పంట నష్టానికి పరిహారం


Fri,April 26, 2019 01:33 AM

ఖానాపురం, ఏప్రిల్ 25 : పాకాల ఆయకట్టులో తైబందీ నిర్ణయించిన సర్వే నంబర్లలో పంటలు ఎండిపోయిన రైతులందరికీ ప్రత్యేక జీవో ద్వారా నష్టపరిహారం అందిస్తానని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం కొత్తూరు శివారులోని తుంగబంధం కాలువ పారకంలో నీరందక ఎండిపోయిన వరి పంటలను ఎమ్మెల్యే పెద్ది పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉన్నందున రైతులు అధైర్యపడవద్దన్నారు. ఇప్పటికే ఎండిన పంటలను వ్యవసాయాధికారులు పరిశీలించారని, త్వరలోనే రెవెన్యూ అధికారులు సైతం పరిశీలిస్తారన్నారు. కౌలు రైతులు అధికంగా ఉన్న ప్రాంతమైనందున ఎండిన పంటలకు ప్రభుత్వం ఇచ్చే పంట నష్టపరిహారం సర్వేలో కౌలు రైతులను కూడా చేర్చి వారికి నేరుగా పరిహారం అందించేలా కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం పంటలు ఎండిన పాపం గత పాలకుల కాంట్రాక్టుల పుణ్యమేనన్నారు. ఎత్తు వెడల్పు తగ్గించి కాల్వలు నిర్మించడం వల్లే చివరి ఆయకట్టుకు నీరందడం లేదన్నారు. పాకాల రైతులకు ఇదే చిట్టచివరి కష్టకాలమన్నారు. మరో రెండు నెలల్లో పాకాల ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ఇక ప్రతీ సంవత్పరం రెండు పంటలు పండించేలా చర్యలు చేపడతామన్నారు. సంగెం కాలువకు నీరందక పోవడంతో 400 కేవీఏ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేసి మోటార్లతో నీటిని పంపింగ్ చేయిస్తున్నామన్నారు. రైతులు వాటని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే
కొత్తూరు శివారులోని తుంగబంధం చివరి ఆయకట్టులో కౌలు రైతులు తమకు పంటనష్టపరిహారం ఇప్పించాలని కోరడంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కలెక్టర్ హరితతో ఫోన్లో మాట్లాడారు. అధికారులు చేపట్టే సర్వేలో కౌలు రైతులకు ప్రత్యేక కాలం ఉంచి, వారికి పరిహారం అందాలని చూడాలన్నారు. అందుకు కలెక్టర్ అంగీకరించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు వేములపల్లి ప్రకాశ్‌రావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు భాషబోయిన అయిలయ్య, బూస రమ, సదర్‌లాల్, బొప్పిడి పూర్ణచందర్‌రావు, బొబ్బ విద్యాసాగర్‌రావు, నాగార్జునరెడ్డి, మండలకోటి, బాలు, తక్కళ్లపల్లి బాబురావు, రైతులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...