మహర్దశ


Thu,July 18, 2019 03:51 AM

- మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా నిధులు
- మారిన భౌగోళిక స్థితి
- విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
- మెరుగు పడనున్న రోడ్లు, మౌలిక వసతులు
- పరుగులు పెట్టనున్న పనులు
- ఆనందంలో పట్టణాల ప్రజలు

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వరంగల్ రూరల్ జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధికి నిధుల వరద పారింది. పట్టణాలను సమగ్రంగా అభివృద్ధిపరచడంతోపాటు ప్రభుత్వం మున్సిపల్ విలీన గ్రామాలపై ప్రత్యేకదృష్టి సారించింది. మున్సిపాలిటీలను విస్తరింపజేసింది.ప్రగతికి కేరాఫ్ పట్టణాలుగా తీర్చిదిద్దబోతున్నది. దీనికనుగుణంగా ప్రణాళికలు రూపొందించి యుద్ధప్రాతిపదికన అమలుచేస్తున్నది. వరంగల్ రూరల్ జిల్లాలో పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. పరకాల, నర్సంపేట నగరపంచాయితీల నుంచి మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. వర్ధన్నపేట మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. ఈ మూడు మున్సిపాలిటీలకు సంబంధించి అభివృద్ధి వేగంగా సాగుతుండగా.. మరింత ముమ్మరం చేసి పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ఇటీవల మరిన్ని నిధులను కేటాయించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సహకారం, జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవ, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆరూరి రమేశ్ పట్టుదలతో మున్సిపాలిటీలకు అదనపు నిధులు తెచ్చారు. ఒకేరోజు రూ.82 కోట్ల నిధులను విడుదల చేయించారు. వీటిలో జిల్లాలోని వర్ధన్నపేట మున్సిపాలిటీకి రూ.18.01 కోట్లు, పరకాల మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, అంతకంటే ముందు నర్సంపేట మున్సిపాలిటీకి రూ.14.9 కోట్లు, వర్ధన్నపేటకు రూ.7.65 కోట్లు మంజూరు చేశారు. ఈ మొత్తం నిధులతో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి శంకుస్థాపనలు కూడా చేశారు. ఈ నిధులతో ఈ మూడు మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల విస్తరణ, పార్కులు, మురికి కాల్వల నిర్మాణం, అంతర్గత రహదారుల నిర్మాణం, సెంట్రల్‌లైటింగ్, డివైడర్ల నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి, అవసరమైన చోట మున్సిపల్ కార్యాలయాల భవనాల నిర్మాణాలు, ప్రజల మౌలిక వసతుల కల్పనకు అవసరమైన పనులు చేపట్టేందుకు ఖరు చేస్తారు. దీంతో జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల అభివృద్ధి రూపురేఖలు మారనున్నాయి.

మారిన భౌగోళిక స్వరూపం
పెరిగిన జనాభా, విలీన గ్రామాలతో మున్సిపాలిటీల భౌగోళిక రూపం మారింది. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో చుట్టూ ఉన్న తండాలను, గ్రామపంచాయితీలను కలిపి వర్ధన్నపేట మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. దీంతో మున్సిపాలిటీ విస్తరణ పెరగడంతోపాటు వార్డులసంఖ్య 7 నుంచి 12కు పెరిగింది. పరకాల మున్సిపాలిటీలో సమీప గ్రామాలను కలుపుకుని విస్తరించడంతో 20వరకు ఉన్న వార్డుల సంఖ్య 22కు చేరింది. అదేవిధంగా 20 వార్డులుగా ఉన్న నర్సంపేట మున్సిపాలిటీ 22వార్డులకు చేరింది. దీంతో ఈ మూడు మున్సిపాలిటీల భౌగోళిక స్వరూపం మారింది. పట్టణాలు విస్తరించడంతో అభివృద్ధి ఆవశ్యకత కూడా ఏర్పడింది. వీటిని కూడా అభివృద్ధిపర్చేందుకు ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. పెరిగిన వార్డులు, మారిన భౌగోళిక స్థితికి అనుగుణంగా జిల్లాలోని మున్సిపాలిటీలు కొత్త రూపును సంతరించుకున్నాయి.

విలీన గ్రామాల అభివృద్ధి
జిల్లాలోని వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీలలో విలీన గ్రామాలు ఉన్నాయి. చిన్నచిన్న గ్రామపంచాయతీలుగా ఉన్న ఈ విలీన గ్రామాలలో అభివృద్ధి అంతంతమాత్రంగానే జరిగింది. మున్సిపల్ చట్టాలకు అనుగుణంగా అభివృద్ధి నిధులు మంజూరుకావడంతో విలీన గ్రామాల స్వరూ పం మారబోతున్నది. దానికి అనుగుణంగా అభివృద్ధిపనులు జరుగతున్నాయి. ఇప్పటికే విలీనగ్రామాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చోటుచేసుకున్నాయి. వర్ధన్నపేట లాంటి మున్సిపాలిటీ కేంద్రంలో రోడ్ల విస్తరణతోపాటు ఖమ్మం హైవేపై ఉన్న ఈ వర్ధన్నపేటను అభివృద్ధికి సూచికగా నిలిపేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. విలీన గ్రామాల అభివృద్ధి శరవేగంగా సాగుతున్నది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


నర్సంపేటలో 48 పోలింగ్ కేంద్రాలు : కమిషనర్
నర్సంపేట, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో పలు పనులను పూర్తి చేసినట్లు కమిషన్ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం వివరాలను వెల్లడించారు. షెడ్యూల్ తరగతులు ఎసీ, ఎస్టీ, బీసీ, పురుష, మహిళా ఓటర్ల గుర్తింపులను ఒకటో వార్డు నుంచి 24 వ వార్డు వరకు పూర్తి చేసి నోటీసు బోర్డుపై ఉంచామని అన్నారు. పోలింగ్ స్టేషన్లను కూడా గుర్తించి పబ్లికేషన్ చేశామని చెప్పారు. బ్యాలెట్ బాక్స్‌లు, పేపర్ల ద్వారా ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించారని అన్నారు. మొత్తం 24 వార్డులకు 48 పోలింగ్ స్టేషన్లలో 96 పోలింగ్ బాక్స్‌లు, 10 శాతం అదనంగా పది బాక్స్‌లు కలిసి మొత్తం 106 బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో సుమారుగా 650 ఓట్లు మొత్తం 48 పోలింగ్ స్టేషన్‌లలో 27,195 ఓటర్లు ఓట్లు వేసేందుకు ఏర్పాట్లు చేశామని తెపారు. ప్రతీ మూడు వార్డులకు ఎన్నికల అధికారుల, అసిస్టెంట్ అధికారులను చొప్పున మొత్తం ఎనిమిది మంది ఎన్నికల అధికారులు, ఎనిమిది మంది అసిస్టెంట్ అధికారులను నియమించామని వివరించారు. వీరు నామినేషన్లు, విత్‌డ్రాలు, పబ్లికేషన్స్, అలాట్‌మెంట్ సింబల్స్, ఫొటో ఓటర్లు స్లిప్పుల పంపిణీ, కౌంటింగ్, ఫలితాల ప్రకటన మొదలగు పనులను నిర్వహిస్తారని తెలిపారు. ప్రతీ ఐదు వార్డులకు ఒక జోనల్ అఫీసర్స్ చొప్పున ఐదుగురిని నియమించినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తిరుగుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు పరిచేలా చూస్తారని తెలిపారు. వీరికి తోడుగా ఫ్లయింగ్‌స్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. 48 పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ అధికారి, అసిస్టెంట్ పోలింగ్ అధికారి, పోలింగ్ సిబ్బంది ఉండే విధంగా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల పర్యవేక్షణకు ఒక జనరల్ అబ్జర్వర్, ఒక ఖర్చుల వివరాల అబ్జర్వర్‌ను ఏర్పాటు నియమించామని వెల్లడించారు. పోలింగ్ అధికారులకు ఈనెల 18న ఉదయం, అసిస్టెంట్స్ ఎన్నికల అధికారులు,సిబ్బందికి మధ్యాహ్నం ఎన్నికల విధులకు సంబంధించి శిక్షణను ఇస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలో అభ్యర్థి రోజువారీ ఖర్చులు పరిశీలించడానికి ఒక అధికారిని ఏర్పాటు చేశామని వివరించారు.

పార్టీల ప్రతినిధులతో సమావేశం
నర్సంపేట మున్సిపాలిటీలో వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. దీనిలో పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ పార్టీలు ఎన్నికల నిర్వహణకు సహకరించాలని కోరారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వార్డుల వారీగా ఓటర్లు విభజనలు, ఓటర్లు, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మేల్,ఫిమేల్ ఓటర్లు గుర్తింపు జరిగిందని అన్నారు. ఈ ఓటర్ల జాబితాలను కూడా నోటీసు బోర్డులపై ప్రదర్శించామని అన్నారు. అయితే పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తింపు పూర్తి అయిందని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలను కూడా ఇప్పటికే ప్రకటించామని ఆయన వివరించారు. సమావేశంలో పార్టీల ప్రతినిధులు నాయిని నర్సయ్య, పాలాయి శ్రీనివాస్, అక్కపెల్లి రమేశ్, పెద్దారపు రమేష్, షేక్‌జావిద్ పాల్గొన్నారు.

ఎన్నికల అధికారులకు మొదటి విడత శిక్షణ
పరకాల : మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు మొదటి విడత శిక్షణను బుధవారం పరకాలలో నిర్వహించారు. ఎలక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లు, ఆర్గనైజర్లకు శిక్షణ నిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి నామినేషన్ల స్వీకరణ, స్క్రూట్నీ, ఉపసంహరణలు, గుర్తుల కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్, కౌంటింగ్, ఎన్నికైన అభ్యర్థికి సర్టిఫికెట్ జారీ వరకు చేయాల్సిన పనులను గురించి వారికి కమిషనర్ శ్రీనివాస్ అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఈసారి కొత్తగా టీపోల్ నుంచి పోటీలో ఆసక్తి చూపే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఆన్‌లైన్ పత్రాలతోపాటు అభ్యర్థి సమర్పించాల్సిన ఒరిజినల్ సెట్‌ను తప్పనిసరిగా కార్యాలయంలో కేటాయించిన కౌంటర్లలో అందించాలని చెప్పారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు నవీన్, రాజు, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...