సంక్షేమ ఫలాలను సకాలంలో అందించాలి


Wed,June 12, 2019 02:24 AM

-ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
-నర్సంపేటలో రూ.35 కోట్ల పనుల పురోగతిపై సమీక్ష సమావేశం
-పాల్గొన్న మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు
నర్సంపేట, నమస్తేతెలంగాణ : ప్రజలకు సంక్షేమ ఫలాలను సకాలంలో అందించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవా రం నర్సంపేటలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వ విడుదల చేసిన రూ.35 కోట్ల పనుల గురించి అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల కోసం నిధులను విడుదల చేస్తోందన్నారు. నిధులను సకాలంలో ఖర్చు చేయడంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు ఇబ్బందులకు గురికావద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నిధులను అందిస్తున్నారని తెలిపారు.

అయితే కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. నర్సంపేట మున్సిపాలిటీలో తొమ్మిది నెలల కిందట రూ.35 కోట్లు నిధులు తెస్తే అధికారులు ఇంత వరకు కొన్ని పనులకు టెండర్ ప్రక్రియ కూడా నిర్వహించక పోవడం దారుణమన్నారు. ఎన్నికల కోడ్ అడ్డు వస్తోందని చెబుతున్న అధికారులు కోడ్ లేని రోజుల్లో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రూ.35 కోట్లు వస్తే ఒక్క డివైడర్ల పనులు మాత్రమే చేస్తున్నారన్నారు. నాలుగు నెలలుగా అవే పనులు చేయడం తగదన్నారు. వెంటనే మిగతా పనుల్లో కూడా ప్రగతి చూపాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం వస్తుందని, వెంటనే పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కుమ్మరికుంట పార్క్ బండ్ మొదలు పెట్టకుండా మిగతా పనులు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. గిల్స్, సెంట్రల్ లైటింగ్, కుమ్మరికుంట పార్క్, స్లైడ్ డ్రైనేజ్, కమ్యునిటీ హాళ్ల భవనాలు, బీటీ రెన్యువల్స్ టెండర్లు వెంటనే నిర్వహించాలన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులను వెంటవెంటనే ఇచ్చి పురోగతి పెంచాలని సూచించారు. నర్సంపేటలో ఆరు కిలో మీటర్ల డివైడర్లకు 320 సెంట్రల్ లైటింగ్ స్తంభాలు అవసముంటే కాంట్రాక్టర్ ఇప్పటివరకు 185 స్తంభాలనే తెచ్చారని, డివిడైర్లు పూర్తయిన తర్వాత అవి ఎక్కడ పాతుతారని ప్రశ్నించారు. వెంటనే గుత్తేదారులను పిలిపించి పనులు చేయించాలన్నారు. నర్సంపేట పట్టణాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు సహకరించాలని కోరారు. వర్షాకాలంలో ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. పట్టణానికి నీటిని అందించడంలో కూడా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పాత పైపులతోనే మెయిన్ ట్యాంక్ నుంచి నేరుగా నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, కమిషనర్ వెంకటేశ్వర్‌రావు, డీఈ వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్మన్ మునిగాల పద్మ వెంకట్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి పనిచేయాలి
సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు నిరంతరం పనిచేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. ప్రజాప్రతినిధులు గ్రామాలు, మండలాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు తీర్చడంలో ముందుండాలన్నారు. సమస్యలను తీర్చేందుకు ప్రణాళికను రూపొందించుకుని ముందుకు పోవాలన్నారు. ఎక్కువ నిధులను మంజూరు చేయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జెడ్పీ టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు నబీ, జెడ్పీటీసీలు బత్తిని స్వప్న శ్రీనివాస్, బానోతు పత్తినాయక్, లావుడ్య సరోజన హరికిషన్, ఎంపీపీలు ఊడుగుల సునీత ప్రవీణ్‌గౌడ్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జాటోతు రమేశ్, కాట కోమల భద్రయ్య, బాదావతు విజేందర్, మోతె కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే దంపతులకు సన్మానం
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, స్వప్న దంపతులను నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యు లు ఘనంగా సన్మానించారు. ఆరు మండలాల్లో పార్టీని గెలుపుబాటలో నిలబెట్టి, అన్ని పదవులను సాధించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి, పెద్ది స్వప్నకు పూలమాల వేసి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. కార్యక్రమంలో నల్లబెల్లి వైస్ ఎంపీపీ గందె శ్రీలత, ఎంపీపీ సారంగపాణి, ఖానాపురం కోఆప్షన్ మెంబర్ షేక్ మస్తాన్ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...