పంపిణీకి సిద్ధ్దంగా ఏకరూప దుస్తులు


Mon,June 17, 2019 03:34 AM

వర్ధన్నపేట, నమస్తే తెలగాణ, జూన్ 16 : పేద విద్యార్థుల కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రతీ ఏటా ఉచితంగా అందిస్తున్న ఏకరూప దుస్తులను పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు బడిబాట పడుతున్నారు. గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల సంఖ్య ఆధారంగా జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన యూనిఫాం క్లాత్‌ను సరఫరా చేసింది. దీంతో మండలాల విద్యాశాఖ అధికారులు గ్రామాల వారీగా దర్జీల వద్ద విద్యార్థుల కొలతల ఆధారంగా యూనిఫామ్‌లను కుట్టిస్తున్నారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో దుస్తులను కుట్టించిన తరువాత పాఠశాలల వారిగా పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సరిపడేలా గత మే నెలలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ, జౌళిశాఖల అధికారులు సమన్వయంతో 1.30 కోట్ల మీటర్ల యూనిఫామ్ క్లాత్‌ను కొనుగోలు చేశారు. జిల్లాల వారిగా క్లాత్‌ను సరఫరా చేయడంతో డీఈవోల ఆధ్వర్యంలో ఏకరూప దుస్తులను ఎంఈవోలు తయారు చేయిస్తున్నారు. వారం రోజుల్లో యూనిఫామ్‌లను కుట్టించి విద్యార్థులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో 694 ప్రభుత్వ పాఠశాలలు
రూరల్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 694 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 456 ప్రాథమిక పాఠశాలలు, 77 ప్రాథమికోన్నత, 133 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అలాగే 12 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, 6 మోడల్ స్కూల్‌లు, 8 సోషల్ వెల్ఫేర్, 2 గిరిజన గుకుల పాఠశాలలు ఉండగా ఒకటి అర్బన్, మరోటి మైనర్టీ గురుకుల పాఠశాలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో గత ఏడాది చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటుగా ఉచితంగా రెండు జతల దుస్తులను పంపిణీ చేసింది. ఈ విద్యాసంవత్సరంలో కూడా ఒక్కో విద్యార్థిని, విద్యార్థికి రెండు జతల చొప్పున దస్తులను పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన అధికారులు వారం రోజుల్లో ప్రతీ విద్యార్థికి రెండు జతల ఏకరూప దుస్తులను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 42,322 మంది విద్యార్థులకు యూనిఫామ్‌లను అందించారు. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో 15,872 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 4,422, ఉన్నత పాఠశాలల్లో 22,028 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో కేవలం 8వ తరగతి వరకు మాత్రమే యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. కానీ ఈ విద్యాసంవత్సరంలో 9, 10వ తరగతి విద్యార్థులకు కూడా యూనిఫామ్‌లను పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఒక్కో జతకు రూ.50ల కుట్టుకూలీ
విద్యార్థులకు దుస్తులను కుట్టేందుకు దర్జీలకు ప్రభుత్వం ఒక్కో జతకు రూ.50లు చెల్లించనున్నది. గతేడాది రూ.40లు మాత్రమే చెల్లించడం వల్ల గిట్టుబాటు కావడంలేదని దర్జీలు ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం రూ.10 కలిపి మొత్తంగా ఒక్కో జతకు రూ.50ల చొప్పున రెండు జతలకు రూ.100 చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. దీంతో దర్జీలు పాఠశాలల వారిగా ఒప్పందం ప్రకారం ప్రతీ విద్యార్థికి రెండు జతలు అందించేలా విద్యార్థుల కొలతలు తీసుకొని యూనిఫామ్‌లు సిద్ధ్దం చేస్తున్నారు. పేద కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, దుస్తులను ప్రభుత్వం అందిస్తుండడంతో తల్లిదండ్రులకు ఎంతో సహకారం అందుతున్నది. ప్రైవేటు పాఠశాలలకు పంపించినట్లయితే పుస్తకాలు, యూనిఫామ్, ఇతర వస్తువులకు పాఠశాల ఫీజు కాకుండానే సుమారు రూ.6వేల వరకు ఖర్చు అవుతుంది. అలాగే ఏడాదికి పాఠశాల ఫీజు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఖర్చు అవుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటుగా ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు అందుతుండడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో 42,322 మంది విద్యార్థులకు యూనిఫామ్‌లు అందించిన జిల్లా విద్యాశాఖ ఈ సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరగనున్నందున సుమారు 46 వేల మంది విద్యార్థులకుదుస్తులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

దర్జీలకు లభిస్తున్న ఉపాధి
పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లు కుడుతున్న దర్జీలకు ఉపాధి లభిస్తున్నది. ప్రభుత్వం ఒక్కో జతకు రూ.50ల చొప్పున చెల్లిస్తుండడంతో పాఠశాలల వారిగా దర్జీలు ఎంఈవోలతో మాట్లాడి యూనిఫామ్‌లు కుట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కో దర్జీ గ్రామాల్లో ఇండ్లలో దస్తులు కుట్టే మహిళలు, ఇతర దర్జీలకు వచ్చి యూనిఫామ్‌లు కుట్టిస్తున్నారు. ఒక్కో పాఠశాలలో 400ల నుంచి వెయి వరకు విద్యార్థులు ఉన్నారు. ఇన్ని యూనిఫామ్‌లు ఒక్కరే కుట్టడం వీలుకాదుకాబట్టి తనతోటి వారికి సైజుల ఆధారంగా కత్తిరించి మెటీరియల్‌తో అందజేస్తున్నారు. దీంతో మహిళలు వారి ఇండ్లలోనే డ్రెస్‌లను కుట్టి తిరిగి గుత్తేదారుకు అందివ్వడంతో వారు అనుకున్న సమయానికి మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు అందజేస్తున్నారు. దీనివల్ల చేనేత కార్మికులకు, పేద దర్జీలకు ఉపాధి మెరుగవుతున్నది.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...