బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి


Wed,June 12, 2019 02:22 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : బడి ఈడు పిల్లలందరిని బడిలో చేర్పించాలని వరంగల్ రూరల్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) హరిసింగ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్‌వో తన ఛాంబర్‌లో బడిబాట కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల సమీపంలో గల ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నెల 14వ తేదీ నుండి 19 వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ చేయాలన్నారు. ఆవాస ప్రాంతాలన్నీ బడిబాట ద్వారా తిరిగాలని అన్నారు. స్వయం సహాయ సంఘాల మహిళల భాగస్వామ్యంతో ప్రతీ ఇంట్లో ఉండే బడిఈడు పిల్లలందరు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థులు కూడా తిరిగి పాఠశాలలకు వెళ్లేలా తల్లిదండ్రులను ప్రోత్సహించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచేందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అన్ని పాఠశాలల ప్రాంగణాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి రిజిష్టర్లు, రికార్డులు తదితరాలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ప్రతీ పాఠశాలలో కనీస మౌలిక వసతులు ఉండాలని, ఆడపిల్లల విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ బాలికందరు పాఠశాలల్లో చేరేవిధంగా ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈవో పెగడ రాజీవ్, డీఎంహెచ్‌వో మధుసుదన్, డీడబ్ల్యూవో సబిత, బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...