నర్సరీల నిర్వహణ భేష్


Sun,May 19, 2019 02:29 AM

పర్వతగిరి, మే 18: మానవ మనుగడ సాఫీగా సాగేందుకు చెట్లు ఎంతో ఉపయోగపడుతాయని, అందుకోసం నర్సరీలను పరిరక్షించాలని కలెక్టర్ ఎం హరిత తెలిపారు. శుక్రవారం మండలంలోని మూడెత్తులతండా, చౌటపెల్లి, సోమారం జమాల్‌పురం, పర్వతగిరి గ్రామాల్లో ప్రభుత్వ నర్సరీలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏఏ మొక్కలను పెంచుతున్నారని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని మాట్లాడారు. సుమారు నాలుగు గంటల పాటు ఆయా గ్రామాల్లో ఎండను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థ్ధాయిలో నర్సరీలు, ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం ఉన్నతాధికారులతో కలిసి పలు అంశాలపై సమీక్షించారు. కాగా, మూడెత్తుల తండాలో సర్పంచ్ జ్యోతిలకుపతితో కలిసి నర్సరీని సందర్శించి, ఫీల్డ్ అసిస్టెంట్‌ను, వన సేవకులను మెచ్చుకున్నారు. నర్సరీ నిర్వహణ చాలా బాగుందని ప్రశంసించారు. కాగా, తండాలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం సహకరించాలని కలెక్టర్ హరితకు సర్పంచ్ జ్యోతి వినతిపత్రం సమర్పించారు. అదే విదంగా తండాలోని పాఠశాలలో నూతన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా కలెక్టర్ స్పందిస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచితే భవన నిర్మాణం కోసం సహకరిస్తామని చెప్పారు. గ్రామంలో మరుగుదొడ్లు లేని వారికి తక్షణమే కట్టించుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

అనంతరం చౌటపెల్లి నర్సరీని సర్పంచ్ ఉమతో కలిసి సందర్శించారు. మరింత శ్రద్ద పెట్టి నర్సరీని నిర్వహించాలన్నారు. అనంతరం ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి రికార్డుల నిర్వహణ సరిగా లేదని సిబ్బందిని మందలించారు. ఎన్‌సీడీ కార్యక్రమం ఏలా నిర్వహిస్తున్నారని, ఎంత మందికి స్క్రీనింగ్ చేశారని ఆశా వర్కర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే, అక్కడికి వచ్చిన పలువురు రైతులు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని కోరగా అక్కడే ఉన్న ఆర్డీవో మహేందర్‌జీకి రైతుల సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని సూచించారు. అనంతరం జమాల్‌పురం నర్సరీని సందర్శించారు. సర్పంచ్ పిడుగు రేణుకతో కలెక్టర్ హరిత మాట్లాడారు. ఐకేపీ సెంటర్‌లో వరిధాన్యం కొనుగోలు చేపట్టిన రైతులకు సంబందించి బిల్లులు రావడం లేదని దృష్టికి సర్పంచ్ తీసుకురాగా డబ్బులు వచ్చేలా చూడాలని ఆర్డీవోను ఆదేశించారు. అనంతరం పర్వతగిరిలోని నర్సరీని సర్పంచ్ చింతపట్ల మాలతీసోమేశ్వర్‌రావుతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో పీడీ మట్టపెల్లి సంపత్‌రావు, ఆర్డీవో మహేందర్‌జీ, ఎంపీడీవో సంతోష్‌కుమార్, ఏపీవో సుశీల్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజారోగ్యం పై నిర్లక్ష్యం వద్దు
ప్రజారోగ్యంపై వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం వీడి, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరిత సూచించారు. కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, సుమారు 45 నిమిషాల పాటు స్థానిక అధికారులతో సమీక్షించారు. ఇక్కడికి వచ్చే రోగులు, ప్రజలకు కనీసం నీటి సౌకర్యం లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో కంటే ఇప్పుడు ఓపీ రోగుల సంఖ్య బాగా తగ్గిపోయిందేమిటని ప్రశ్నించారు. డీఎంహెచ్‌వో మధుసూదన్‌తో కలిసి వైద్యాధికారి శ్రీనివాస్, ఆరోగ్య కేంద్రం సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు. రికార్డులను సమగ్రంగా రూపొందించాలని సూచించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో గర్భిణుల నమోదు వివరాలను చెప్పాలని పీచ్‌ఎన్ సుజాతను అడగగా కంప్యూటర్ పని చేయడం లేదని చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు అందుబాటులో ఉంచుకుని సిబ్బందిని అప్రమత్తంగా ఉండేలా చూడాలని కలెక్టర్ హరిత చెప్పారు. దవాఖాన నిధులతో వెంటనే వాటర్‌ప్లాంట్‌కు మరమ్మతు చేయించాలని ఆదేశించారు. వాటర్ కూలర్‌ను వినియోగంలోనికి తీసుకురావాలన్నారు. రోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పర్వతగిరి సర్పంచ్ చిం తపట్ల మాలతీ సోమేశ్వర్‌రావు, ఆర్డీఓ మహేందర్‌జీ, డీఆర్‌డీవో సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...