బడికి వేళాయె..


Wed,June 12, 2019 02:25 AM

-నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
-ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగవుతున్న వసతులు
-బడి బాటకు సిద్ధ్దమవుతున్న అధికారులు
నర్సంపేట రూరల్, జూన్ 11 : వేసవి సెలవుల్లో ఆట పాటలతో సరదాగా గడిపిన పిల్లలు ఇక పుస్తకాలతో కుస్తీ పట్టనున్నారు. సెలవులు ముగిసి 60 రోజులు ఆటాపాటలతో గడిపిన పిల్లలు మళ్లీ బ్యాగులు భుజాల మీద వేసుకొని పాఠశాల బాట పట్టనున్నారు. వేసవి సెలవులతో బోసిపోయిన విద్యాలయాలు విద్యార్థులతో సందడిగా మారనున్నాయి. బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రెండు నెలల పాటు వచ్చిన సెలవులతో విద్యార్థులు ఎంతో ఆనందంగా గడిపారు. తిరిగి పాఠశాలలకు వెళ్లడానికి సిద్ధ్దమవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల సందడి ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. ప్రభుత్వం భారీగా గురుకులాలు ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ గురుకులాల్లో మరింత మంది విద్యార్థులను చేర్చుకునేందుకు ఉపాధ్యాయులు సిద్ధ్దమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ విద్యను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఇందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ్ద పెట్టింది. పక్కాగా పాఠశాలలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందజేశారు. జిల్లాలో జూన్ 01 నుంచే కొత్త విద్యాసంవత్సరం మొదలు కావాల్సి ఉండగా మండుతున్న ఎండల దృష్ట్యా వేసవి సెలవులను మరో 12రోజులు పొడిగించారు. దీంతో బుధవారం యథావిధిగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కొనసాగనున్నాయి. ఈమేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఘనస్వాగతం పలికేందుకు పాఠశాలలను సిద్ధ్దం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే తమ ప్రచార కార్యక్రమాలను పతాక స్థాయికి తీసుకెవెళ్లగా ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ఈనెల 14నుంచి బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. బడి గంట కోసం అటు పిల్లలు, ఇటు తల్లిదండ్రులు అన్నీ సిద్ధ్దం చేసుకుంటున్నారు. పిల్లలకు పుస్తకాలు, బ్యాగులు, ఇతరత్ర సామగ్రి కొని ఇచ్చేందుకు తల్లిదండ్రులు సిద్ధ్దమయ్యారు. బుక్స్, జనరల్ స్టోర్ షాపులు కిటకిటలాడిపోతున్నాయి. బుక్ స్టాల్స్ విద్యార్థుల తల్లిదండ్రులతో సందడిగా మారాయి.

జిల్లాలో 696 పాఠశాలలు
రూరల్ జిల్లాలో 696 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 456 ప్రాథమిక పాఠశాలలు, 77 ప్రాథమికోన్నత పాఠశాలలు, 133 ఉన్నత పాఠశాలలు, 12 కసూర్బా విద్యాలయాలు, 06 మోడల్ స్కూళ్లు, 08 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 02 ఎస్టీ గురుకులాలు, ఒక పట్టణ బాలుర గురుకులం, మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. జిల్లాలో ఉపాధ్యాయుల కొరతను నివారించేందుకుగాను గత సంవత్సరం 56 మంది విద్యావలంటీర్లను నియమించారు. దీంతో ఉపాధ్యాయుల కొరతను కొంత మేరకు అధిగమించారు.

పక్కాగా పాఠ్యపుస్తకాల పంపిణీ...
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు చేరాయి. గతంలో విద్యార్థులకు సరిపోను పుస్తకాలు అందలేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంతో పోల్చితే ఈ విద్యాసంవత్సరానికి ముందే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం క్లాత్‌ల పంపిణీని ప్రభుత్వం పక్కాగా చేపట్టింది. నెల రోజుల ముందుగానే ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందించాలంటే విద్యాసంవత్సరం సగం పూర్తైనా విద్యార్థులకు సరిగ్గా అందేవి కావు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నది. అందులో భాగంగానే నూతన విద్యాసంవత్సరం ప్రారంభం ముందే విద్యార్థుల చేతికి వారు ప్రమోట్ అయిన తరగతి పాఠ్యపుస్తకాలు అందించాలని నిర్ణయించారు. సాధారణంగా ఏటా జూన్ లో పాఠ్యపుస్తకాల పంపిణీ జరుగుతుంది. కానీ ఈసారి ముందస్తుగానే పుస్తకాలు పంపిణీ చేపట్టింది. పాఠశాలల ప్రారంభం కాకముందే 92శాతం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధ్దమయ్యారు. పాఠశాలల ప్రారంభం రోజు జూన్ 12న విద్యార్థి చేతిలో పాఠ్యపుస్తకాలు ఉండనున్నాయి.

పాఠశాలలకు చేరిన ఏకరూప దుస్తులు..
పాఠశాలల ప్రారంభానికి ముందే పక్కాగా విద్యార్థుల యూనిఫాం క్లాత్ పంపిణీ చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా యూనిఫాం క్లాత్‌లను ఇటీవల పంపిణీ చేశారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 696 పాఠశాలలు ఉన్నాయి. గతంలో జత బట్టలు కుట్టినందుకు గాను ప్రభుత్వం రూ.40లు చెల్లించేది. ప్రస్తుతం అదే జత బట్టలు కుట్టినందుకు అదనంగా రూ.10కలిపి మొత్తం రూ.50లను అందిస్తుంది.

ప్రతీ పుస్తకంపై బార్‌కోడ్..
విద్యావ్యవస్థలో ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాఠ్యపుస్తకాలను అందించేందుకు విద్యార్థుల ఆధార్ అనుసంధానం చేసింది. విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల పంపిణీలో అవకతవకలు జరుగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం గత ఏడాది ఆధార్ నమోదు చేసుకున్న విద్యార్థులకు అనుగుణంగా పుస్తకాలపై బార్‌కోడ్‌ను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుత నూతన పాఠ్యపుస్తకంపై సీరియల్ నెంబర్ కూడా ముద్రించారు. లెక్క పక్కాగా ఉండేందుకు గాను ప్రభుత్వం నూతన నిర్ణయం తీసుకుంది.

మౌలిక వసతుల కల్పన...
ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం గతం కంటే మెరుగ్గా సౌకర్యాలు కల్పించింది. మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. మరి కొన్ని పాఠశాలల్లో మరుమ్మత్తు పనులు చేపట్టారు. తాగు నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టారు. టాయిలెట్ల పైన ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు లేనిచోట నీటి గోళాలు ఏర్పాటు చేసి వాటర్ బకెట్స్, మగ్గులు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలన్న భావనతో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. అందరి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న బడి బాట, కార్పొరేట్‌కు ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో డిజిటల్ పాఠాలకు శ్రీకారం చుట్టారు. తద్వారా తల్లిదండ్రుల ఆలోచన సరళిలో మార్పు వచ్చింది. ఇదే క్రమంలో ఉపాధ్యాయుల పనితీరుపై దృష్టి సారించిన ప్రభుత్వం వారి హాజరు శాతాన్ని పెంచేందుకు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకరావాలని నిర్ణయించింది. సీమాంధ్రుల పాలనలో వసతిగృహాలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో దొడ్డుబువ్వ, చింతపండుపులుసు, ఉడికి ఉడకని అన్నం వడ్డించేవారు. ఈవిధానాన్ని ప్రభుత్వం స్వస్తి పలికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి బిడ్డకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్ధేశంతో ఖర్చుకు వెనుకాడకుండా ప్రతి రోజు మంచి రుచికరమైన పౌష్టికాహారం అందిస్తుంది.

జూన్ 14నుంచి బడి బాట..
జిల్లాలో బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా జూన్ 14 నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చేందుకు శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లోనూ బడిబాట నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రోజు వారి కార్యక్రమాలను ఉపాధ్యాయులు అమలు చేయనున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆద్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో బడి బాట చేపట్టనున్నారు. బడిబాటలో భాగంగా బడిబయట ఉన్న చిన్నారులను గుర్తించి ఆయా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలలను ఆకర్శించేలా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మొదటి దఫా బడిబాట కార్యక్రమాలను చేపట్టాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు ఈ నెల 14 నుంచి 19 వరకు బడిబాట నిర్వహిస్తారు. ప్రతీ రోజు నూతన విద్యార్థుల నమోదు కా చేపట్టి మండల, జిల్లా విద్యాశాఖ అధికారులకు నివేదికను అందిస్తారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...