ఉద్యమానికి ఊపిర్లూదింది..ఓరుగల్లే


Mon,June 17, 2019 03:32 AM

సిద్ధార్థనగర్, జూన్16: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది వరంగల్ జిల్లానే అని, ఓరుగల్లు అంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ఎంతో ఇష్టమని ప్రొహిబిషన్, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం నక్కలగుట్టలోని హరిత హోటల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారుల, ఉద్యోగుల, పెన్షనర్ల ఆత్మీయ సమావేశాన్ని టీఎన్జీవో ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ ఎనమనేని జగన్మోహన్‌రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ముందుగా మొదటిసారిగా వరంగల్ జిల్లాకు వచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గజమాల, శాలువా కప్పి సన్మానించారు. మంత్రి ఎర్రబెల్లి ఉద్యోగులకు అభినందనలు తెలిపి, తన సంపూర్ణ మద్దతు, సహాయసహకారాలు అందిస్తానన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. పోరుగల్లు.. వరంగల్ అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ఇష్టమని, గ్రేటర్ హైదరాబాద్ తర్వాత అభివృద్ధిలో వరంగల్ జిల్లానే ఎంచుకుని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వరంగల్ జిల్లా అంటే ప్రత్యేకమన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ, పట్టణాలు అనే తేడా లేకుండా అభివృద్ధి జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తుందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. ఆడబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులకు, వితంతులకు ఆసరాగా నిలిచారన్నారు. తెలంగాణలో కరెంట్ కష్టాలు లేవని ఇదంతా సీఎం కేసీఆర్ ఘనతేనని కొనియాడారు. ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉందని, ఆ ప్రాజెక్టు కోసం కేసీఆర్ నిద్రాహారాలు మాని ప్రాజెక్టుపైనే దృష్టి సారించి నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తి చేశారని అన్నారు. ఎమ్మెల్యేలు ఎల్లప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు శుభాకాంక్షలు
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ కోల రాజేశ్‌కుమార్‌గౌడ్, ట్రెసా ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ రాజ్‌కుమార్, టీజీవో జనగాం అధ్యక్షుడు అంజద్ అలీ, రత్నవీరాచారి, పుల్లూరు వేణుగోపాల్, ఆకుల రాజేందర్, ఈగ వెంకటేశ్వర్లు, రాంకిషన్, శ్యాంసుందర్, రామునాయక్, ఆకుల మాధవి, కిరణ్మయి, విజయలక్ష్మి, మంజుల, సుమలత, మాధవరెడ్డి, కిరణ్‌రెడ్డి, రఘుపతి, కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...