తహార్‌పూర్‌లో 200 ఈత చెట్లు కూల్చివేత!


Sun,August 11, 2019 03:46 AM

శాయంపేట, ఆగస్టు 10 : శాయంపేట మండలం తహార్‌పూర్ గ్రామంలో ఓ వ్యక్తి 200 ఈత చెట్లను జేసీబీతో కూల్చివేసిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. అయితే తమకు ఉపాధినిచ్చే ఈత చెట్లను అక్రమంగా తొలగిస్తున్నారని గ్రామ గీత కార్మికులు జేసీబీని అడ్డుకున్నారు. సుమారు 30 మంది గీత కార్మికులు కల్లు మోకులతోనే రాత్రి శాయంపేట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గీత కార్మికులు రాజయ్య, శ్రీకాంత్, రవి, సుధాకర్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ తహార్‌పూర్ గ్రామానికి చెందిన దొంగరి అశోక్ గతంలో ఎలాంటి అనుమతి లేకుండా 200కుపైగా ఈత చెట్లు, 50 తాటిచెట్లు జేసీబీతో కూల్చివేసినట్లు తెలిపారు. మళ్లీ రెండోసారి 60 తాటిచెట్లు కాలబెట్టినట్లు పేర్కొన్నారు. తన భూమిలో ఉన్నాయని కూల్చి వేశాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అప్పట్లోనే పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా తమపైనే కేసులు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం మూడోసారి జేసీబీతో మరో 200కుపైగా ఈత చెట్లను తొలగించారన్నారు. అశోక్‌కు చెందిన భూమితోపాటు రోడ్డుపక్కన, గోగుకుంట మత్తడి పక్కనున్న ఈత చెట్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

చెట్లను తొలగిస్తుంటే అడ్డుకున్నామని, జేసీబీని గ్రామ పంచాయతీ వద్ద పెట్టామని చెప్పారు. దానిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి పెట్టాలని అడిగితే ఇప్పుడేమి చేయలేమని పోలీసులు చెబుతున్నట్లు పేర్కొన్నారు. హరితహారంలో ప్రభుత్వం ఈత చెట్లను పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తుంటే తమకు ఉపాధినిచ్చే ఈత చెట్లను తొలగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తహార్‌పూర్‌లో శనివారం పోలీసులు హరితహారంలోమొక్కలు నాటారని, కానీ ఒకే రోజు అశోక్ 200 చెట్లు తొలగించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని, లేకుంటే ధర్నా కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ విషయమై తహసీల్దార్ మంజులను వివరణ కోరగా సమాచారం తమకు తెలిసిందని, ఈత చెట్లను నరికివేసేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని కేసు నమోదు చేయాలని చెప్పినట్లు తెలిపారు. సొంత భూమి అయినా అనుమతులు లేకుండా ఉపాధినిచ్చే ఈత, తాటి చెట్లను నరికివేయడం చట్టరీత్యా నేరమే అవుతుందని ఆమె పేర్కొన్నారు.

ఈ విషయమై పరకాల ఎక్సైజ్ సీఐ జగన్నాథరావును వివరణ కోరగా తహార్‌పూర్‌లో ఈత చెట్లు తొలగించడానికి అశోక్ అనే వ్యక్తికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. సొంత భూమి అయినా ఏ భూమి అయినా అధికారికంగా అనుమతి లేనిది తీసేయడానికి లేదు. అతని సొంత భూమి అయినా కలెక్టర్ ద్వారా అనుమతి తీసుకోవాలి. గీత కార్మికులపైనే కేసులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయని అడిగితే మొదటి నుంచి వీళ్ల మధ్య గొడవలున్నట్లున్నాయని అన్నారు. అయితే ఈతచెట్లు కూల్చిన విషయాన్ని తనకు కూడాగీత కార్మికులు చెప్పారని, సొసైటీ నుంచి ఒక ఫిర్యాదు ఇవ్వాలని వారికి సూచించినట్లు తెలిపారు. ఫిర్యాదు వచ్చిన తర్వాత విచారణ చేసి నరికింది వాస్తవమైతే అశోక్‌పై కేసు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...