్చి చేరింది. అంతేకాకుండా ఇప్పటికే మత్తళ్లు పోస్తున్న వాగులు, వంకలు, చెరువులు, కుంటల కింద వరి సాగు పెరుగుతూ వస్తున్నది. గతంతో పోలిస్తే ఈ ఏడాది కొంత వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ పంటలకు సరిపడా వర్షం కురవడంతో అన్నదాతలు పొలం పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. తెల్లవారగానే రైతులు, రైతు కూలీలు పొలాలకు చేరుకుని వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. గొర్రుకొట్టడం, నాట్లకు వరిపొలాలను సిద్ధం చేయడం, నాట్లు వేయడం వంటివి చేస్తున్నారు. రూరల్ జిల్లాలో 16 మండలాలు ఉండగా 401 గ్రామాలు ఉన్నాయి.

ఈ మండలాల్లో రైతులు మొక్కజొన్న, పత్తి, పసుపు, వేరుశనగ, మిర్చి, కంది, పసుపు, వరి తదితర పంటలను సాగు చేస్తున్నారు. ఒక్క నర్సంపేట ప్రాంతంలో మినహా పరకాల, వర్ధన్నపేట డివిజన్లలో వరినాట్లు ఊపందుకున్నాయి. పాకాల సరస్సులో నీటిమట్టం పెరిగే కొద్దీ ఆయకట్టు రోజురోజుకు పెరుగుతోంది. పంటలకు సరిపడా నీరు చెరువులు, కుంటల్లోకి చేరడంతో రైతులు ఎంతో ధైర్యంగా పంటలను సాగు చేస్తున్నారు. 31465 హెక్టార్ల వరిసాగు సాధారణ విస్తీర్ణం ఉండగా ఇప్పటికే సాగైన విస్తీర్ణం 15వేల హెక్టార్లు దాటిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వరి మినహా మిగతా అన్నిరకాల పంటలు దాదాపు సాధారణ విస్తీర్ణాన్ని చేరుకున్నాయని వారు పేర్కొంటున్నారు.

అంచనాలకు చేరుకున్న సాగు : జేడీఏ ఉషాదయాల్
ఈ ఏడాది సాగు విస్తీర్ణం అంచనాలకు చేరుకుంది. వర్షాలు కాస్త ఆలస్యంగా కురిసినప్పటికీ వరుసగా వర్షాలు కురియడంతో పంటలకు ఢోకాలేకుండా పోయింది. ఇంతకాలం వరి సాగు కోసం వేచిచూసిన రైతులు ఇప్పుడిప్పుడే సాధారణ విస్తీర్ణం మొత్తం సాగు చేసేందుకు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది పంటల సాగు సమృద్ధిగానే సాగనుంది. ఆలస్యంగా వర్షాలు కురిసినప్పటికీ పంటలకు ఇక ఎలాంటి ఇబ్బందిలేకుండా పోయింది. మరో పదిహేను రోజుల్లో వరినాట్లు పూర్తయ్యే అవకాశాలున్నాయి.

దుగ్గొండిలో..
దుగ్గొండి, అగస్టు 10: గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఖరీఫ్ వరి నాట్లు జోరుగా ఊపందుకున్నాయి. దుగ్గొండి మండలంలోని 34 గ్రామ శివారు లోని రైతులు అనుకున్నట్లుగా సరిపడా వర్షాలు పడటంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు, రైతు కూళీలు పనుల్లో నిమగ్నమయ్యారు. ఆశించిన రీతిలో వర్షాలు కురువటంతో చెరువులు, కుంటలు జలకళలను సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల మరమ్మతుకు చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో చెరువులను అభివృద్ధి చేయగా వాటి విస్తీర్ణం పెరగడంతో వర్షపు నీరు ఎక్కువగా నిల్వ ఉండడంతో బావుల్లో నీరు పుష్కలంగా వచ్చి చేరుతుంది. దీంతో ఖరీఫ్ సీజన్‌లో రెండు పంటలకు ఢోకా లేదంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న రీతిలో వర్షాలు పడటంతో వ్యవయ పంటపొలాల్లో ఎక్కడ చూసినా రైతులు, రైతుకూళీలు పనుల్లో నిమగ్నమై కనిపిస్తున్నారు. ఎకరం నారుకు. రూ.25 వందల నుంచి 3వేల వరకు నారు ఉన్న రైతులు విక్రయిస్తున్నారు. పలు గ్రామాల్లో రైతులకు నారు దొరకక పోవటంతో పోలాలో సిద్దం చేసుకుని నారు కోసం తిరుగుతున్నారు. చెరువుల్లో సైతం పుష్కలంగా నీరు రావటంతో వంద శాతం రైతులు వరినాటు వేయుటకు సిద్ధం అయ్యారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...