జ్యోతిబాపూలే గురుకుల కాలేజీ తరలింపు.!


Sat,June 15, 2019 02:40 AM

హన్మకొండ రెడ్డిపురంలో తరగతులు
శాయంపేట, జూన్ 14 : శాయంపేట మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల జూనియర్ కాలేజీ హన్మకొండకు తరలిపోయింది. ఈ మేరకు హన్మకొండలోని రెడ్డిపురంలో కళాశాల తరగతులు షురూ అయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. శాయంపేటలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల మూడేళ్ల క్రితం జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేశారు. విద్యార్థులకు చక్కని బోధన, ప్రతిభతో రాష్ట్రస్థాయిలో శాయంపేట గురుకులం ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ప్రశంసలు పొందింది. పేద, మధ్యతరగతి విద్యార్థులు శాయంపేట గురుకులంలో చదివేందుకు ఎంతో ఆసక్తిని కనబర్చేవారు. అయితే వసతి సౌకర్యం లేకపోవడంతో శాయంపేట గురుకులం నుంచి కాలేజీ తరగతులను రెడ్డిపురానికి గురువారం తరలించారు. సుమారు 18 ఏళ్ల క్రితం శాయంపేటలో జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకులాన్ని ప్రారంభించారు. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 450మంది విద్యార్థులకు పైగా బోధన, వసతి కల్పించారు. ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో నిలిచారు. కొన్నేండ్లపాటు శాయంపేట గురుకులంలోనే మొగుళ్లపల్లి గురుకులాన్ని కొనసాగించారు.

ఇలా సుమారు 650 మంది విద్యార్థుల వరకు విద్యనభ్యసించారు. అనంతరం పరిస్థితుల వల్ల మొగుళ్లపల్లి గురుకులాన్ని మల్లంపల్లికి మార్చి అక్కడ ప్రారంభించారు. దీంతో శాయంపేట గురుకులంలో సమస్యలు తీరిపోయినట్లు చెబుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మూడేండ్ల కిత్రం పదో తరగతి వరకు ఉన్న గురుకులంలో ఇంటర్ పెంచి అప్‌గ్రేడ్ చేసింది. దీంతో సైన్స్, ఆర్ట్స్ గ్రూపులలో ఇంటర్ తరగతులను ప్రారంభించారు. ఇందుకు తగ్గట్టుగా అధ్యాపకులను ప్రభుత్వం నియమించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులను శాయంపేట గురుకులంలో కాకుండా రెడ్డిపురం గురుకులానికి తరలించి తరగతులను ప్రారంభించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వెబ్‌కౌన్సిలింగ్ పూర్తయింది. అయితే ఉన్నట్టుండి శాయంపేట జూనియర్‌కాలేజీని తరలించడంతో తల్లిదండ్రులు అవాక్కవుతున్నారు. విద్యార్థులకు సరిపడా గదులు లేక, వసతులు లేకపోవడంతోనే జూనియర్ కాలేజీని ఇక్కడి నుంచి తరలించినట్లు చెబుతున్నారు. అయితే గతంలో జూనియర్ కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగినట్లు తెలుస్తున్నది.

ఇంటర్ విద్యార్థుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఘర్షణలకు తావిచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గత పరీక్షల ముందు విద్యార్థులు ఉన్నపలంగా గురుకులాన్ని వదిలి వెళ్లినట్లు చెబుతున్నారు. ఇక్కడ ఘర్షణ వాతావరణం ఉండటంతో సమస్య జఠిలంగా మారినట్లు తెలుస్తోంది. కాలేజీలో వసతులు లేకనా, లేక విద్యార్థుల మధ్య మనస్పర్ధలు, గొడవల వల్లనా కాలేజీని తరలించారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో పేరు, ప్రతిష్టలు మూటగట్టుకున్న శాయంపేట జ్యోతిబాపూలే గురుకులం జూనియర్‌కాలేజీగా అప్‌గ్రేడ్ కావడంతో ప్రజలు హర్షించారు. ఎంతో మందికి ఉన్నత స్థానం కల్పిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఉన్నట్టుండి కాలేజీని తరలించడం సరికాదని పేర్కొంటున్నారు.

జూనియర్ కాలేజీని తరలించాం
సరైన వసతులు లేకపోవడంతో శాయంపేట జ్యోతిబాపూలే గురుకుల జూనియర్ కాలేజీని హన్మకొండ రెడ్డిపురానికి షిఫ్ట్ చేశాము. ఇక్కడున్న గురుకుల పాఠశాలను వేరేచోటుకు మార్చడంతో ఇందుకులోకి కాలేజీని మార్చాము. అయినా శాయంపేట లోకేషన్‌లోనే కాలేజీ నడుస్తుంది. అయినా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనే కొనసాగుతుంది. శాయంపేట గురుకులంలో పాఠశాల విద్యార్థులు, కాలేజీ విద్యార్థులంతా కలిసి 700లకుపైగా ఉన్నారు. అందువల్ల అందరికీ వసతికి ఇబ్బంది అవుతోంది. దీనికి సంబంధించి ఆందోళనలు జరిగాయి. విద్యార్థుల మధ్య జరిగిన గొడవల వల్ల తరలించలేదు. వసతుల కోసం విద్యార్థులు ధర్నాలు చేశారు. కాలేజీ తరలింపుతో ఇబ్బందేమి లేదు.
- మనోహర్‌రెడ్డి, ప్రిన్సిపాల్

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...