అయ్యో బిడ్డా..


Sun,May 19, 2019 02:28 AM

నెక్కొండ, మే 18 : తల్లి గుండె తల్లడిల్లింది. కుటుంబంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ ఆమె మనసును కకావికలం చేసింది. బిస్కట్ కొని బిడ్డకు తినిపించిన తల్లి..కొన్ని క్షణాల్లోనే అదే బిడ్డతో కలిసి బావిలో దూకి తనువు చాలించింది. ఇంటి ముందు అలుకు చల్లే విషయమై మొదలైన లొల్లి కాస్తా కుటుంబ కలహాలకు కారణమై ఇద్దరి ఆత్మహత్యకు కారణమైంది. నెక్కొండ మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకున్న హృదయవిదారక సంఘటనకు సంబంధించి వివరాలు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం గోపనపల్లికి చెందిన మంజుల (29)కు నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన మంగ రమేశ్‌తో ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి మూడేళ్ల కూతురు నిశిత (3) ఉంది. రమేశ్ నెక్కొండలోని ఓప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా మంజులకు అత్త కొమురమ్మ, భర్త రమేశ్‌తో గొడవలు జరుగుతున్నాయి. గొడవల్లో ఓసారి మంజుల నడుముకు బలమైన దెబ్బలు సైతం తగిలాయి. అప్పటి నుంచి మంజుల ఇంటి వద్దే ఉంటోంది. ఇంటి ముందు వాకిలి ఊడ్చే విషయమై కుటుంబ సభ్యులతోపాటు ఇరుగుపొరుగు అంటున్న మాటలతో మంజుల మనస్తాపానికి గురైంది. తాను చచ్చిపోతానంటూ బెదిరించడంతో రమేశ్ గ్రామ సర్పంచ్‌కు ఫోన్‌చేసి ఇంటికి రమ్మని పిలిచాడు. సర్పంచ్ గొడవ విషయమై ఇరువురికి సర్ది చెప్పారు. పుట్టింటి వారితో మంజుల ఫోన్‌లో మాట్లాడింది.

పెద్ద మనుషులను వెంటబెట్టుకుని వస్తామని పుట్టింటి వారు చెప్పడంతో అదే విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కాని పుట్టింటికి వెళ్తానని చెప్పి మంజుల శనివారం నెక్కొండకు చేరుకుంది. బిడ్డకు బిస్కట్ ప్యాకెట్ కొనిచ్చి మండల కేంద్రంలోని చెరువు సమీపంలో ఉన్న బావి దగ్గరకు చేరింది. బిడ్డకు బిస్కట్ తినిపించి అటు ఇటు తిరిగి బిడ్డతో సహా బావిలో దూకేసింది. సమీపంలో పనులకు వచ్చిన వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నెక్కొండ సీఐ పెద్దన్న కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించారు. శవపంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...