గాలిదుమారం.. అతలాకుతలం


Mon,April 22, 2019 02:58 AM

-జిల్లాలో పలు చోట్ల పంట నష్టం
-నేలరాలిన మామిడి కాయలు
-దెబ్బతిన్న మొక్కజొన్న పంట
-పలుచోట్ల తెగిన విద్యుత్ తీగలు
-సరఫరాలో అంతరాయం
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : గాలిదుమారం అతలాకుతలం చేసింది. శనివారం రాత్రి ఒక్కసా రి భారీగా ఈదురు గాలులతో వర్షం పడింది. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్ లైన్లపై చెట్లు పడిపోయి తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. వర్ధన్నపేట సమీపంలోని ఆకేరు వాగు వద్ద విద్యుత్ లైన్‌పై తాటిచెట్టు కూలడంతో తెగిపోయింది. దీంతో ఆదివారం ఇల్లంద గ్రామానికి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, మూడు రోజుల క్రితం వచ్చిన గాలిదుమారానికి మామిడితోటల్లో భారీగా కాయలు రాలిపోయాయి. శనివారం రాత్రి కూడా గాలివానకు మరోసారి కాయ లు పెద్ద సంఖ్యలో రాలాయి. ఇల్లంద మార్కెట్‌తో పాటు పలు కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన వరి ధాన్యం తడిసింది. రైతులు అప్రమత్తమై టార్పాలిన్లు కప్పుకున్నప్పటికీ అవి సరిపోక పోవడంతో పట్టాలు లేని ధాన్యం తడిసింది. అలాగే, కోతకు వున్న వరి పంట నేలకు ఒరగడంతో పాటు ధాన్యం పంట భూముల్లో రాలిపోయి రైతులు నష్టపోయారు. ఇల్లంద, ల్యాబర్తి, కట్య్రాల, నల్లబెల్లి తదితర గ్రామాల్లో విద్యుత్ సిబ్బంది ఆదివారం ఉదయం నుంచి సాయం త్రం వరకు విద్యుత్ లైన్లకు మరమ్మతు చేసి సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారు.

గవిచర్లలో ఎగిరిపోయిన దేవాలయం పైకప్పు
సంగెం : గాలిదుమారానికి మండలంలోని గవిచర్లలో గుండ బ్రహ్మయ్య దేవాలయం పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. అలాగే, గోడ కూలింది. దీంతో గ్రామస్తులు, ఆలయ కమిటీ పైకప్పు, గోడ నిర్మించేందుకు ముందుకు వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, మండలంలోని ఎల్గూర్‌రంగంపేట గ్రామంలో రెండు రోజులుగా అకాల వానకు దెబ్బతిన్న పంట పొలాలను రాష్ట్ర రైతు సంఘం జిల్లా సమితి ప్రధానకార్యదర్శి వీరగోని శంకరయ్య పరిశీలించారు. ఈ సందర్బంగా శంకరయ్య మాట్లాడుతూ పంట నష్టపోయిన వరికి రూ.20వేలు, మొక్కజొన్నకు రూ.15వేలు, పుచ్చతోటకు రూ.10వేలు, కాయగూరలకు రూ.5వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు కడారి దేవేందర్, కడారి పాణి, నారగోని రామచంద్రు, నాయకులు బొల్లం మల్లయ్య, ఇమ్మడి యాకరాములు పాల్గొన్నారు.

పంటలకు తీవ్ర నష్టం
నర్సంపేట రూరల్ : ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం ప్రజలకు, రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించింది. మండలంలోని ముగ్ధుంపురం, మాదన్నపేట, లక్నెపల్లి గ్రామాల్లోని మామిడి తోటలకు భారీ నష్టం సంభవించింది. తోటలోని మామిడికాయలు నేలరాలాయి. మాదన్నపేట, మహేశ్వరం గ్రామాల్లో రైతులు సాగుచేసిన మొక్కజొన్న పంటలు ఈదురుగాలులకు నేలవాలాయి. పసుపు రైతులకు కూడా కొంత నష్టం వాటిల్లింది. వర్షానికి దెబ్బతిన్న పంట ఉత్పత్తులను అన్నింటిని కొనుగోలు చేయాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు. అలాగే, ఈదురుగాలులకు మహేశ్వరం గ్రామానికి చెందిన పులుగుల సూరమ్మ-రంగారెడ్డి దంపతుల ఇల్లు కూలిపోయింది.
నెక్కొండ : మండలంలో మామిడితోటలకు తీవ్రం గా నష్టం వాటిల్లింది. చంద్రుగొండ గ్రామం లో కౌలుకు తీసుకొని నిర్వహిస్తున్న మామిడి తోటలో భారీస్థాయిలో మామిడికాయలు నేలరాలాయి. ఆరుగాలం చెమటోడ్చి మామిడి తోటలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న రైతులు ప్రకృతి ప్రకోపంతో ఒక్కసారిగా తల్లడిల్లారు. గ్రామంలో సొంటిరెడ్డి రవీందర్‌రెడ్డికి చెందిన తొమ్మిది ఎకరాల మామిడి తోటలో కాయలు నేలరాలి, రూ.ఆరులక్షల మేర నష్టం వాటిల్లిందని రైతులు బొనగాని వెంకన్న, దొంగరి కొమురయ్య వాపోయారు. తమను ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని కోరారు. అలాగే, అప్పల్‌రావుపేట, గొట్లకొండ గ్రామాల్లోని మామిడితోటల్లో మామిడికాయలు నేలరాలి నష్టం వాటిల్లింది.

ఖానాపురం : మండలంలోని కొత్తూరు శివారులోని మామిడితోటలో పెద్ద ఎత్తున కాయలు నేలరాలడంతో భారీ నష్టం సంభవించింది. మదర్‌థెరిస్సా మహిళా సంఘం సభ్యులు ఆరు ఎకరాల్లోని మామిడితోట సాగుచేస్తున్నారు. కొద్ది రోజుల్లో కాయలు కోత దశకు చేరుకోనున్నాయి. ఈ క్రమంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి తోటలో 80 శాతం కాయలు నేలరాలాయి. దీంతో రూ.లక్షల నష్టం వాటిల్లింది.

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎర్రబెల్లి
పర్వతగిరి : మండలంలోని వడ్లకొండ గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద శనివారం రాత్రి కురిసిన వానకు తడిసిన వరి ధాన్యాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదివారం పరిశీలించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ధాన్యం తడిసిందని రైతులు ఎలాంటి ఆవేదన చెందవద్దని, ప్రభుత్వం దీన్ని కూడా కొనుగోలు చేస్తుందని తెలిపారు. గిట్టుబాటు ధర లభించేందుకు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. అధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. అలాగే, వడ్లకొండ గ్రామంలో మామిడితోటలో కాయలు రాలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని పీఏసీఎస్ వైస్ చైర్మన్ పరమేశ్వర్‌రావు తెలిపారు. అన్నారం, కొంకపాక, పర్వతగిరి, చింతనెక్కొండ గ్రామాలలో వీచిన గాలులకు మామిడి కాయలు, పిందెలు రాలిపోయాయి.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...