ఆధార్‌తో డబ్బులు స్వాహా చేసిన యువకుడి అరెస్ట్


Tue,July 16, 2019 05:06 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ జూలై 15 : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో ఇటీవల ఆధార్ కార్డు నంబర్లతో బ్యాంకు ద్వారా డబ్బులు డ్రాచేసిన ఆన్‌లైన్ హ్యాకర్ ఆల్వాల వినయ్‌కుమార్‌ను అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెంకటేశ్వరబాబు తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో నిందితుడి వివరాలు సోమవారం ఏసీపీ వెల్లడించారు. వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన ఆల్వాల వినయ్‌కుమార్ బీటెక్ ఫెయిల్ అయ్యాడు. సీతారాంపురం గ్రామానికి చెందిన ఓ యువతిని చిల్పూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తిరిగి వినయ్‌కుమార్ ఇంటికి వెళ్లకుండా చిన్నపెండ్యాలలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం కోసం వెతుకుతూ ప్రధాన మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ (పీఎమ్‌జీడీఐఎస్)లో భాగంగా నెక్కొండ మండలంలోని గ్రామాల ప్రజలకు కంప్యూటర్‌పై అవగాహన, శిక్షణ ఇప్పించేందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ తర్వాత జిల్లా కోఆర్డినేటర్ ద్వారా ఉద్యోగంలో చేరాడు. ఇందులో భాగంగానే రెండు నెలల క్రితం వరకు చిల్పూరు మండలంలోని నష్కల్ గ్రామంలో పనిచేశాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ను ఉపయోగించి మోసం చేయాలనే ఆలోచనతో అందరి ఆధార్ కార్డుల్లో వివరాలు మార్పిడి చేస్తామని ప్రజలను నమ్మించాడు. ముందుగా నమిలిగొండ గ్రామ సర్పంచ్‌ను కలిసి గ్రామస్తులకు చెప్పి వారిని నమ్మించాడు. ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ల్యాప్‌టాప్‌లో బయోమెట్రిక్ ద్వారా ప్రజల ఆధార్ కార్డుల వివరాలు, వేలి ముద్రలు తీసుకున్నాడు. ఆన్‌లైన్‌లో డీజీపే యాప్ ద్వారా ఒక్కొక్కరి అకౌంట్ నుంచి రూ. 600 చొప్పున వారికి తెలియకుండా మొత్తం రూ. 2, 59, 500 కామన్ సర్వీస్ సెంటర్ నుంచి తన అకౌంట్‌లోకి మార్చుకున్నట్లు ఆయన తెలిపారు. తర్వాత డబ్బులు కట్ అయిన విషయం గ్రామస్తుల సెల్‌ఫోన్లకు మెస్సేజ్‌లు వచ్చాయి. మెస్సేజ్‌లను చూసి ప్రజలు సర్పంచ్‌ని సంప్రదించారని, దీంతో సర్పంచ్ నిందితుడికి ఫోన్ చేసి వివరాలు అడుగగా 9వ తేదీన వస్తానని చెప్పాడు. వినయ్‌కుమార్ రాకపోడంతో అసలు విషయం బయటపడింది. దీంతో సర్పంచ్ సహా గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. నిందితుడు వినయ్‌కుమార్‌ను సోమవారం ఉదయం 6 గంటలకు పట్టుకుని విచారణ చేయగా నేరాలను ఒప్పుకున్నాడని ఆయన తెలిపారు. వినయ్‌కుమార్ ఆన్‌లైన్‌లో దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. కేసును ఛేదించిన ఎస్సై రవి, కానిస్టేబుల్ అనిల్, నవీన్‌ను వరంగల్ సీపీ విశ్వనాథ రవీందర్, డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ వెంకటేశ్వరబాబు అభినందించారు. సమావేశంలో సీఐ రాజిరెడ్డి, ఎస్సై రవి, కానిస్టేబుల్ కుమార్, నవీన్, అనిల్ పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...