ప్రజల రక్షణకే పోలీసులు


Fri,May 17, 2019 03:15 AM

-సెంట్రల్‌జోన్‌ డీసీపీ నరసింహ
-పత్తిపాకలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌
శాయంపేట, మే 16 : ప్రజల రక్షణ కోసమే పోలీసులు పనిచేస్తున్నారని, సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీసే అని సెంట్రల్‌జోన్‌ డీసీపీ నరసింహ అన్నారు. మండలంలోని పత్తిపాక గ్రామంలో గురువారం రాత్రి పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 18 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను సీజ్‌ చేశారు. అనంతరం పత్తిపాక బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ నరసింహ మాట్లాడారు. హాజీపూర్‌ ఘటనను గుర్తు చేస్తూ మనందరిలో ఉంటూ అమ్మాయిలపై అకృత్యాలను చేసేవారిని గుర్తించలేమన్నారు. యూనిఫాం లేకుండా అన్యాయం జరిగితే ప్రశ్నించే మనస్తత్వం ఉన్నవారే పోలీసులు అవుతారన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో చెడు ప్రవర్తన గల వ్యక్తుల సమాచారం ఇవ్వాలన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే గతంలో ఎన్నో ఇబ్బందులు పడేవారని కానీ ఈ రోజు రిసెప్షన్‌ పెట్టామన్నారు. ప్రజల కోసం ఇంత మంది పోలీసులు అండగా ఉన్నారని చెప్పడానికి సెర్చ్‌ చేస్తున్నామన్నారు. యువకులు మంచి నడవడికతో ఉండాలన్నారు. ఇదే గ్రామంలో యువకుడు శ్రీపాల్‌రెడ్డి ఐఏఎస్‌ సాధించడం గొప్పవిషయమన్నారు. ఆయన గ్రామానికే కాకుండా రాష్ర్టానికే పేరు తెచ్చారని పేర్కొన్నారు.

ఇక్కడ ఇంకా చదువుకునే యువత శ్రీపాల్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌ద్వారా చదువుకుని ఉన్న నాలెడ్జ్‌ను పెంచుకుని లక్ష్యాన్ని సాధించారన్నారు. కానీ సెల్‌ఫోన్లను టైంపాస్‌ కోసం, చెడు ప్రవర్తన కోసం ఉపయోగిస్తున్నారన్నారు. టెక్నాలజీని మంచి వైపు తీసుకెళ్లాలన్నారు. బ్యాంకుల నుంచి ఎవరూ కూడా మీ పిన్‌నెంబర్లు, అకౌంట్‌ నెంబర్లు వంటివి అడగరన్నారు. బంగారం శుద్ధ్ది చేస్తామని, మాయమాటలు చెప్పేవాళ్లను, ఊళ్లల్లో బట్టలు అమ్మేవారు వస్తే నమ్మవద్దన్నారు. ఇలాంటి దొంగలను గుర్తించి సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన జాతీయ స్థాయి సివిల్‌ సర్వీస్‌ టాపర్‌ చిట్టిరెడ్డి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడారు. సైబర్‌ క్రైంల పట్ల జాగ్రత్తగా ఉండాలని వివరించారు. నేరాలు చేసిన తర్వాత ఇబ్బందులు పడటం కంటే ముందే చేయకుండా ఉంటే మంచిదన్నారు. చిన్న వయస్సు నుంచే తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ్ద తీసుకోవాలని అన్నారు. అనంతరం డీసీపీ నరసింహ, ఏసీపీ సుదీంధ్ర, సీఐలు శ్రీపాల్‌రెడ్డిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పరకాల ఏసీపీ వైవీఎస్‌ సుదీంధ్ర, సీఐలు వెంకటేశ్వర్‌రావు, మహేందర్‌రెడ్డి, ఎస్సైలు రాజబాబు, రాజ్యలక్ష్మి, భాస్కర్‌రెడ్డి, రవిరాజ్‌, వంద మంది పోలీసులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...