రెండో విడతకు రెడీ


Fri,April 26, 2019 01:34 AM

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రాదేశిక ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల పరిశీలన కార్యక్రమం గురువారంతో ముగిసింది. రెండో విడత నామినేషన్ల ఘట్టం శుక్రవారం ప్రారంభం కానుంది. అధికారులు మొదటి విడతలో దాఖలైన నామినేషన్ల పరిశీలనను గురువారం పూర్తి చేశారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలతోపాటు మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు రాష్ట్ర ఎన్నికల అధికారులు షెడ్యూల్ మొదటి విడత నామినేషన్లను ఈ నెల 22, 23, 24వ తేదీల్లో స్వీకరించి 25న పరిశీలన పూర్తి చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు సంబంధించి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండగా మొదటి విడత నామినేషన్ల దాఖలా, పరిశీలన పూర్తయింది. శుక్రవారం నుంచి రెండో విడత నామినేషన్లను స్వీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. రెండో విడతలో ఆరు మండలాల్లోని ఆరు జెడ్పీటీసీ స్థానాలతోపాటు 63ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 14న మూడో విడత పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు నోటిఫికేషన్ విడుదల చేసి 10.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనన్నారు.

26, 27, 28వ తేదీల్లో మూడు రోజుల పాటు ఈ నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 29వ తేదీన నామినేషన్ల పరిశీలన, సాయంత్రం 5గంటలకు అభ్యర్థుల తుది జాబితా, 30వ తేదీన అప్పీళ్లకు చివరితేదీ కాగా, మే 1న అప్పీళ్ల పరిష్కారం, మే 2వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. మే 10వ తేదీన ఆరు మండలాల్లో ఎన్నికలు జరగనుండగా 27వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. ఇప్పటికే ఆర్వోలను నియమించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకు ఆరు మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్తగా ఏర్పడ్డ నడికూడ మండల జెడ్పీటీసీతోపాటు 10ఎంపీటీసీ స్థానాలకు, పరకాల జెడ్పీటీసీతోపాటు ఐదు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక శాయంపేట మండల జెడ్పీటీసీతోపాటుగా 12ఎంపీటీసీ స్థానాలకు, రాయపర్తి మండల జెడ్పీటీసీ స్థానంతోపాటు 16ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నల్లబెల్లి మండల జెడ్పీటీసీతోపాటు 11ఎంపీటీసీ స్థానాలకు, ఖానాపూర్ జెడ్పీటీసీతోపాటుగా తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు రెండో విడతలో జరగనున్నాయి. ఈ మేరకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

పూర్తయిన మొదటి విడత నామినేషన్ల పరిశీలన..
జిల్లాలోని ఐదు మండలాల్లో మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. 22, 23, 24వ తేదీల్లో అధికారులు ఐదు మండలాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా నామినేషన్లను స్వీకరించారు. 25వ తేదీ గురువారం దాఖలా అయిన నామినేషన్లను పరిశీలించారు. దుగ్గొండి జెడ్పీటీసీ స్థానానికి 12మంది, నర్సంపేట జెడ్పీటీసీ స్థానానికి 12మంది, పర్వతగిరి జెడ్పీటీసీ స్థానానికి 15మంది, సంగెం జెడ్పీటీసీ స్థానానికి 11మంది, వర్ధన్నపేట జెడ్పీటీసీ స్థానానికి 16మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలా చేయగా అధికారులు వాటిని పరిశీలించారు. ఒక్క అభ్యర్థి నామినేషన్ కూడా తిరస్కరణకు గురికాలేదు. దీంతో ఐదు మండలాల్లోని ఐదు జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 66మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా ఐదు మండలాల్లోని 62ఎంపీటీసీ స్థానాలకు 365మంది 408సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, దుగ్గొండి మండలంలో ఒక అభ్యర్థికి చెందిన ఎంపీటీసీ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో 62స్థానాలకుగాను 365మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో ఉండే అభ్యర్థులెవరో తేలనుంది.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...