హరితహారానికి సన్నద్ధం


Fri,May 17, 2019 03:16 AM

-ఐదో విడత 2.54 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
-జిల్లాలో 401 నర్సరీల ఏర్పాటు.. 64 రకాల మొక్కల పెంపకం
-డీఆర్‌డీవో, అటవీ శాఖల ఆధ్వర్యంలో సిబ్బందికి శిక్షణ
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, మే 16 : ఐదో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని 16 మండలాల్లో 2.54 కోట్ల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా ఎంచుకున్నారు. జిల్లా కలెక్టర్‌ హరిత ఆధ్వర్యంలో డీఆర్‌డీవో, అటవీశాఖ అధికారులు అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ మొక్కల సంరక్షణపై చర్యలు తీసుకుంటున్నారు. గతంలో తక్కువ సంఖ్యలో నర్సరీలు ఉండడం వల్ల మొక్కల రవాణా, పంపిణీ ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రభుత్వం ప్రజలకు మొక్కలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రతీ గ్రామంలో నర్సరీ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలోని 16 మండలాల్లో 401 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఇందులో 327 నర్సరీలు డీఆర్‌డీఓ, 37 నర్సరీలు అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్నది. ఇందులో ప్రజలకు అవసరమైన పండ్లనిచ్చే మొక్కలతో పాటు నీడనిచ్చే మొక్కలు, టేకులు, ఇతర కలపకు సంబంధించిన నాణ్యమైన మొక్కలను పెంచుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రజలకు అవసరమైన 64 రకాల మొక్కలను సరఫరా చేసింది. సిబ్బందికి డీఆర్‌డీవో, అటవీ శాఖల ఆధ్వర్యంలో మొక్కల పెంపకంపై ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. దీంతో సిబ్బంది మొక్కలను జాగ్రత్తగా పెంచుతున్నారు.

గ్రామ పంచాయతీలకే మొక్కల సంరక్షణ బాధ్యత
గతంలో మొక్కల సంరక్షణ బాధ్యత ఈజీఎస్‌, అటవీ శాఖలకు ఉండడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండే వీలుకాకపోవడంతో కూలీలపై ఆధారపడాల్సి వచ్చేది. దీంతో మొక్కలు పూర్తిస్థాయిలో ఏపుగా పెరగకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వచ్చేంది. కానీ, ఐదో విడతలో గ్రామ పంచాయతీకో నర్సరీ పేరుతో అన్ని గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నర్సరీల బాధ్యత కూడా గ్రామ పంచాయతీలకే అప్పగించారు. ఉపాధి హామీ, ఇతర కూలీల సాయంతో గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు నిత్యం నర్సరీలను సందర్శిస్తూ మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఏపుగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా రైతులకు అవసరమైన జామాయిల్‌, టేకు, వేప, తదితర మొక్కలను కూడా పెంచుతున్నారు. మొక్కలను రైతులు వారి భూముల్లో నాటుకుని సంరక్షించుకున్నట్లయితే..నిర్వహణ కింద ఒక్కో మొక్కకు నెలకు రూ.ఐదు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అంతేకాకుండా మొక్క సంరక్షణకు కంచె ఏర్పాటు చేసుకుంటే.. ఒక్కో మొక్కకు రూ.129 చెల్లించనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం నర్సరీల్లో ఉన్న మొక్కల్లో 70 శాతం మేరకు ఉపయోగించనున్నారు. మిగిలిన 30 శాతం మొక్కలను 2 మీటర్ల వరకు పెంచి 2020 సంవత్సరంలో నాటించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నర్సరీల్లో 64 రకాల మొక్కల పెంపకం..
గతంలోకంటే ఈ ఏడాది ప్రజలు, రైతులకు మరిన్ని మొక్కలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రభుత్వం ముందస్తుగానే తయారు చేసిన ప్రణాళిక ప్రకారం నర్సరీలకు 64 రకాల మొక్కలను సరఫరా చేశారు. గతంలో మండలానికి 5, 6 నర్సరీలు మాత్రమే ఉండేవి. దీనివల్ల ప్రజలకు అవసరమైన మొక్కలు అనువైన సమయంలో లభించేవికావు. కానీ, ప్రస్తుతం గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేశారు. ఇందులో రైతులకు ఉపయోగపడే మొక్కలతో పాటు ప్రజలకు పండ్లు, నీడ, పూలనిచ్చే, ఎత్తుగా పెరిగే మొక్కలను కూడా పెంచుతున్నారు. నర్సరీలలో ఉన్న 64 రకాల్లో టేకు, ఎర్రచందనం, మలబార్‌, వేప, కానుగ, జామ, నిమ్మ, దానిమ్మ, ఉసిర, మామిడి, సపోట, నేరేడు, మల్లె, సీతాఫలం, జామాయిల్‌, గోరింటాకు, మదారం, శ్రీగంధం, గోరింటాకు, మందార, బొప్పాయి, గులాబీ, ఈత, వేప, తులసి, కరివేపాకు, వెదురు, చింత, నంది, అశోక, నందివర్ధనం, రేగు, కొబ్బరి, బాదం, పారిజాతం, గన్నేరు, గుల్‌మొహర్‌, బత్తాయి, పనస, అవిస, సిస్సు, ఇప్ప, జీడిమామిడి, ఎర్రతుర్రాకయి, కలబంద, కనకాంబరం, ఏకోమా, నిద్రగన్నేరు. మారేడు, రావి, మర్రి, నల్లమద్ది, కుంకుడు, వెలగ, కొలతచింత, అడవిమామిడి, బంతి, అడవితంగేడు, చామంతి, యాపిల్‌బేర్‌, జీడి, ఖర్జూర, అడవితంగేడు, చామంతి, తునికి, సీసం, పులిచేరియ, కజ్జకాయ తదితర రకాల మొక్కలను పెంచుతున్నారు.

వర్షాలు కురవగానే మొక్కలు నాటిస్తాం : మిట్టపల్లి సంపత్‌రావు, డీఆర్‌డీవో
జూన్‌లో వర్షాలు కురవడం ప్రారంభం కాగానే గ్రామాల వారీగా మొక్కలు నాటించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రస్తుతం గ్రామపంచాయతీల్లో ఉన్న 401 నర్సరీల్లో 2.54 కోట్ల మొక్కలను పెంచుతున్నాము. గ్రామపంచాయతీలు మాత్రమే బాధ్యతగా తీసుకుని ఈజీఎస్‌ ఎఫ్‌ఏ సహకారంతో నిర్వహణ జరుగుతున్నది. ఇప్పటికే అధికారులతో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశాం. వర్షాలు కురవగానే మొక్కలు నాటేందుకు అనువుగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలను గుర్తించాం. అలాగే మొక్కలు నాటుకునేందుకు ఆసక్తి ఉన్న రైతుల జాబితాలను కూడా తయారు చేస్తున్నాం. వర్షాలు కురవగానే విరివిగా మొక్కలునాటి ఐదో విడత హరితహారాన్ని విజయవంతం చేసేందుకుర సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా ఇందుకు పూర్తిస్థాయిలో సహకారం అందించాలి.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...