పథకాలకు పట్టాభిషేకం


Fri,May 24, 2019 04:05 AM

-ఓరుగల్లు, మానుకోటపై గులాబీ జెండా రెపరెపలు
-లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం
-సమష్టి కృషితో రెండు స్థానాలు కైవసం

వరంగల్ ప్రధాన ప్రతినిధి/నమస్తేతెలంగాణ;సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికలు ఏవైనా, ఎక్కడైనా టీఆర్‌ఎస్‌కే విజయం అని మరోసారి నిజం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ కట్టబెట్టారు. గత నెల 11న లోక్‌సభకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో గురువారం అధికారులు ఓట్లు లెక్కించారు. వరంగల్ ఎంపీగా పసునూరి దయాకర్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన దొమ్మాటి సాంబయ్యపై 3,50,298 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహబూబాబాద్ ఎంపీగా మాలోత్ కవిత తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన పోరిక బలరాంనాయక్‌పై 1,46,663 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

రెండోసారి వరంగల్ నుంచి పసునూరి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. 2015 వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు ముందు పసునూరి సామాన్య టీఆర్‌ఎస్ కార్యకర్త. ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలోనే 7వ అతిపెద్ద మెజార్టీతో గెలిచిన ఎంపీగా రికార్డు సృష్టించారు. అదే ఒరవడిని 2019 ఎన్నికల్లో నిరూపించుకున్నారు. రాష్ట్రంలోనే 17 ఎంపీ స్థానాల్లో అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా రికార్డు సృష్టించారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ఇంతటి ఘన విజయం సమకూర్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు జోరు కొనసాగింది. ఓరుగల్లు, మానుకోటపై గులాబీ జెండా రెపరెపలాడింది. రెండు ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయబావుటా ఎగరేసింది. ఓటర్లు కారుకు బ్రహ్మరథం పట్టారు. పార్టీలకతీతంగా ప్రభుత్వం చేసిన పనులను గుర్తించారు. సంక్షేమ పథకాలను ఆశీర్వదించారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థులు పసునూరి దయాకర్, మాలోత్ కవితను భారీ మెజారిటీతో గెలిపించారు. వారికి ఎమ్మెల్యేలు స్వీట్లు తినిపించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీల శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. పటాకలు కాలుస్తూ, రంగులు చల్లుకుంటూ సంబురాలు చేసుకున్నారు.

స్వీట్లు పంచిపెట్టారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో వరంగల్ లోక్‌సభ, మానుకోట సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో మహబూబాబాద్ లోక్‌సభ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సరళిని అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, రూరల్ కలెక్టర్ హరిత, మహబూబాబాద్ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, సీపీ రవీందర్ తదితరులు పరిశీలించారు. కాగా, దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు సమన్వయంతో సమష్టి కృషితో విజయం సాధ్యమైందని ఎంపీ అభ్యర్థులు చెప్పారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారం సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తామని స్పష్టం చేశారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...