ఉపాధికి ఊతం!


Wed,May 22, 2019 02:34 AM

-వేతన పెంపుతో కూలీలకు లబ్ధి
-నాలుగు నెలలు అలవెన్సులు
-జిల్లాలో 1,59,837 జాబ్‌కార్డులు
-పనుల్లోకి 73,268 మంది కూలీలు
-నిర్దేశిత లక్ష్యం చేరేలా అధికారుల ప్రణాళికలు

శాయంపేట, మే 21 : గ్రామాల్లో వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రభుత్వం మరింత ఊతమిచ్చింది. పనిచేస్తున్న కూలీలకు వేతనాన్ని పెంచడంతో సర్వత్రా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ పేదలకు ఆర్థికంగా తోడ్పాటును అందించాలన్న లక్ష్యంతో ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. వేసవి దృష్ట్యా ప్రభుత్వం అలవెన్సు ఇవ్వడంతోపాటు మరో రూ.5 వేతనాన్ని ఇటీవల పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీకి రోజుకు గరిష్టంగా రూ.211 సంపాదించుకునే వెసులుబాటును కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కూలీలకు సూరీడు శాపంగా మారాడు. ఉదయాన్నే ఎండలు దంచికొడుతుండడంతో కొన్ని గంటలే పనులు చేయాల్సిన పరిస్థితి ఉన్నట్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దేవుడు వరమిచ్చినా సూరీడు అడ్డుకున్న చందంగా కూలీల పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దీంతో ప్రభుత్వం నిర్దేశించిన కూలిని అందుకోలేకపోతున్నట్లు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 15,9837 జాబ్‌కార్డులు జారీ చేశారు. ఇందులో 3,44,437 మంది కూలీలు నమోదై ఉన్నారు.

అయితే ఉపాధి హామీ పనులు చేసేందుకు 73,268 మంది కూలీలు వస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈజీఎస్‌తో పనులు కల్పించి తోడ్పాటును ఇవ్వాల్సి ఉంది. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చెరువుల పూడికతీత, ఫిష్ బ్రీడింగ్ పాండ్స్, ఫాం పాండ్స్, మట్టి రోడ్లు, సీసీటీ (ట్రెంచ్), కందకాల పనులను కూలీలతో చేయిస్తున్నారు. అయితే వేసవిలో పనులు చేస్తుండడంతో కూలీలకు ప్రత్యేక అలవెన్స్‌ను అందజేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే ఉపాధి పనులు జరుగుతాయి. వర్షాలు లేకపోతేనే పనులు చేయించాల్సిన పరిస్థితి ఉండడంతో ఈ నెలల్లోనే పనులు కూలీలకు కల్పిస్తున్నారు. అయితే ప్రతి ఏడాది ప్రభుత్వం కూలీలకు ఈ నాలుగు నెలల్లో ప్రత్యేక అలవెన్సు అందించి తోడ్పాటును ఇస్తున్నది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో 20 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం అలవెన్స్‌ను కలిపి కూలీలకు అందించాలని నిర్ణయించింది. ఈ లెక్కన కూలీలు పనిచేసిన దానికి ఈ అలెవెన్సును కలిపి అందజేయనున్నట్లు అధికారులు చెప్పారు.

అయితే కూలీలకు ప్రభుత్వం రోజువారి కూలిని కూడా ప్రతిసారి పెంచుతున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం రోజువారి కూలిని రూ.206గా నిర్దేశించింది. ఉపాధి హామీ పథకంలోని టెక్నికల్ అసిస్టెంట్లు గ్రూపుల వారీగా పని కల్పిస్తారు. గ్రూపునకు రెండు మీటర్ల పొడవు, వెడల్పు, అరమీటరు లోతుతో పూడిక పనులు అప్పగిస్తున్నారు. ఈ గ్రూపులో సుమారు 40 మంది వరకు ఉంటారు. అందరు కలిసి దీనిని పూర్తి చేస్తే వారికి అనుకున్నట్టుగా రోజువారి కూలి గిట్టుబాటు అవుతుంది. అంటే ఒక్కొక్కరికి రూ.206 పడుతుంది. కానీ, గ్రూపులో ఉన్న కూలీల్లో సగం కూడా పనుల్లోకి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇందుకు దంచికొడుతున్న ఎండలు కూడా ఒక కారణం. ఉదయం ఎండ రానంత వరకు పని చేస్తున్నారు. అంటే మూడు, నాలుగు గంటలు మాత్రమే పనులు చేసి కూలీలు వెళ్లిపోతున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రూ.120 నుంచి రూ.144 వరకు కూలి గిట్టుబాటు అవుతున్నట్లు చెబుతున్నారు.

రూ.211 సంపాదించే అవకాశం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోజుకు ఎనిమిది గంటలు పనిచేయాల్సి ఉందని, ఆరోగ్యంగా ఉన్న వారు కనీసం ఐదు గంటలు పనిచేస్తే కనీస కూలి పడుతుందని ఈజీఎస్ శాయంపేట ఏపీవో అనిత చెప్పారు. ఎండలకు తట్టుకోలేక మధ్యలోనేఆపేసి పోతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శాయంపేటలో అత్యధికంగా కూలికి రోజుకు రూ.187 గిట్టుబాటు అయినట్లు చెప్పారు. శాయంపేట మండలంలో 9వేల జాబ్‌కార్డులు ఉంటే 6,264 మంది కూలీలున్నట్లు తెలిపారు. కానీ, రోజుకు 3400 మంది వరకు కూలీలు పనులకు వస్తున్నట్లు చెప్పారు. అయితే ఉపాధి కూలీలకు మరింత ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేందుకు వేతనాన్ని రూ.5 పెంచారు. అంటే మొత్తంగా రోజుకు కూలి రూ.211 సంపాదించుకునే వీలు కల్పించారు. అయితే నిర్దేశించిన విధంగా పనిచేస్తేనే పెంచిన వేతనం కలుస్తుందని ఏపీవో అనిత చెప్పారు. అయితే ప్రభుత్వం కూడా రూ.5 పెంచిన వేతనాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించినట్లు ఆమె ఈ సందర్భంగా వివరించారు.

కూలీలకు రూ.14.02 కోట్లు ఖర్చు
జిల్లాలో ఈ ఏడాది రూ.14.02 కోట్లు కూలీలకు ఖర్చు చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికి 9,44,637 పనిదినాలను కల్పించారు. అలాగే జిల్లాలో 100 రోజుల పనిదినాలు పూర్తి చేసిన హౌస్‌హోల్డ్స్ ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి. పేదలకు పనికల్పించి ఆర్థికంగా ఆదుకునేందుకు ఉద్దేశించిన ఉపాధి హామీలో వేతనం పెంచడం సంతోషంగా ఉందని కూలీలు చెప్పారు. మరో పదిపదిహేను రోజుల్లో నైరుతి రుతుపవనాలు వస్తే వర్షాలు పడే అవకాశాలున్నాయి. వానలు పడితే కూలీలు వ్యవసాయ పనుల వైపు మొగ్గుచూపుతారు. దీంతో నిర్దేశిత లక్ష్యం కోసం పనులు చేయిస్తున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...