కన్నెపల్లి, మేడిగడ్డ వద్ద చురుగ్గా పనులు


Thu,June 20, 2019 03:29 AM

కాళేశ్వరం/ మహదేవపూర్, జూన్ 19: మరో 24 గంటల్లో కన్నెపల్లి వద్ద అద్భుత ఘట్టం ఆవిష్కరించబోతున్నది. పంప్‌హౌస్ పనులను అపరభగీరథుడు సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. పంప్‌హౌస్ కోసం భూ సేకరణకు స్వచ్ఛందంగా సహకరించి, భూమి ఇచ్చిన కన్నెపల్లి గ్రామంలోని 800 మందికి తెలంగాణ ప్రభుత్వం అధికారిక విందు ఇవ్వబోతున్నది. భూములను త్యాగం చేసిన గ్రామస్తులను ప్రభుత్వం అధికారికంగా గౌరవించబోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద శుక్రవారం హోమం నిర్వహించి, ప్రారంభించనున్నారు. దీనికి మరో ఇరవై నాలుగు గంటలే గడువు ఉండటంతో అధికార యంత్రాంగం శాఖల వారీగా ఏర్పాట్లలో నిమగ్నమైంది. సీఎం కేసీఆర్‌తో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వస్తుండడం, రాష్ట్రం, ఇతర రాష్ర్టాలకు చెందిన ప్రముఖులు రానుండడంతో కన్నెపల్లి గ్రామస్తుల్లో అంతుపట్టని ఆనందం ఆవిష్కృతమవుతోంది. ఇక్కడ ప్రముఖుల కోసం 9 హెలీప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు.

యాగశాల పనులు పూర్తయ్యాయి. ప్రముఖుల విడిది కోసం హైదరాబాద్ నుంచి 6 క్యాంపర్ బస్సులు కన్నెపల్లికి చేరుకున్నాయి. ఒక్కో బస్సుకు రోజుకు రూ.లక్ష చొప్పున అద్దె చెల్లించనుండగా, బస్సులోనే విడిది చేయడానికి సకల సదుపాయాలు ఉంటాయి. పంప్‌హౌస్ నుంచి డెలివరీ సిస్టర్న్ వరకు అతిథులు, ప్రముఖులు వెళ్లేందుకు ప్రత్యేక వాహనాలను సమకూర్చారు. పంప్‌హౌస్ నిర్మాణం కోసం అడగగానే భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన సుమారు 800 మంది గ్రామస్తులను గుర్తించిన ప్రభుత్వం.. వారిని గౌరవించేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ 800 మందికి ప్రత్యేకంగా విందు భోజనం ఏర్పాటు చేయనుంది. దీనికి గానూ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వంట నిపుణులు కాళేశ్వరానికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి కన్నెపల్లి పంప్‌హౌస్‌లో అధికారులు ఆరో నెంబర్ మోటార్ పంప్‌ను ప్రారంభించి, పనితీరును పరిశీలించారు. రెండు నిమిషాల పాటు గ్రావిటీ కెనాల్‌లో ఈ మోటార్ ద్వారా నీటిని పంపింగ్ చేసి చూశారు.

కాళేశ్వరానికి 4వేల మంది పోలీసులు
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో కాళేశ్వరానికి బుధవారం రాత్రి వరకు 4వేల మంది పోలీసులు చేరుకున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు అతిథులుగా ఆహ్వానించిన క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలను ముమ్మరం చేశారు. ఈ మేరకు వారు పంప్‌హౌస్ పరిసర ప్రాంతాలను బుధవారం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి, డ్రోన్ కెమెరాల సాయంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతా లు, సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మేడిగడ్డ నుంచి కన్నెపల్లి వరకు 4వేల మంది పోలీసులకు బందోబస్తు విధులు అప్పగించారు. దీంతో కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు.

కన్నెపల్లికి కళ మేడిగడ్డలో నేటి సాయంత్రానికి పనులు పూర్తి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాత్రింబవళ్లు తేడా లేకుండా అధికారులు ఏర్పాట్లల్లో లీనమయ్యారు. 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ తేదీని ఖరారు చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నాలుగు రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో ముందుగా మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభిస్తున్నందున అధికారులు బ్యారేజీ వద్ద ఏర్పాట్లలో తేడా రాకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభానికి ముందు బ్యారేజీ ఆవరణలో మహాచండిహోమం చేపడుతున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులు రెండురోజులుగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. మహాచండీ హోమాన్ని 100 మంది వీక్షించడానికి వీలుగా భారీ షెడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. బ్యారేజీ ఆవరణలోని హెలీప్యాడ్ స్థలం నుంచి మేడిగడ్డ వద్ద వ్యూ పాయింట్ వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి కావొచ్చింది. వ్యూపాయింట్ ఆవరణలో పైలాన్ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ గేట్ల ఎత్తనున్న నేపథ్యంలో గేట్లను పూలతో అలంకరిస్తున్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...