ఓట్ల లెక్కింపునకు ముందస్తు చర్యలు


Thu,May 9, 2019 02:23 AM

-అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ప్రక్రియ
-ప్రతీ రౌండ్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేయాలి
-ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాలి
-వరంగల్ లోక్‌సభ రిటర్నింగ్ అధికారి ప్రశాంత్‌జీవన్ పాటిల్

రెడ్డికాలనీ, మే 8: ఈనెల 23న నిర్వహించే వరంగల్ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పకడ్బందీగా చేపట్టేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు వరంగల్ లోక్‌సభ రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ సెగ్మెంట్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు, ఇతర కౌంటింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ రౌండ్‌కు 14 టేబుళ్లు ఏర్పాటు చేయాలని, భూపాలపల్లిలో 23 రౌండ్లు, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 21 రౌండ్లు, వర్ధన్నపేటలో 20, వరంగల్ పశ్చిమలో 18, పరకాలలో 17, వరంగల్ తూర్పులో 15 రౌండ్లలో ఆయా సెగ్మెంట్ల కౌంటింగ్ పూర్తవుతుందని తెలిపారు.

హడావుడిగా కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించొద్దని సూచించారు. కొంత సమయంలో ఎక్కువ తీసుకున్నప్పటికీ నిదానంగా క్రమపద్ధతిలో కౌంటింగ్‌ను నిర్వహించాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం నిబంధనలను అర్థం చేసుకోవాలని తెలిపారు. టేబుళ్ల వారీగా ప్రతి రౌండు ఫలితాల షీట్లను సేకరించేందుకు రో-ఆఫీసర్లను నియమించనున్నట్లు తెలిపారు. ప్రతీ టేబుల్‌కు కంట్రోల్ యూనిట్లను స్ట్రాంగ్ రూం నుంచి తెచ్చేందుకు నియమించిన సిబ్బందికి ముద్రించిన టీ-షర్ట్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి రౌండ్ ఫలితాలను రిటర్నింగ్ అధికారికి పంపే ముందు ధ్రువీకరించుకోవాలని ఏఆర్వోలను ఆదేశించారు. కౌంటింగ్ సమాచారాన్ని రౌండ్ల వారీగా అందించేందుకు మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

భారత ఎన్నికల సంఘం పంపించిన మీడియా కౌంటింగ్ అథారిటీ పాసులను రిటర్నింగ్ అధికారి మాత్రమే జారీ చేస్తారని తెలిపారు. కౌంటింగ్ మీడియా సెంటర్ బాధ్యత సమాచార పౌర సంబంధాల శాఖ ఉపసంచాలకులదేనని స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఈనెల 19లోపు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. ఈనెల 20న లోక్‌సభ జనరల్ అబ్జర్వర్ కౌంటింగ్ ఏర్పాట్లను తనిఖీ చేసి ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపుతారని తెలిపారు.

కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈనెల 14న మొదటి విడత ర్యాండమైజేషన్‌ను, 22న రెండవ విడత ర్యాండమైజేషన్‌ను చేసి విధులను కేటాయించనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి పూర్తి తర్ఫీదు ఇవ్వనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో కంప్యూటర్లు, ప్రింటర్, జిరాక్స్ మిషన్లు, టేబుళ్లు, మెస్‌లు, ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లను, సర్వీస్ ఓటర్ల ఓట్లను ఒకేచోట కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 5 వీవీప్యాట్‌ల చొప్పున ఎంపిక చేసి లోక్‌సభ పరిధిలో 35 పోలింగ్ కేంద్రాల వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కౌంటింగ్ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కౌంటింగ్ షీట్ల భర్తీ గురించి వివరించారు. సమావేశంలో జేసీ ఎస్ దయానంద్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కే వెంకారెడ్డి, రవికిరణ్, మహేందర్‌రెడ్డి, వెంకటాచారి, రమేశ్, కిషన్, ఎన్‌ఐసీ డీఐవో విజయ్‌కుమార్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...