నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి


Fri,April 26, 2019 01:33 AM

పరకాల, నమస్తే తెలంగాణ: ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా పరకాల, నడికూడ మండలాల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. శుక్రవారం నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 10గంటలకు నోటిఫికేషన్ విడుదల చేసి 10.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనన్నారు. పరకాల మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానం కోసం రెండు టేబుళ్ల ద్వారా నామినేషన్ పత్రాలను అందించనున్నారు. 26, 27, 28వ తేదీల్లో మూడు రోజుల పాటు ఈ నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 29వ తేదీన నామినేషన్ల పరిశీలన, సాయంత్రం 5గంటలకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. 30వ తేదీన అప్పీళ్లకు చివరి తేదీకాగా, మే 1న అప్పీళ్లను పరిష్కరించనున్నారు. మే 2వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. మే 10వ తేదీన పరకాల, నడికూడ మండలాల్లో ఎన్నికలు జరగనుండగా 27వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. ఇప్పటికే నడికూడ మండలానికి ముగ్గురు ఆర్వోలు, పరకాల మండలానికి ఇద్దరు ఆర్వోలను నియమించారు. అంతేకాకుండా స్థానిక గణపతి డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్‌రూంలు, కౌంటింగ్ హాల్‌లను ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరిత కళాశాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.

రెండు మండలాల నామినేషన్ల స్వీకరణ పరకాలలోనే
పరకాల మండలంలోని 5ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి సంబంధించిన నామినేషన్లను పరకాల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలోనే స్వీకరించనున్నారు. అదేవిధంగా నూతనంగా ఏర్పడిన నడికూడ మండలానికి చెందిన 10ఎంపీటీసీలు, ఒక జెడ్పీటీసీ నామినేషన్లను కూడా పరకాల ఎంపీడీవో కార్యాలయంలోనే స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు నడికూడ మండలానికి మూడు టేబుళ్లు, పరకాల మండలానికి రెండు టేబుళ్లను ఏర్పాటు చేశారు.

గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నోడ్యూ సర్టిఫికెట్లను అందజేసేందుకు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోనే ఉంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే నామినేషన్ వేయాలనుకునే అభ్యర్థులు, ప్రపోజల్స్ గ్రామపంచాయతీకి చెల్లించాల్సిన అన్నిరకాల పన్నులను చెల్లించాల్సి ఉంటుంది. పోటీ చేయాలనుకునే అభ్యర్థులు పన్నులను చెల్లించి నోడ్యూ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉండగా వారికోసం పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు పంచాయితీ కార్యదర్శులు గ్రామాల్లోనే అందుబాటులో ఉంటారని ఎంపీడీవో బాలకృష్ణ తెలిపారు.

ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్..
పరకాల, నడికూడ మండలాల్లో ప్రాదేశిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర సమితి అన్నింటికన్నా ముందుగానే ప్రకటించింది. బుధవారం పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల, నడికూడ రెండు మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిగెల మౌనిక, పోచారం అభ్యర్థిగా కోరె రమేశ్, నాగారం అభ్యర్థిగా చింతిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, లక్ష్మీపురం అభ్యర్థిగా పల్లెబోయిన సునీత, మల్లక్కపేట అభ్యర్థిగా బొజ్జం రజితను ప్రకటించారు. నడికూడ మండలం నడికూడ ఎంపీటీసీ అభ్యర్థిగా దురిశెట్టి చంద్రమౌళి, చౌటుపర్తి అభ్యర్థిగా కాకర్ల కౌసల్య, నర్సక్కపల్లె అభ్యర్థిగా వరికెల విజయ, కౌకొండ అభ్యర్థిగా మేకల సతీశ్, రాయపర్తి అభ్యర్థిగా పోశాల సరిత, నార్లాపూర్ అభ్యర్థిగా మచ్చ అనసూర్య, వరికోలు అభ్యర్థిగా చంద కుమారస్వామి, చర్లపల్లి అభ్యర్థిగా నందికొండ సుగుణను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రకటించారు. అదేవిధంగా పరకాల జెడ్పీటీసీ అభ్యర్థిగా సిలువేరు మొగిళి, నడికూడ జెడ్పీటీసీ అభ్యర్థిగా కోడెపాక సుమలత అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు.

ఖానాపురంలో
ఖానాపురం: రెండోవిడత మండల పరిషత్ ఎన్నికల్లో భా మండలంలో శుక్రవారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి ఈ నెల 28వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పత్రాల స్వీకరణను మండల పరిషత్ కార్యాలయం లో మూడు క్లస్టర్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి క్లస్టర్‌లో అశోక్‌నగర్- 1, 2, ధర్మరావుపేట, రెండో క్లస్టర్‌లో ఖానాపురం-1, 2, కొత్తూరు, మూడో క్లస్టర్‌లో బుధరావుపేట-1, 2, మంగళవారిపేట ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. జెడ్పీటీసీకి పోటీ చేసే అభ్యర్థులు (జనరల్)అయితే రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ.2500, అదేవిధంగా ఎంపీటీసీకి పోటీచేసే అభ్యర్థులు ఓసీ అయితే రూ.2500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే రూ.1250 చెల్లించాలన్నారు.

రాయపర్తిలో..
రాయపర్తి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మండలంలోని అన్ని గ్రామాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇన్‌చార్జి ఎంపీడీవో మామిడాల రాజన్న తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పరిషత్ ఎన్నికల వివరాలను వెల్లడించారు. మండలంలోని 39గ్రామాల పరిధిలో 16ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానం ఉన్నట్లు చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా రెండో విడతలో మండలంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. మండలంలోని 16ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కోసం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆరు క్లస్టర్‌లు, జెడ్పీటీసీ స్థానం కోసం మరో క్లస్టర్‌ను ఏర్పాట్లు చేసినట్లు మామిడాల రాజన్న చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, రాజకీయ పార్టీలు, పార్టీల నాయకులు ఎన్నిలను విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. ఈ సమావేశంలో ఈవోపీఆర్డీ తక్కళ్లపల్లి రాజ్యలక్ష్మి, శ్యాం సుందర్‌రెడ్డి, మనోరంజన్, శోభారాణి, వరుణ్, యాకస్వామి, రియాజుద్దీన్ పాల్గొన్నారు.

శాయంపేటలో..
శాయంపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు నాలుగు క్లస్టర్లను అధికారులు ఏర్పాటు చేశారు. శుక్రవారం నుంచి నామినేషన్లను శాయంపేట మండల పరిషత్‌లోనే స్వీకరిస్తారని అధికారులు తెలిపారు. మండల పరిధిలో ఉన్న 12ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి నా మినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపా రు. ఇందుకు రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఒకటో క్లస్టర్‌లో తహార్‌పూర్, గట్లకానిపర్తి, ప్రగతిసింగారం ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారని ఆర్వో రవీందర్‌రావును నియమించినట్లు తెలిపారు. రెండో క్లస్టర్‌లో శాయంపేట-1, 2, పత్తిపాక ఎంపీటీసీలు ఉండ గా ఆర్వోగా కృష్ణకుమార్ నియమితులయ్యారు. మూడో క్లస్టర్‌లో మైలారం, పెద్దకోడెపాక-1, 2, ఎంపీటీసీలుండగా ఆర్వో గా కవిత, నాలుగో క్లస్టర్‌లో వసంతాపూర్, కాట్రపల్లి, కొప్పుల ఎంపీటీలకు ఆర్వోగా నాగచందర్ నియమితులయ్యారు. రిజర్వ్‌డ్ ఆర్వోలుగా పట్టాబీ, మోహన్‌రావు ఉంటారని అధికారులు తెలిపారు. ఇక జెడ్పీటీసీ నామినేషన్లను స్థానిక ఎంపీపీ చాంబర్‌లో మండల ప్రత్యేక అధికారి హరిప్రసాద్ స్వీకరిస్తారని వెల్లడించారు. మండల పరిషత్‌లోనే 4 క్లస్టర్లకు నాలుగు గదుల్లో ఏర్పాటు చేశారు. నేడు ఎన్నికల నోటీసును జారీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారని తెలిపారు. 29న పరిశీలించి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు. 30న అప్పీల్ చేసుకునే అవకాశం ఉందన్నారు. మే 2న ఉపసంహరణకు అవకాశం ఉంటుందన్నారు. 10వ తేదీన ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ ఉంటుందని 27న ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నామినేషన్ సమయంలో అభ్యర్థులు నామినేషన్ పత్రం, స్వీయ ప్రకటన ఇద్దరు సాక్షుల సంతకాలో ఇవ్వాలన్నారు. అభ్యర్థి డిక్లరేషన్, కులం సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా జిరాక్సు, బాకీ లేని ధ్రువ పత్రం గ్రామ పంచాయతీ ద్వారా జతచేసి, డిపాజిట్ డబ్బులతో దాఖలు చేయాలని సూచించారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...