కుశ్వంత్‌ను ఆదర్శంగా తీసుకోవాలి


Tue,June 18, 2019 02:42 AM

-విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
-మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది
-ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ గండ్ర జ్యోతి
-నీట్ ర్యాంకర్‌కు రూ. లక్ష ఆర్థ్ధిక సాయం
భూపాలపల్లి టౌన్: నిరుపేద కుటుంబంలో పుట్టి పట్టుదలతో చదివి నీట్, ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన కుశ్వంత్‌ను విద్యార్థులంతా ఆదర్శంగా తీసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి పేర్కొన్నారు. సోమవారం వారు భూపాలపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుశ్వంత్‌తో పాటు అతని తల్లికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర దంపతులు మాట్లాడుతూ కడు నిరుపేద కుటుంబంలో పుట్టిన కుశ్వంత్ కు తండ్రి లేకున్నా తల్లి కుట్టుమిషన్‌తో సంపాదించి చదివించిందని , తల్లి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నీట్‌లో ర్యాంకు సాధించి ఎయిమ్స్‌లో సీటు సాధించడం గొప్ప విషయమన్నారు. జీఎంఆర్ ట్రస్టు ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామని, మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ మళ్లీ కార్యక్రమాలు కొనసాగిస్తున్నమని చెప్పారు.

కుశ్వంత్ విషయం తెలుసుకుని పిలిపించి మాట్లాడామని, అతని కుటుంబం చాలా నిరుపేద కుటుంబమని అర్థ్ధమైందని, అందుకే కుశ్వంత్ వైద్యవృత్తి పూర్తయ్యే వరకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రూ. లక్ష ఆర్థ్ధిక సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు. మరో నాలుగేళ్ల వరకు తమ సహకారం అందిస్తామని వెల్లడించారు. ఏసీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో చదివించినా ర్యాంక్‌లు సాధించని ఈ రోజుల్లో నిరుపేద కుటుంబంలో పుట్టి ఎలాంటి సదుపాయాలు లేకున్నా ఇంత మంచి ర్యాంకు సాధించడం మామూలు విషయం కాదన్నారు. అలాగే ఏడు మండలాల్లో ఎస్‌ఎస్‌సీలో టాపర్స్‌ను ముగ్గురిని ఎంపిక చేసి ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా కుశ్వంత్ మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యే సహకారం మరువలేనిదని, వైద్యునిగా పేద ప్రజలకు సేవలందిస్తానని, నాలాంటి వారందరికీ చేయూతనిస్తానని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అర్భన్ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, నాయకులు గండ్ర హరీశ్‌రెడ్డి, మందల విద్యాసాగర్‌రెడ్డి, చల్లూరి సమ్మయ్య, మేకల సంపత్‌యాదవ్, బుర్ర రమేశ్, తాటి అశోక్, గోనె భాస్కర్, బ్రహ్మారెడ్డి, మురళి, దార పూలమ్మ, వజ్రమణి, తిరుపతమ్మ, వాసాల స్వప్న తదితరులు పాల్గొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...