కాళేశ్వరంలో గెస్ట్‌హౌస్‌లు!


Mon,May 27, 2019 01:56 AM

(జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ) ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో సాగునీటి శాఖ అధికారులు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు బ్యారేజీలు, పంపుహౌస్‌ల వద్ద గెస్ట్‌హౌస్‌లు, క్వార్టర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద అతిథి గృహాలు, ఇంజినీర్లు నివసించేందుకు క్వార్టర్ల నిర్మాణం కోసం డిజైన్లు రూపొందిస్తున్నారు. డిజైన్లకు సాగునీటి శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఆమోదం పొందిన వెంటనే గెస్ట్‌హౌస్‌లు, క్వార్టర్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ఇటీవల సాగునీటి శాఖ అధికారులతో పలుమార్లు సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ వానాకాలం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మిగులు పనులన్నీ కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలన్నారు. జూలై నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగాలని చెప్పారు. ఆలోపు బ్యారేజీలు, పంపుహౌస్‌లు, గ్రావిటీ కెనాల్స్, పైపులైన్లు, ఇతర పనులన్నింటినీ కూడా పూర్తి చేసేందుకు లక్ష్యాలు నిర్దేశించారు. ఈ క్రమంలో ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో నిర్వహణ కూడా అంతే ముఖ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందులో భాగంగా బ్యారేజీలు, పంపుహౌస్‌ల వద్ద గెస్ట్‌హౌస్‌లు, ఇంజినీర్లు, సిబ్బంది నివసించడానికి క్వార్టర్లు నిర్మించాలని ముఖ్యమంత్రి సాగునీటి శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో బ్యారేజీలు, పంపుహౌస్‌ల వద్ద గెస్ట్‌హౌజ్‌లు, క్వార్టర్లు నిర్మించేందుకు సాగునీటి శాఖ ఇంజినీర్లు రంగంలో దిగారు. కొద్దిరోజుల నుంచి గెస్ట్‌హౌస్‌లు, క్వార్టర్ల నిర్మాణం కోసం డిజైన్లు తయారు చేస్తున్నారు.

సీఎం క్యాంపు ఆఫీసులు
కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ వంటి మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద నిర్మించే గెస్ట్‌హౌస్‌ల్లో సీఎం క్యాంపు ఆఫీస్ ఉండేలా సాగునీటి శాఖ ఇంజినీర్లు డిజైన్ చేస్తున్నారు. మేడిగడ్డ, కన్నెపల్లి వద్ద నిర్మించే గెస్ట్‌హౌస్‌ల్లో సీఎం క్యాంపు ఆఫీసులతో పాటు సాగునీటి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) క్యాంపు ఆఫీసు కూడా ఉండే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. సీఎం క్యాంపు ఆఫీసుతో పాటు ఈఎన్‌సీ క్యాంపు ఆఫీసు కూడా ఉండేలా మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద పెద్ద గెస్ట్‌హౌస్‌లను నిర్మించాలనే ఆలోచనలో సాగునీటి శాఖ ఇంజినీర్లు ఉన్నారు. ఇందుకు అనుగుణంగా డిజైన్లు సిద్ధం చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ వద్ద కూడా ఒక మినీ గెస్ట్‌హౌస్ నిర్మించేందుకు డిజైన్ తయారు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైనవి కావడం వల్ల మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద ఇంజినీర్లు నివసించేందుకు క్వార్టర్లు నిర్మించడానికి డిజైన్లు రూపొందిస్తున్నారు. డీఈల కోసం నాలుగు, జేఈల కోసం మరో నాలుగు లెక్కన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద రెండు చోట్ల కూడా క్వార్టర్లు నిర్మించేందుకు నిర్ణయించారు. గెస్ట్‌హౌస్‌లు, క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించి తయారైన వివిధ డిజైన్లను సాగునీటి శాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే సీడీవో నుంచి ఆమోదం పొంది గెస్ట్‌హౌస్‌లు, క్వార్టర్ల నిర్మాణ పనులు చేపట్టే దిశలో ముందుకు సాగుతున్నారు. గెస్ట్‌హౌస్‌లు, క్వార్టర్ల డిజైన్ త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉంది.

ఈ నెల 19వ తేదీన సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌ను సందర్శించి పనులను పరిశీలించిన విషయం తెలిసిందే. వెట్న్ ప్రారంభానికి తాను చీఫ్ సెక్రటరీతో కలిసి కన్నెపల్లి పంపుహౌస్‌కు వస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. జూన్ మొదటి వారంలో కన్నెపల్లి పంపుహౌస్‌లో నాలుగు మోటార్ల ద్వారా వెట్న్ నిర్వహించేందుకు సాగునీటి శాఖ ఇంజినీర్లు సన్నాహాలు చేస్తున్నారు. వీలైతే ఆరు మోటార్ల ద్వారా కూడా వెట్న్ నిర్వహించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నారు. జూన్ 6, 7, 8 తేదీల్లో ఏదైన ఒక రోజు కన్నెపల్లి పంపుహౌస్‌లో వెట్న్ జరగవచ్చని, వెట్న్‌క్రు సీఎం కేసీఆర్ వస్తారని సాగునీటి శాఖ ఇంజినీర్లు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే గోదావరిలో నిల్వ చేసిన నీటిని అప్రోచ్ కెనాల్, హెడ్ రెగ్యులర్ ద్వారా ఫోర్ బేలోకి పంపారు. తద్వారా వెట్న్‌క్రు మోటార్లను సిద్ధం చేస్తున్నారు. వెట్న్ కోసం సీఎం కేసీఆర్ కన్నెపల్లి పంపుహౌస్‌ను సందర్శించిన రోజు ఇంజినీర్లు గెస్ట్‌హౌస్‌లు, క్వార్టర్ల నిర్మాణం కోసం తయారు చేసిన డిజైన్లను ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అదే రోజు గెస్ట్‌హౌస్‌లు, క్వార్టర్ల డిజైన్ ఖరారు కావచ్చు.

టెక్స్‌టర్ పార్కులు
కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో గోదావరిలో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు సంవత్సరంలో 365 రోజుల పాటు నీరు నిల్వ ఉండనుంది. నిండుకుండను తలపించే గోదావరితో తెలంగాణ ప్రజలకు అనేక రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా బ్యారేజీలు, పంపుహౌస్‌లు, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పర్యాటకులు బ్యారేజీలు, పంపుహౌస్‌లను సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో బ్యారేజీలు, పంపుహౌస్‌ల వద్ద పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సాగునీటి శాఖలోనే ప్రత్యేకంగా టూరిజం విభాగాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ విభాగం ద్వారా బ్యారేజీలు, పంపుహౌస్‌ల వద్ద టూరిజం అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద టెక్స్‌టర్ పార్కుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పార్కుల నిర్మాణానికి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేసే బాధ్యతలను ఓ ప్రైవేటు కన్సల్టెన్సీకి ఇటీవల ప్రభుత్వం అప్పగించినట్లు తెలిసింది. సదరు కన్సల్టెన్సీ మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్ వద్ద టెక్స్‌టర్ పార్కుల నిర్మాణానికి డీపీఆర్ తయారు చేస్తున్నది. డీపీఆర్ అందగానే అధ్యయనం చేసి టెక్స్‌టర్ పార్కుల నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...