అర్హులందరికీ ఆసరా పింఛన్లు


Tue,July 23, 2019 01:33 AM

ఖానాపురం, జూలై 22: ప్రతి పేదవాడి ముఖంలో ఆనందం వెల్లివిరియాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆసరా లబ్ధిదారులకు రెట్టింపైన ఫించన్ల ప్రొసీడింగ్స్‌ను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ ఫించన్లు పెంచాలని ఎవరూ అడగకపోయినా సీఎం కేసీఆర్ వాటిని రెట్టింపు చేశాడన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పథకంలో పైరవీలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రజలకు అందజేస్తున్నామన్నారు. ఆసరా పింఛన్ల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించినట్లు చెప్పారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి పింఛన్ ఇస్తామన్నారు. ప్రాజెక్టు చివరి దశకు చేరుకుందని మరో రెండు నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. రాబోయే రోజుల్లో ఖానాపురం మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

మహిళలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వైపు దృష్టి సారించాలి
మహిళా సంఘాల సభ్యులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వైపు దృష్టి సారించాలని ఎమ్మెల్యే పెద్ది సూచించారు. మండలకేంద్రంలో జరిగిన చైతన్య మండల సమాఖ్య పదో వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొదుపులతోనే ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మేరకు కుటీర పరిశ్రమల వైపు వారు మొగ్గుచూపాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పోత్సహిస్తోందని, ఈ ప్రాంతంలో పండించిన పంటలను ప్రాసెసింగ్ చేసుకోవడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. మేరకు యూనిట్లకు 35 శాతం సబ్సిడీని అందజేస్తున్నట్లు చెప్పారు. వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చే వార్షిక సమావేశం నాటికి మండలంలో పది వీవో భవనాలను నిర్మిస్తామని తెలిపారు. అనంతరం మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీలను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.

భావితరాలకు పచ్చటి సమాజాన్ని ఇవ్వాలి
భావి తరాలకు పచ్చటి సమాజాన్ని అందించడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రాగంపేటలో మూడు సంవత్సరాల క్రితం హరితహారంలో నాటిన మొక్కలకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్ చేశారు. అలాగే, 5వ విడత హరితహారంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం సర్పంచ్ భాషబోయిన అయిలయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో అడవుల శాతం తగ్గిపోవడంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. హరితహారం భావితరాలకు వారసత్వంగా ఇచ్చేకానుక అన్నారు. మొక్కలను నాటడం ఎంత ముఖ్యమో నాటిన మొక్కలను బతికించుకోవడం అంతకన్న ముఖ్యమన్నారు. చెట్లకు పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. రాగంపేటలో హరితహారంలో నాటిన మొక్కలను బతికించిన ఏపూరి వెంకన్న అభినందనీయుడన్నారు. గ్రామంలో వందశాతం సీసీరోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. మరో మూడు నెలల్లో నర్సంపేట రూపురేఖలు మారుస్తానని చెప్పారు. అనంతరం మండలంలోని దివ్యాంగులకు బస్‌పాస్‌లను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జెడ్పీటీసీ బత్తిని స్వప్న, సర్పంచ్ చిరంజీవి, వైస్ ఎంపీపీ రామసాయం ఉమారాణి, ఎంపీడీవో రవి, తహసీల్దార్ ముంతాజ్, ఎంపీటీసీలు భారతి, కవిత, సుభాన్‌బీ, పూల్‌సింగ్, శంకర్, ఏపీఎం సుధాకర్, సమా ఖ్య అధ్యక్షురాలు లత, రాగంపేట స ర్పంచ్ కాస ప్రవీణ్‌కుమార్, బూస రమ అశోక్, హెచ్‌ఎం భిక్షపతి, రామస్వామినాయక్, పూర్ణచందర్‌రావు, రామకృష్ణ, రాజేశ్వర్‌రావు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...