జల వనరులను సంరక్షించాలి


Sat,July 13, 2019 01:51 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ : జలవనరులను సంరక్షించాలని కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ పీకే స్వెయిన్ అన్నారు. శుక్రవారం నల్లబెల్లి మండలంలోని గోవిందాపురం, లైన్‌తండా, మేడపెల్లి,రాంపూర్ గ్రామాలను సందర్శించిన ఆయన ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో భూగర్భజలాల రక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. వర్షపు నీటిని వృథా చేయకుండా భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని సూచించారు. దీనివల్ల భూ గర్భజల మట్టాలు పెరుగుతాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలన్నారు. వర్షపునీటిని కాపాడుకునేందుకు ఫాంపాండ్స్ లాంటివి నిర్మించుకోవాలని కోరారు. దీనివల్ల వేసవిలో నీరు అందుబాటులో ఉండడమే కాకుండా నీరు భూమిలోకి ఇంకుతుందని తెలిపారు. పంటలకు డ్రిప్ యంత్రాలతో నీటిని అందిస్తే ఉపయోగం ఉంటుందని అన్నారు భూగర్భజలాల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను ప్రజలందరికి వివరించాలని ఆయన కోరారు.

గోవిందాపురం నుంచి రాంపూర్ వరకు
కేంద్ర అధికారుల బృందం నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలంలోని గోవిందాపురం బృందం చేరుకున్నారు. అక్కడ రైతులు పెంచుతున్న నర్సరీలను పరిశీలించి వారితో మాట్లాడారు. మంచి ఫలితాలు రావడంతో తిరిగి ఈ సారి నర్సరీలో మూడు ఎకరాలు టేకును పెంచడానికి ముందుకు వచ్చినట్లు రైతులు తెలిపారు. వాటికి నీటిని అందించేందుకు డ్రిప్ యంత్రాలను ఉపయోగిస్తున్నామనితెలిపారు. అనంతరం రంగయ్య చెరువుకు దగ్గరకు వెళ్లారు. రంగయ్య చెరువును పరిశీలించారు. ఈ చెరువులోకి నీరు ఎలా చేరుతుందో అడిగి తెలుసుకున్నారు. ఈ చెరువులోకి గోదావరి నీటిని మళ్లీంచేందుకు రిజర్వాయర్ నిర్మాణం చేశామని తెలిపారు. దీనివల్ల గోదావరి నీటిని నింపి పంటల సాగుకు అందుబాటులో తెచ్చే విధంగా చేస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి ఆశ్రవెళ్లి లైన్‌తండాకు వెళ్లారు. అక్కడ రైతులు 54 ఫాంపాండ్‌ల నిర్మాణం చేశారు. వర్షపు నీరు ఇందులో ఇంకడం వల్ల భూగర్భ జలాలు వస్తున్నాయని తెలిపారు. వర్షాలు లేనప్పుడు, పంటలు ఎండుతున్న దశలో ఈ నీరు ఉపయోగపడుతుందని తెలిపారు. అక్కడి నుంచి మేడపల్లి పీహెచ్‌సీకి చేరుకుని మొక్కలు నాటారు. రాంపూర్‌లో ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రతినిధులు పాల్గొని పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరక్టర్లు ప్రాంక్లీన్, సాయిసుదర్శన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, ఫారెస్టు అధికారి పురుషోత్తం,ఆర్డీవో ఎన్ రవి, ఈటీజీఎస్, ఐబీ అధికారులు, జెడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నసుదర్శన్‌రెడ్డి, ఎంపీపీ సునీత, వైఎస్‌ఎంపీపీ శ్రీలత, సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి సరేశ్ ,తిరుపతి, రాజు,తిరుపతి పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...